శ్రీరామిరెడ్డి కార్మికులకు బకాయి వేతనాలు చెల్లించాలి

శ్రీరామిరెడ్డి కార్మికులకు బకాయి వేతనాలు చెల్లించాలి

కలెక్టరేట్‌ ఎదుట ఆందోళన చేస్తున్న సిఐటియు నాయకులు, కార్మికులు

ప్రజాశక్తి-అనంతపురం కలెక్టరేట్‌

శ్రీరామరెడ్డి తాగునీటి సరఫరా పథకంలో పని చేస్తున్న కార్మికులకు బకాయి వేతనాలు చెల్లించాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్‌.నాగేంద్రకుమార్‌ డిమాండ్‌ చేశారు. సోమవారం సిఐటియు ఆధ్వర్యంలో కలెక్టరేట్‌ ఎదుట నిరసన తెలిపారు. అనంతరం కలెక్టరేట్‌లో డిఆర్‌ఓ రామకృష్ణారెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంట్రాక్టర్‌ శివశంకర్‌రెడ్డి రాయదుర్గం, కళ్యాణదుర్గం కార్మికులకు చెల్లించాల్సిన వేతనంలో రూ.2వేలు కోత విధించాడని తెలిపారు. నీలకంఠాపురం శ్రీరామిరెడ్డి తాగునీటి పథకం ఫేస్‌ -4 రాయదుర్గం, కళ్యాణ్‌ దుర్గం కార్మికులు సుమారు 15 సంవత్సరాలుగా 600 గ్రామాలకు, 280 మంది కార్మికులు నిరంతరం ప్రజలకు త్రాగునీరు అందిస్తున్నారని తెలిపారు. కార్మికులకు 2022 సంవత్సరం నుంచి కాంట్రాక్టర్‌ శివారెడ్డి రూ.16,500 వేతనం, రూ.1500 పిఎఫ్‌తో కలిపి మొత్తం రూ.18 వేలు కార్మికులకు చెల్లించేవారని తెలిపారు. ఇప్పుడు రాయదుర్గం, కళ్యాణదుర్గం ప్రస్తుత కాంట్రాక్టర్‌ శివశంకర్‌రెడ్డి కార్మికులకు కేవలం రూ.14,250 వేతనం మాత్రమే చెల్లిస్తున్నారని తెలిపారు. కాంట్రాక్టర్‌ పిఎఫ్‌ కూడా కట్టడం లేదన్నారు. వేతనం కూడా ఈనెల 12న కలెక్టర్‌ దృష్టికి తీసుకురావడంతో తక్కువ వేతనం కార్మికులకు చెల్లించారని తెలిపారు. అందులో కొంతమంది ప్రస్తుతం పని చేస్తున్న 20 మంది కార్మికులకు జీతాలు వేయలేదన్నారు. వేతనాలలో వ్యత్యాసం 15 సంవత్సరాల నుంచి పని చేస్తున్న కార్మికులకు రూ. 8 వేలు, రూ.14 వేలు మాత్రమే చెల్లించారని తెలిపారు. ఈ కాంట్రాక్టర్‌ పెట్టుకున్న సుమారు 30 మంది తన మనుషులకు రెండు నెలల అనుభవం లేదన్నారు. అయినా వారికి రూ.16 వేలతో వేతనం చెల్లించారని తెలిపారు. 15 సంవత్సరాల నుంచి ఈ పథకంలో పని చేస్తున్న కార్మికులకు పిఎఫ్‌ పూర్తిగా ఎగ్గొట్టాలని చూస్తున్నారని తెలిపారు. బోగస్‌ కార్మికులు కూడా 30 మంది పైగా కాంట్రాక్టర్లు అధికారులు కుమ్ముకై అదనంగా వేతనాలు దొబ్బేస్తున్నారని తెలిపారు. కాంట్రాక్టర్‌ శివశంకర్‌రెడ్డికి ఎలాంటి అనుభవం లేదన్నారు. పైపులైను లీకేజీ వస్తే లీకేజీని పూర్తి చేసేందుకు 5 నుంచి 6 రోజులు సమయం పడుతుందని, ఈ కాంట్రాక్టర్‌ వద్ద లీకేజీకి సంబంధించిన పరికరాలు, సరైన మెటీరియల్‌ లేవన్నారు. ప్రజాధనాన్ని లూటీ చేస్తున్న కాంట్రాక్టర్‌ శివశంకర్‌ రెడ్డి పై తగు చర్యలు తీసుకుని కార్మికులకు రావాల్సిన రూ.16,500తోపాటు పిఎఫ్‌ కార్మికుని వాటా రూ.1500, కాంట్రాక్టర్‌ వాటా రూ.1500లు మొత్తం రూ. 3 వేలు పీఎఫ్‌ చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో శ్రీరామిరెడ్డి తాగునీటి పథకం యూనియన్‌ జిల్లా అధ్యక్ష, కార్యదర్శి, కోశాధికారి ఎర్రిస్వామి, రాము, హొన్నూరు స్వామి, నాయకులు నరేష్‌, అశోక్‌, రమేష్‌, ప్రకాష్‌, చిత్తప్ప, రాందాస్‌, శివ తదితరులు పాల్గొన్నారు.

➡️