అధికారంలోకొస్తే ‘ఉక్కు’ పరిశ్రమ

ప్రజాశక్తి-కడపకాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తే కడపలో ఉక్కు పరిశ్రమను పూర్తి చేస్తామనిపిసిసి అధ్యక్షులు వైఎస్‌.షర్మిల అన్నారు. శనివారం వైఎస్‌ఆర్‌ జిల్లా కడప నియోజవకర్గంలో రెండో రోజు బస్సుయాత్ర నిర్వహించారు. పెద్దదర్గా, దేవునికడప, సిఎస్‌ఐ చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. బస్సుయాత్ర సందర్భంగా షర్మిల మాట్లాడుతూ టిడిపి, వైసిపి పాలనలో కడప స్టీల్‌ ఫ్యాక్టరీ శంకుస్థాపనలకే పరిమితమైపోయిందన్నారు. టిడిపి ఒకసారి, వైసిపి రెండు సార్లు శంకుస్థాపలు చేసి చేతులు దులుపుకున్నారన్నారు. కడప ఎంపీగా ఉన్న వైఎస్‌.అవినాష్‌రెడ్డి పార్లమెంట్‌లో ఒక్క రోజు కూడాకడప ఉక్కు పరిశ్రమ గురించి మాట్లాడలేదన్నారు. తన తండ్రి రాజశేఖర్‌రెడ్డి ఉండి ఉంటే ఎప్పుడో ఉక్కు పరిశ్రమ వచ్చేదన్నారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటను ఉక్కు పరిశ్రమను నిర్మించి తీరుతామన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కూడా తీసుకొస్తామని తెలిపారు. ముస్లింలను, ప్రజలను ఆదరించి వారికి అండగా నిలిచే పార్టీ కాంగ్రెస్‌ అని తెలిపారు. బిజెపి ముస్లింలకు, రాష్ట్రానికి తీరని అన్యాయం చేసిందన్నారు. అయినా కూడా వైసిపి, టిడిపి పార్టీలు రెండు కూడా బిజెపితో రహస్య ఒప్పందం చేసుకొని బానిసలుగా మారి రాష్ట్రానికి తీరని అన్యాయం చేశాయని విమర్శించారు. వైఎస్‌.రాజశేఖర్‌రెడ్డి బతికి ఉంటే రాష్ట్రం విడిపోయేది కాదన్నారు. ఎంపీగా వైఎస్‌.అవినాష్‌రెడ్డి జిల్లా ప్రజలకు, జిల్లాకు ఏం చేశారని ప్రశ్నించారు. ఈ విషయంపై జిల్లా ప్రజలకు అవినాష్‌రెడ్డి సమాధానం చెప్పాలన్నారు. వివేకనందరెడ్డి హత్య నిందితుడికే మళ్లీ జగన్మోహన్‌రెడ్డి ఎంపీ టికెట్‌ ఇచ్చాడన్నారు. బాబారు వివేకానందరెడ్డి హత్య కేసులో అవినాష్‌రెడ్డిని సిబిఐ నిందితుడిగా తేల్చిందన్నారు. బాబారు హత్య విషయంలో జగన్‌మోహన్‌రెడ్డి ఎందుకు మౌనంగా ఉండారో సమాధానం చెప్పాలన్నారు. హత్యా రాజకీయాలు ప్రోత్సహించే వారికి ప్రజలు ఓటుతో బుద్ది చెప్పాలని పిలుపునిచ్చారు. మా నాన్న రాజశేఖర్‌రెడ్డి ముస్లింలను ఎంతగానో ప్రేమించే వారన్నారు. వారికి నాలుగు శాతం రిజర్వేషన్‌ కల్పించి అన్ని విధాలుగా సహాయం చేశారన్నారు. ముస్లిం పిల్లలు పెద్ద చదువులు, విదేశీ చదువులు చదువుకునేందుకు వీలు కల్పించారన్నారు. ముస్లింలకు ఎన్నో వాగ్ధానాలు ఇచ్చిన జగన్‌ ఒక్కటి కూడా నెరవేర్చలేదని తెలిపారు. కడప ఎంపీగా కాంగ్రెస్‌ పార్టీ తరఫున పోటీ చేస్తున్నానని చెప్పారు. నన్ను ఆదరించండి, ఆశీర్వదించండని తెలిపారు. కడప ఎంపీగా గెలిపించండి మీకు ఎప్పుడు రుణపడి ఉంటానని పేర్కొన్నారు. కార్యక్రమంలో పిసిసి మీడియా చైర్మన్‌ ఎన్‌.తులసిరెడ్డి, డిసిసి అధ్యక్షులు శ్రీరాములు, రాష్ట్ర ఉపాధ్యక్షులు నజీర్‌ అహ్మద్‌, నగర అధ్యక్షులు విష్ణుప్రీతంరెడ్డి, ప్రొద్దుటూరు పూల నజీర్‌, పొట్టిపాటి చంద్రశేఖర్‌రెడ్డి, అమర్‌, ఉత్తన్న, రామకృష్ణ, రాజబాబు, గాజుల భాస్కర్‌, లీలా శ్రీనివాస్‌, మైదుకూరు రఫిక్‌, పులివెందుల వేలూరు శ్రీనివాసరెడ్డి, కోటపాటి లక్ష్మయ్య, మధురెడ్డి, చెప్పలి పుల్లయ్య, పాలగిరి శివ, ధ్రువకుమార్‌రెడ్డి, మైనార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మహమ్మద్‌ అలీఖాన్‌, మహిళా నాయకులు సుజాతరెడ్డి, గోసాల దేవి, లావణ్య, శ్యామలాదేవి, సిపిఐ నాయకులు చంద్ర పాల్గొన్నారు.

➡️