రాజంపేట టిడిపిలో ఆరని నిరసన సెగలు

ప్రజాశక్తి-రాజంపేట అర్బన్‌ ఎన్‌డిఎ కూటమిలో భాగంగా టిడిపి రాజంపేట అసెంబ్లీ అభ్యర్థిగా రాయచోటికి చెందిన సుగవాసి సుబ్రహ్మణ్యంను ప్రకటించినప్పటి నుంచి నేటి వరకు నియోజకవర్గంలో తెలుగు తమ్ముళ్ల అసమ్మతి సెగలు రగులుతూనే ఉన్నాయి. టిడిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, రాజంపేట నియోజకవర్గ ఇన్‌ఛార్జి బత్యాల చెంగల్రాయుడు అనుచరులు బత్యాలకు టికెట్‌ దక్కకపోవడంతో తీవ్ర అసంతప్తికి గురై పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. బత్యాల వైపే తమ ప్రయాణం అంటున్నారు. బత్యాల మాత్రం అసెంబ్లీ టికెట్‌ తప్ప బంగారు కిరీటం తన నెత్తిన పెట్టినా తనకు అవసరం లేదని కరాఖండిగా చెప్తున్నారు. నియోజకవర్గంలో తన క్యాడర్‌తో కలిసి ఇంటింటికీ కలియదిరుగుతూ ”ఇంటింటికీ బత్యాల” అనే కార్యక్రమం ద్వారా తనను గెలిపించాలని, ఆదరించాలని కోరుతుండటం వెనుక మర్మమేంటో టిడిపి క్యాడర్‌తో పాటు నియోజకవర్గ ప్రజలకు అంతుచిక్కని ప్రశ్నగా మిగిలింది. టిడిపి అసలైన క్యాడర్‌ బత్యాల వెనుక నడవడంతో ఆయనను కాదని మొండిగా ముందుకెళ్తే నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ బొక్కబోర్లా పడడం ఖాయమని తెలుగు తమ్ముళ్లు చర్చించుకుంటున్నారు. శుక్రవారం ఎన్‌డిఎ కూటమి బిజెపి ఎంపీ అభ్యర్థి నల్లారి కిరణ్‌ కుమార్‌రెడ్డి రాజంపేటలో ఆత్మీయ సమావేశానికి విచ్చేసి బత్యాలను కలిశారు. అసెంబ్లీ అభ్యర్థి సుగవాసి సుబ్రహ్మణ్యం నియోజకవర్గంలోని ముఖ్య నాయకులు నుంచి కార్యకర్తలు వరకు అందరినీ కలుపుకొని పోతున్నా.. బత్యాలను, ఆయన అనుచరులను మాత్రం కలుపుకుపోయే ఆనవాళ్లు కనిపించడం లేదు. నియోజకవర్గంలో బలమైన క్యాడర్‌ కలిగి, సీనియర్‌ నాయకులైన బత్యాల పార్టీకి దూరమైతే జరిగే నష్టం తీవ్ర స్థాయిలో ఉంటుందని పలువురు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇలాంటి సమయంలో కూడా టిడిపి అధిష్టానం బత్యాల విషయంలో మౌనం వహించడం వెనుక అంతర్యమేంటో తెలియరావడం లేదనే చర్చ సాగుతోంది. బత్యాల విషయంలో నిర్లక్ష్యానికి అధినేత చంద్రబాబు నాయుడు భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఈ నెల 18న సార్వత్రిక ఎన్నికలకు నామినేషన్ల స్వీకరణ దశ ప్రారంభం కానుండగా బత్యాల తన కార్యాచరణ అదే రోజున వ్యక్తపరుస్తారని విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం. టిడిపిలో కొనసాగుతారా లేదా తన క్యాడర్‌ నిర్ణయం ప్రకారం నడుచుకుంటానని చెప్పినట్లుగా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తారా అన్నది 18వ తేదీతో తేటతెల్లమవ్వనుంది.

➡️