యువకుడి దారుణ హత్య

  • మృతుడు, ప్రధాన నిందితుడు వైసిపి వారే

ప్రజాశక్తి- మదనపల్లి (అన్నమయ్య జిల్లా) : అన్నమయ్య జిల్లా మదనపల్లె పట్టణంలో వైసిపి నాయకుడు దారుణ హత్యకు గురయ్యారు. హత్యకు గురైన వ్యక్తి, ప్రధాన నిందితుడు వైసిపికి చెందిన వారే. ఆధిపత్య పోరే ఈ ఘటనకు కారణం. హత్యకు గురైన వ్యక్తిపై రెండు హత్య కేసులు ఉన్నాయి. పోలీసుల కథనం ప్రకారం… పట్టణంలోని గొల్లపల్లి దళితవాడకు చెందిన కొండుపల్లి ఆనంద్‌, ఆయన అనుచరులు చరణ్‌, మణికంఠ, చిన్నారెడ్డి మరికొంతమంది కలిసి శనివారం వేకువజామున అమ్మచెరువుమిట్ట అనపగుట్ట శివారు ప్రాంతంలో ఉంటున్న పుంగనూరు శేషాద్రి (35) ఇంటి తలుపులు పగలగొట్టి దౌర్జన్యంగా ఇంట్లోకి చొరబడ్డారు. కత్తులు, వేట కొడవళ్లతో దాడి చేసి ఆయనను అతి కిరాతకంగా హత్య చేసి పరారయ్యారు. సంఘటనా స్థలాన్ని మదనపల్లె డిఎస్‌పి ప్రసాద్‌రెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన విలేకర్లతో మాట్లాడారు. బహుజనసేన సంస్థను శేషాద్రి, ఆనంద్‌ కలిసి ఏర్పాటు చేశారని, వారిద్దరూ కలసి సెటిల్మెంట్లు చేసేవారని ఆయన చెప్పారు. రామారావు కాలనీలో అంబేద్కర్‌ విగ్రహాన్ని శేషాద్రి ఏర్పాటు చేయడం, సొంతంగా సెటిల్మెంట్‌ చేస్తుండడంతో ఇరువురి మధ్య వివాదం ఏర్పడిందని తెలిపారు. గతంలో ఇద్దరి మధ్య జరిగిన గొడవల్లో రెండో పట్టణ పోలీస్‌ స్టేషన్లో పరస్పరం ఫిర్యాదులు చేసుకున్నారని చెప్పారు. వీద్దరిరూ వైసిపికి చెందిన వారేనని తెలిపారు. తన దందాలకు అడ్టొస్తున్న శేషాద్రిని అంతమొందించాలని ఆనంద్‌ పధకం ప్రకారం తన అనుచరులతో కలిసి హత్య చేశాడని చెప్పారు. ప్రస్తుతానికి ఆరుగురిపై హత్య కేసు నమోదు చేశామని తెలిపారు. ఇంకా కొంతమంది ఉన్నట్లు తెలిసిందని చెప్పారు. ఎవరినీ వదిలిపెట్టే ప్రసక్తి లేదని తెలిపారు. నిందితులను పట్టుకునేందుకు వన్‌ టౌన్‌ సిఐ వల్లి బాషా, టూ టౌన్‌ సిఐ యువరాజ్‌, రూరల్‌ సిఐ శేఖర్‌లతో మూడు బృందాలను ఏర్పాటు చేశామని చెప్పారు. 2014, 2020 సంవత్సరాల్లో నమోదైన రెండు హత్య కేసుల్లో ఆనంద్‌ ప్రధాన ముద్దాయని, ప్రస్తుత్తం ఈ కేసులు కోర్టులో నడుస్తున్నాయని డిఎస్‌పి తెలిపారు.

➡️