అశోక్‌రెడ్డి గెలుపు.. అభివృద్ధికి మలుపు

ప్రజాశక్తి-గిద్దలూరు: గిద్దలూరు నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే ప్రతి ఒక్కరూ సైకిల్‌ గుర్తుపై ఓటు వేయాలని ఎన్డీఏ కూటమి అభ్యర్థి ముత్తుముల అశోక్‌రెడ్డి సతీమణి పుష్పలీల ప్రజలను కోరారు. ఇంటింటి ప్రచార కార్యక్రమంలో భాగంగా 10వ రోజు పట్టణంలోని 1వ వార్డులో ఇంటింటికీ తిరిగి టిడిపి, జనసేన, బీజేపీ మ్యానిఫెస్టోలోని అంశాలను ప్రజలకు వివరించి కరపత్రాలను పంపిణీ చేశారు. నాడు తెలుగుదేశం హయాంలో గిద్దలూరు పట్టణంలో అశోక్‌రెడ్డి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారని, పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలను అందించాలని, ప్రజా సమస్యల పరిష్కారానికి ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటారని అన్నారు. మే 13న జరిగే సార్వత్రిక ఎన్నికలలో ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్న ముత్తుముల అశోక్‌రెడ్డికి, ఒంగోలు పార్లమెంటు అభ్యర్థిగా పోటీ చేస్తున్న మాగుంట శ్రీనివాసులురెడ్డికి సైకిల్‌ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని వారు అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో గిద్దలూరు పట్టణ తెలుగుదేశం పార్టీ నాయకులు, బిజెపి, జనసేన నాయకులు, మహిళా కార్యకర్తలు పాల్గొన్నారు.

➡️