గుండెపోటుతో పంచాయతీ కార్మికుడు మృతి

గుండెపోటుతో పంచాయతీ కార్మికుడు మృతి

కార్మికుడు రాజు మృతదేహానికి పూలమాల వేసి నివాళులర్పిస్తున్న సిఐటియు నాయకులు

ప్రజాశక్తి-తాడిపత్రి రూరల్‌

మండల కేంద్రంలో నివాసం ఉంటున్న పంచాయతీ కార్మికుడు రాజు (47) బుధవారం తెల్లవారుజామున గుండెపోటుతో మృతిచెందాడు. విషయం తెలుసుకున్న సిఐటియు నాయకులు, తోటి కార్మికులు రాజు స్వగృహానికి వెళ్లి మృతదేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి రూ.5వేలు ఆర్థికసాయం అందజేశారు. ఈ సందర్భంగా సిఐటియు నాయకులు జగన్మోహన్‌రెడ్డి మాట్లాడుతూ రాజు గన్నెవారిపల్లి పంచాయతీలో 16ఏళ్లుగా పంచాయతీ కార్మికుడిగా విధులు నిర్వహిస్తూ చురుగ్గా పని చేసేవాడన్నారు. కరోసా లాంటి సమయంలో కూడా ప్రాణాలకు తెగతించి పని చేశాడన్నారు. ఎన్నోఏళ్లుగా పని చేస్తున్నప్పటికీ పీఎఫ్‌, ఈఎస్‌ఐ వంటి సౌకర్యాలు లేకపోవడం బాధాకరమన్నారు. పంచాయతీ కార్మికుడు ఆకస్మికంగా గుండెపోటుతో మృతిచెందితే పంచాయతీ అధికారులు, ఉన్నతాధికారులు కనీసం చూసిన పాపానపోలేదన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్సందించి పంచాయతీ కార్మికులకు తక్షణమే నెలనెలా వేతనాలు, పనిచేసే సమయంలో భద్రతా పరికరాలు, పిఎఫ్‌, ఇఎస్‌ఐ వంటి సౌకర్యాలు కల్పించాలని కోరారు. అలాగే రాజు కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించి, రూ.2లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్మికులు ఓబయ్య, సంధ్యాభారు, రాణి, అచ్చమ్మ, రామాంజి, రవి, రంగా, చలపతి, హనుమంతు, తదితరులు పాల్గొన్నారు.

➡️