15లోగా పోస్టల్‌ బ్యాలెట్‌ కోసం దరఖాస్తు

Apr 6,2024 21:47

ప్రజాశక్తి-విజయనగరం : ఎ న్నికల విధులను నిర్వహించే ప్రిసైడింగ్‌ అధికారులు, సహాయ ప్రిసైడింగ్‌ అధికారులు, ఇతర పోలింగ్‌ సిబ్బంది అంతా పోస్టల్‌ బ్యాలెట్‌ కోసం ఈనెల 15వ తేదీలోగా ఫారమ్‌-12 ద్వారా దరఖాస్తు చేసుకోవాలని జిల్లా కలెక్టర్‌, జిల్లా ఎన్నికల అధికారి నాగలక్ష్మి సూచించారు. ఎన్నికల ప్రక్రియలో పాల్గొనే సెక్టార్‌ అధికారులు, రవాణా సిబ్బంది, డ్రైవర్లు, వీడియో గ్రాఫర్లు తదితర సిబ్బందికి కూడా పోస్టల్‌ బ్యాలెట్‌ సదుపాయాన్ని కల్పించాలని ఆదేశించారు. ఎన్నికల కమిషన్‌ ఆదేశాల మేరకు పోస్టల్‌, రైల్వే, పోలీస్‌ తదితర 33 అత్యవసర సేవల విభాగాల సిబ్బందికి కూడా పోస్టల్‌ బ్యాలెట్‌ సౌకర్యాన్ని కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. వివిధ నియోజకవర్గాల ఎన్నికల రిటర్నింగ్‌ అధికారులు, నోడల్‌ అధికారులతో కలెక్టరేట్‌లో శనివారం సమీక్ష నిర్వహించారు. పోస్టల్‌ బ్యాలెట్లు, ఓటింగ్‌ ప్రక్రియకు చేయాల్సిన ఏర్పాట్లు, హోం ఓటింగ్‌, డిస్ట్రిబ్యూషన్‌ సెంటర్‌, రిసెప్షన్‌ సెంటర్‌ ఏర్పాట్లు తదితర అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ, నామినేషన్ల స్క్రూటినీ పూర్తయిన 48 గంటల్లోగా పోస్టల్‌ బ్యాలెట్ల పత్రాల ముద్రణ పూర్తి కావాలని ఆదేశించారు. మే 5,6 తేదీల్లో పోస్టల్‌ బ్యాలెట్ల స్వీకరణకు ఏర్పాట్లు చేయాలని సూత్రప్రాయంగా నిర్ణయించారు. దీనిపై ఆర్‌ఒల అభిప్రాయాలను తెలుసుకున్నారు. ఎన్నికల సిబ్బంది ఇబ్బంది పడకుండా, తగిన వసతి, మౌలిక సౌకర్యాలు ఉన్నచోట్ల ఫెసిలిటేషన్‌ సెంటర్లను ఏర్పాటు చేయాలని సూచించారు. బ్యాలెట్‌ పత్రాలను బయటకు ఇవ్వకూడదని, అక్కడికక్కడే జారీ చేసి, ఓటింగ్‌ పూర్తి చేయించాలని స్పష్టం చేశారు. హోమ్‌ ఓటింగ్‌కు వచ్చిన దరఖాస్తులను బట్టి, ఇంటికి వెళ్లి ఓటింగ్‌ ప్రక్రియను పూర్తి చేసేందుకు అవసరమైన బృందాలను ముందుగానే గుర్తించాలని సూచించారు. పోస్టల్‌ బ్యాలెట్లను భద్రపరిచేందుకు స్ట్రాంగ్‌ రూములను కూడా సిద్దం చేయాలని కలెక్టర్‌ ఆదేశించారు. సమావేశంలో జాయింట్‌ కలెక్టర్‌ కె.కార్తీక్‌, డిఆర్‌ఒ ఎస్‌డి అనిత, ఆర్‌ఒలు, నోడల్‌ అధికారులు, తాహశీల్దార్లు, డిటిలు పాల్గొన్నారు.

➡️