షెడ్డు కార్మికుల గురించి సిఎం జగన్‌ అలా మాట్లాడడం తగునా : ఎపి చేనేత నేత బాలకృష్ణ

ప్రజాశక్తి-మంగళగిరి (గుంటూరు) : వైయస్సార్‌ నేతన్న నేస్తం పథకం షెడ్‌ కార్మికులకు వర్తింపజేయాలని ఇటీవల సి కె కన్వెన్షన్‌ లో జరిగిన చేనేతల సమావేశంలో జగన్మోహన్‌ రెడ్డి దృష్టికి తీసుకురాగా షెడ్డు కార్మికులకు వైయస్సార్‌ నేతన్న నేస్తం పథకం వర్తింపజేయడం కుదరదని సిఎం జగన్‌ మాట్లాడటం తగునా అని ఆంధ్రప్రదేశ్‌ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పిల్లలమర్రి బాలకృష్ణ అన్నారు. మంగళవారం మంగళగిరి చేనేత కార్మిక సంఘం కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ …. షెడ్‌ కార్మికులు ఎప్పుడు ఎక్కడ మగ్గం నేస్తారో తెలియదని, అందువలన నేతన్న నేస్తం వర్తింపచేయం అని ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి మాట్లాడటం సిగ్గుచేటు అని అన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పాదయాత్ర చేసి మంగళగిరి లో దీక్ష చేసినప్పుడు చేనేత కార్మికులను అన్ని విధాలుగా ఆదుకుంటానని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత చేనేత రంగంలో దెబ్బతీసే విధంగా విధానాలు ఉన్నాయని విమర్శించారు. సంవత్సరానికి బడ్జెట్లో 2000 కోట్లు రూపాయలు చేనేత కార్మికులకు కేటాయిస్తామని చెప్పి కేటాయించలేదని విమర్శించారు. సొంత ఇల్లు లేక అద్దె ఇట్లో ఉంటూ వస్తున్న ఆదాయంతో సగం ఇంటి అద్దెలకు పోగా కుటుంబాలు గడవడం కష్టంగా ఉన్న చేనేత కార్మికులకు నేతన్న నేస్తం అమలు జరగకపోవడం అన్యాయమని అన్నారు. ఆర్కే రోజా మంత్రిగా ఉన్నప్పుడు పవర్‌ లూమ్‌ వస్త్రాలు తీసుకొచ్చి ఆప్కోలో అమ్మడం జరిగిందని విమర్శించారు. సిఎం జగన్‌ మాట్లాడేటప్పుడు పక్కనే ఉన్న ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు మాట్లాడకపోవడం అన్యాయమని అన్నారు. చేనేతను రక్షిస్తానని చెప్పి ముఖ్యమంత్రి భక్షిస్తున్నారని విమర్శించారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గానికి ఇండియా బ్లాక్‌ వేదిక అభ్యర్థిగా పోటీ చేస్తున్న జన్న శివశంకరరావును గెలిపించాలని కోరారు. ఈ సమావేశంలో చేనేత కార్మిక సంఘం జిల్లా కమిటీ సభ్యులు జంజనం శివ బావున్నారాయన పాల్గొన్నారు.

➡️