కిడ్నాప్‌ కేసులో మరొకరికి జీవిత ఖైదు

Apr 8,2024 23:52

ప్రజాశక్తి – గుంటూరు లీగల్‌ : వైద్య విద్యార్థినిని కిడ్నాప్‌ చేసి తండ్రి నుంచి డబ్బు గుంజాలని చూసిన గ్యాంగ్‌లో ఒకడైన కంకిపాడు మండలం ఉప్పులూరుకు చెందిన మంద రవికి జీవిత ఖైదు విధిస్తూ గుంటూరు నాలుగవ అదనపు జిల్లా జడ్జి రుద్రపాటి శరత్‌బాబు సోమవారం తీర్పు చెప్పారు. ప్రాసిక్యూషన్‌ కథనం ప్రకారం.. విజయవాడ సూర్యారావుపేటలో ఇఎన్‌టి హాస్పిటల్‌ నడుపుతున్న ఓ డాక్టర్‌ కుమార్తె ఎన్నారై మెడికల్‌ కళాశాలలో చదువుతున్నారు. ఆమె ప్రతిరోజూ కళాశాలకు కారులో వచ్చి వెళ్లేవారు. ఈ కారుకు పిన్నెబోయన ప్రసాద్‌ అనే వ్యక్తి డ్రైవర్‌గా పనిచేసేవాడు. ఈయన తన స్నేహితులైన మంద రవి, ఉయ్యూరు ఆలీ, పరిమి నాగరాజు, రాణి మేకల వెంకన్నతో కలిసి తమ యజమాని కుమార్తెను కిడ్నాప్‌ చేసి డబ్బు వసూలు చేయాలని పథకం రచించాడు. 2017 జూన్‌ 8న సాయంత్రం కళాశాల నుంచి ఇంటికి తిరిగి వెళ్లేందుకు ఆమె కారులో ఎక్కి కూర్చున్నారు. కారును కొంత దూరం తీసుకువెళ్లాక మంద రవి, ఉయ్యూరు ఆలీ, పరిమి నాగరాజు, వెంకన్న కారులో ఎక్కి ఆమెను కాళ్లు చేతులు బంధించారు. అనంతరం ఆమె ఫోన్‌ నుంచి ‘మీ అమ్మాయిని కిడ్నాప్‌ చేసాం. రూ.మూడు కోట్లు ఇస్తే వదిలిపెడతాం’ అని ఆమె తండ్రికి ఫోన్‌ చేశారు. వెంటనే ఆయన పోలీసులను సంప్రదించగా కారు పామర్రు వద్ద రోడ్డు పక్కన ఆపివుంచి చినట్లు పోలీసులు గుర్తించారు. తాడికొండ ఎస్సై కేవీ కోటేశ్వరరావు తన సిబ్బందితో కలిసి అక్కడికి వెళ్లగా ఆలీ, నాగరాజు, వెంకన్న పరారయ్యారు మంద రవి, పిన్నిబోయిన ప్రసాద్‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఈ కేసులో మిగిలిన నిందితులకు గతంలోనే జీవిత ఖైదు పడింది. మంద రవి హైకోర్టును ఆశ్రయించటంతో కొంత జాప్యమైంది. చివరకు అతనిపై కూడా విచారణ పూర్తయి సోమవారం న్యాయమూర్తి తీర్పు చెప్పారు. ప్రాసిక్యూషన్‌ తరుపున స్పెషల్‌ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ నక్కా శారదామణి వాదనలు వినిపించారు.

➡️