ఘనంగా బక్రీద్ పర్వదిన వేడుకలు 

Jun 17,2024 10:08 #Annamayya district

ప్రజాశక్తి-నిమ్మనపల్లి: మండల పరిధిలో బక్రీద్ పర్వదిన వేడుకలు ముస్లిం మైనారిటీ పెద్దల ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. నిమ్మనపల్లి, కొండయ్యగారిపల్లె, సైదాపేట, రాచవేటివారిపల్లె, చౌకిళ్ళవారిపల్లె, ముష్టూరు, చల్లవారిపల్లె, సింగంవారిపల్లె, సఖిబండవారిపల్లె, తురకపల్లె తదితర గ్రామాల్లో పండుగను భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. ఉదయం ఊరేగింపుగా మసీదులు, ఈద్గాల వద్దకు వెళ్లి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. నిమ్మనపల్లెలోని జామియానా, అబూఅనీఫా మసీదులలో ముత్తవల్లీల ప్రత్యేక ప్రార్థనల అనంతరం ధార్మికో ఉపన్యాసం చేశారు. దైవ ప్రవక్త ఇబ్రహీం మహోన్నత త్యాగాన్ని స్మరించుకుంటూ బక్రీద్ పండుగను జరుపుకుంటున్నారన్నారు. త్యాగ నిరతికి బక్రీద్ పండుగ నిదర్శనమని అన్నారు. ధనిక, పేద అన్న తారతమ్యం లేకుండా రాగద్వేషాలకు అతీతంగా మైనారిటీలందరూ భక్తిశ్రద్ధలతో ఈ పండుగను జరుపుకుంటున్నట్లు తెలిపారు. ప్రతి ఒక్కరూ దాన గుణం, సేవాగుణం అలవర్చుకోవాలని చెప్పారు. పండుగ సందర్భంగా ముస్లిం సోదరులు ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకుంటూ, బంధుమిత్రులతో సంతోషంగా గడిపారు. బక్రీద్ విశిష్టతలో భాగమైన ఖుర్బానీ ని చుట్టుపక్కల వారికి దానంగా అందజేశారు.

➡️