కూరగాయల ధరలు అదుపులో ఉంచాలి

Jun 26,2024 14:44 #Kakinada

సిపిఎం డిమాండ్

ప్రజాశక్తి-కాకినాడ : ఇటీవల విపరీతంగా పెరిగిన కూరగాయల ధరలను అదుపులో ఉంచాలని సిపిఎం డిమాండ్ చేసింది. స్థానిక సుందరయ్య భవన్ లో దుంపల ప్రసాద్ అధ్యక్షతన సిపిఎం నగర జనరల్ బాడీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సిపిఎం జిల్లా నాయకులు దువ్వ శేషబాబ్జీ మాట్లాడుతూ ఇటీవల అన్ని రకాల కూరగాయల ధరలు విపరీతంగా పెరిగి సామాన్య మధ్యతరగతి కుటుంబాలు చాలా ఇబ్బందులు పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఆకలి సూచిక లో, పౌష్టికాహారం లో వెనుకబడిన మన దేశంలో నిత్యావసరాలు, కూరగాయల ధరల పెరుగుదల వల్ల ప్రజలు ఆహార స్వీకరణకు పరిమితులు విధించుకుంటున్నారని తెలిపారు. కార్మికుల వేతనాలు కంటే ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ యంత్రాంగం ధరల స్థిరీకరణ కొరకు పటిష్టమైన ఏర్పాట్లు చేయాలన్నారు. దళారీ వ్యవస్థ పై ఉక్కుపాదం మోపాలన్నారు. సంబంధిత అధికారులు స్పందించి కూరగాయల ధరలు అదుపులో ఉంచడానికి తగిన చర్యలు తీసుకోవాలని లేనిపక్షంలో ఆందోళన చేపడతామన్నారు. సమావేశం లో ముందుగా ఇటీవల మరణించిన సిపిఎం నాయకులు సిహెచ్. సత్యనారాయణ రాజు, తూర్పుగోదావరి జిల్లా సిఐటియు ప్రధాన కార్యదర్శి బి. రాజులోవ, పార్టీ అభిమాని సావిత్రమ్మలకు సంతాపం తెలిపారు. సిపిఎం నగర కన్వీనర్ పలివెల వీరబాబు భవిష్యత్తు కర్తవ్యాలు ప్రవేశపెట్టారు. ఈ కార్యక్రమంలో నగర కమిటీ సభ్యులు కె. నాగ జయ, సిహెచ్. వేణు, మలక వెంకట రమణ, సూరిబాబు లతో పాటు సుబ్బారావు, స్వామి, వెంకట్రావు, హరనాధ్, ఏడుకొండలు, సతీష్, వాసు, సంజయ్, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

➡️