117 జిఒను రద్దు చేయాలి : ఎపిటిఎఫ్‌ జిల్లా అధ్యక్షులు కుమార్‌ యాదవ్‌

ప్రజాశక్తి-కలికిరి (రాయచోటి-అన్నమయ్య) : గత ప్రభుత్వం ఏకపక్షంగా తెచ్చిన 117 జిఒ పాఠశాలల మనుగడకు ముప్పు తలపెట్టే 3, 4, 5 తరగతులు విలీనం చేసే ప్రక్రియను వెంటనే రద్దు చేయాలని ఏపి టీచర్స్‌ ఫెడరేషన్‌ అన్నమయ్య జిల్లా అధ్యక్షులు కుమార్‌ యాదవ్‌ ప్రభుత్వానికి సూచించారు. సోమవారం కుమార్‌ యాదవ్‌ మాట్లాడుతూ …. తరగతులు విలీనం చేయడం ద్వారా విద్యార్థుల సంఖ్య తగ్గిపోయి పాఠశాలలు మూసివేయబడి గ్రామీణ ప్రాంత పేద విద్యార్థులకు విద్య దూరం చేయబడుతుందని అన్నారు. ఇది విద్యాహక్కు చట్టానికి వ్యతిరేకమని తెలిపారు. ప్రతీ గ్రామంలోనూ బడి అందుబాటులో ఉండేలా, సరిపడా ఉపాధ్యాయులను నియామకం చేసి నాణ్యమైన విద్యను అందించే చర్యలు చేపట్టాలని కోరారు. 117 జిఒ వలన బడులు మూసేయడంతోపాటు ఉపాధ్యాయుల పోస్టులు రద్దయి నిరుద్యోగులకు తీవ్రనష్టం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఉపాధ్యాయ లోకం ఎంత వద్దని మొత్తుకుంటున్నా గత ప్రభుత్వం మొండిగా అమలు చేసిందని దాన్ని ప్రజలూ గుర్తించారన్నారు. అలాగే ఉపాధ్యాయులకు బోధనేతర పనులైన నాడు నేడు, పథకాల ఫోటోలు ,ఆన్‌ లైన్‌ పనుల భారం నుండి తప్పించాలని డిమాండ్‌ చేశారు. ఉపాధ్యాయులకు ఇతరత్రా పనులు అప్పగించి, ఏకోపాధ్యాయులు గా కొనసాగించడం వలన విధ్యార్థులకు విద్య అందించే లక్ష్యం నెరవేరదని, తద్వారా ప్రధానంగా గ్రామీణ పేదలకు తీవ్రనష్టం వాటిల్లుతుందని తెలిపారు. క్షేత్రస్థాయిలో పరిస్థితిలను కనీసం పట్టించుకోకుండా, సరైన సౌకర్యాలు కల్పించకుండా, సమస్యలు ను పరిష్కరించకుండా ప్రచారం కోసం, కక్షసాధింపులా వ్యవహరిస్తూ ఉపాధ్యాయుల ఆత్మస్థైర్యాన్ని , ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా వ్యవహరిస్తున్న పాఠశాల విద్య ముఖ్యకార్యదర్శి ప్రవీణ్‌ ప్రకాష్‌ని బాధ్యతల నుండి తప్పించాలని సూచించారు.

➡️