రాయదుర్గంలో ఎన్‌ఐఎ సోదాలు

May 22,2024 09:03 #NIA raids, #rayadurgam

-సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ను అదుపులోకి తీసుకున్న అధికారులు
-బెంగళూరుకు తరలింపు!
ప్రజాశక్తి- రాయదుర్గం (అనంతపురం జిల్లా) :అనంతపురం జిల్లా రాయదుర్గంలోని తహశీల్దార్‌ రోడ్‌ వేణుగోపాలస్వామి గుడి వీధిలోగల రిటైర్డ్‌ ప్రధానోపాధ్యాయులు అబ్దుల్లా ఇంట్లో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఎ) అధికారులు మంగళవారం తెల్లవారుజామున సోదాలు నిర్వహించారు. ఆయన పెద్ద కుమారుడు, సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ సోహెల్‌ను అదుపులో తీసుకొని విచారించారు. అనంతరం స్థానిక పోలీస్‌ స్టేషన్‌కు తరలించి రెండు గంటల పాటు విచారణ తర్వాత ఆ యువకుడిని బెంగళూరుకు తీసుకెళ్లినట్టు సమాచారం. సోహెల్‌ బెంగళూరులో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా పనిచేస్తున్నారు. వర్క్‌ఫ్రం హోం కారణంగా కొంతకాలంగా ఇంట్లోనే విధులు నిర్వహిస్తున్నారు. సోహెల్‌కు ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నాయనే సమాచారంతో ఎన్‌ఐఎ అధికారులు రాయదుర్గంలో తనిఖీలు చేశారు. ఆయన ఫోన్‌కాల్‌ రికార్డు డేటాను పరిశీలించినట్లు సమాచారం. సోహెల్‌కు చెందిన రెండు ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. ఫిబ్రవరి 28న సోహెల్‌కు పెళ్లయింది. మున్సిపల్‌ ప్రాథమిక పాఠశాలల ప్రధానోపాధ్యాయులుగా పనిచేస్తున్న ఆయన తండ్రి అదే నెల 29న ఉద్యోగ విరమణ పొందారు. సోహెల్‌ బెంగళూరులో ఉన్నప్పుడు ఉగ్రవాదులు ఆయన ఫోన్‌ను ఉపయోగించినట్లు ఎన్‌ఎఐ అధికారులు అనుమానిస్తున్నారు. బెంగళూరులోని రామేశ్వరం కేఫ్‌లో మార్చి మొదటి తేదీన భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ప్రధాన నిందితులను పశ్చిమ బెంగాల్లో ఎన్‌ఐఎ అధికారులు అరెస్టు చేశారు. విచారణలో వారి నుంచి సేకరించిన వివరాల ఆధారంగా దర్యాప్తు ముమ్మరం చేశారు. సోహెల్‌కు సంబంధం ఉందనే అనుమానంతో ఆయనను ఆదుపులోకి తీసుకున్నారు. సోదాల సమయంలో ఆ ఇంటి సమీపానికి, పోలీస్‌ స్టేషన్‌ వద్దకు ఎవరినీ రానివ్వలేదు. ఎటువంటి సమాచారమూ మీడియాకు వెల్లడించలేదు. రాయదుర్గంలో ఎన్‌ఐఎ అధికారుల దర్యాప్తు సంచలనం సృష్టించింది.
నాలుగు రాష్ట్రాల్లోని 11 ప్రాంతాల్లో సోదాలు
రామేశ్వర కేఫ్‌ బ్లాస్ట్‌ కేసుకు సంబంధించి నాలుగు రాష్ట్రాల్లోని 11 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించినట్టు ఎన్‌ఐఎ ఒక ప్రకటనలో తెలిపింది. ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాల్లో ఈ తనిఖీలు కొనసాగాయి. ఈ కేసులో 11 మంది అనుమానితుల ఇళ్లలో సోదాలు జరిగినట్లు పేర్కొంది. మార్చి ఒకటో తేదీన బెంగళూరు నగరంలోని రామేశ్వరం కేఫ్‌లో సంభవించిన బాంబుపేలుడు కేసులో కర్ణాటకు చెందిన ముస్వఫకీర్‌ హుస్సేన్‌, అబ్దుల్‌ మతీన్‌ సహా ఇద్దరు నిందితులు ఇది వరకే పట్టుబడ్డారు. వీరిచ్చిన సమాచారం మేరకు ఈ కుట్రలో భాగస్వాములైనట్టు భావిస్తున్న 11 మంది నిందితుల కోసం ఈ సోదాలు సాగినట్టు ఎన్‌ఐఎ జారీ చేసిన ప్రకటనలో పేర్కొంది.

➡️