కౌలు రైతుల సమస్యలు పరిష్కరించాలి

కౌలు రైతుల సమస్యలు పరిష్కరించాలి

సంతకాల సేకరిస్తున్న కౌలు రైతుసంఘం నాయకులు

ప్రజాశక్తి-వజ్రకరూరు

జిల్లాలోని కౌలు రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కౌలు రైతుసంఘం జిల్లా నాయకులు బాల రంగయ్య, రంగారెడ్డి డిమాండ్‌ చేశారు. మంగళవారం కౌలు రైతుసంఘం ఆధ్వర్యంలో ఉరవకొండలో సంతకాల సేకరణ చేపట్టారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కౌలు రైతులకు సిసిఆర్‌సి కార్డు అందాలంటే రైతు సంతకం నిబంధన తొలగించాలన్నారు. గ్రామసభల ద్వారా సిసిఆర్‌సి కార్డులు అందజేసి కౌలు రైతులకు బ్యాంకు రుణాలు, పంట నష్టపరిహారం, బీమా అందించడంతోపాటు ఆత్మహత్యల పరిహారం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. అలాగే రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర చట్టం చేసి స్థానికంగా ఉన్న మార్కెట్లలో అమ్ముకునే సౌకర్యం కల్పించి ఆదుకోవాలని కోరారు. నియోజకవర్గంలోని మిర్చి, పత్తిలాంటి వాణిజ్య పంటలు అమ్ముకునేందుకు శీతల గిడ్డంగులు ఏర్పాటు చేయాలన్నారు. హంద్రీనీవా, హెచ్‌ఎల్‌సి, జిబిసి ఆయకట్టు కింద ఉన్న పంట పొలాలకు సక్రమంగా నీరు అందించాలని, ఉపాధి హామీ పథకం ద్వారా కాలువల పూడికతీత చేపట్టి పిల్ల కాలువల ద్వారా ఆయకట్టుకు సాగునీరు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. అలాగే దేవాలయ భూములు భూములేని పేదలకు ఇవ్వాలన్నారు. ఆయా సమస్యల పరిష్కారానికే సంతకాలు సేకరణ చేపట్టినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కౌలు రైతుసంఘం నాయకులు వెంకటేశు, మురళి, కౌలు రైతులు పాల్గొన్నారు.

➡️