23 నుంచి అన్నమయ్య వర్ధంతి ఉత్సవాలు

ప్రజాశక్తి-రాజంపేట అర్బన్‌ పద కవితా పితామహుడు, తొలి వాగ్గేయకారుడు శ్రీతాళ్లపాక అన్నమాచార్యుల 616వ వర్ధంతి ఉత్సవాలు తాళ్లపాక, బోయినపల్లిలోని 108 అడుగుల అన్నమయ్య విగ్రహం వద్ద ఈ నెల 23 నుంచి 25వ తేదీ వరకు ఘనంగా నిర్వహించనున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఈ ఉత్సవాలు నిర్వహిస్తారు. 23వ తేదీ ఉదయం 9 గంటలకు తిరుపతి అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులచే గోష్టి గానం, సప్తగిరుల సంకీర్తనం ఉంటుంది. 10.30 గంటలకు శ్రీనివాస కళ్యాణం, సాయంత్రం 6 గంటలకు ఉదయం భాస్కర్‌, హేమమాలిని బృందంచే సంగీత సభ, సాయంత్రం 6.30 గంటలకు అన్నమయ్య 108 అడుగుల విగ్రహం వద్ద శ్రీవారికి ఊంజల సేవ, 7 గంటలకు వై.శ్రీనివాస్‌, ఎం.లక్ష్మీ కుమారి బృందంతో హరికథ కార్యక్రమాలు ఉంటాయి. 24వ తేదీ సాయంత్రం 6 గంటలకు తాళ్లపా కలో సుబ్రహ్మణ్యం, దేవిక, ఆర్‌.శ్యాం కుమార్‌, తులసి భాయి బృందం వారిచే సంగీత సభలు, రాత్రి 7 గంటలకు జి.అనసూయ, జి.వనజ కుమారిలచే హరికథ కాలక్షేపం ఉంటుంది. 25వ తేదీ సాయంత్రం 6 గంటలకు ఎం.రవిచంద్ర, ఎ.మోనాలిని బృందంచే సంగీత సభ, రాత్రి 7 గంటలకు ఎం.మాధవి బృందం వారిచే తాళ్లపాకలో హరికథ, అన్నమయ్య 108 అడుగుల విగ్రహం వద్ద శ్రీ కోదండరామ కళానాట్యమండలి బృందం బోయినపల్లె వారిచే ప్రత్యేక నాటక ప్రదర్శన కార్యక్రమాలు ఉంటాయి. రాజంపేట చుట్టుపక్కల ప్రాంత ప్రజలు పాల్గొని ఉత్సవాలను జయప్రదం చేయాలని తాళ్లపాక ఆలయాల ఇన్‌స్పెక్టర్‌ బాలాజీ ఈ సందర్భంగా కోరారు.

➡️