ఆదర్శ ఉపాధ్యాయుడు

Dec 29,2023 23:29

– విద్యార్థులతో మమేకం
– వారితోనే సావాసం
– రహంతుల్లా బోధనాతీరే వేరు
ప్రజాశక్తి – పంగులూరు
విద్యార్థులతో ఆడతాడు… విద్యార్థులతో పాడుతాడు…. విద్యార్థుల ప్రక్కన నేల మీదే కూర్చుంటాడు… వాళ్లని అక్కున చేర్చుకొని పాఠాలు చెబుతాడు. అందుకే ఆయనంటే విద్యార్థులకు ఇష్టం. ఆ విద్యార్థులంటే ఆయనకు ప్రాణం. ఆయనే మండలంలోని కొండమూరు దళిత కాలనీలో గల మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు షేక్ రహంతుల్లా. అతను గత నాలుగు సంవత్సరాలుగా ఆ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నాడు. పాఠశాలకు అరగంట ముందే చేరుకుంటాడు. విద్యార్థుల మంచి చెడ్డలన్నీ ఆయనే చూసుకుంటాడు. ఎవరైనా విద్యార్థి పాఠశాలకు రాకపోతే నేరుగా ఇంటికెళ్ళి తన బండిపై ఎక్కించుకొని పాఠశాలకు తీసుకొస్తాడు. విద్యార్థుల చదువుపైనే కాకుండా, వారి ఆరోగ్యంపైన కూడా దృష్టి పెడతాడు. విద్యార్థులకు ఎవరికైనా ఆరోగ్యం బాగా లేకపోతే ఉపాధ్యాయుడిగా తను చేయాలిసింది చేస్తాడు. విద్యార్థులకు చక్కగా పాఠాలు బోధించటమే కాకుండా, వారితో పాటు కలిసి కూర్చొని వాళ్లలో ఒక స్నేహితుడిగా, ఒక ఆత్మీయుడుగా కలిసిపోతాడు. దగ్గరికి తీసుకొని ఎంతో ఆత్మీయతో పాఠాలు చెబుతాడు. వాళ్ళ ఆటపాటల్లో కూడా దగ్గరుండి వాళ్లకు తగిన సలహాలు, సూచనలు ఇస్తూ ప్రోత్సహిస్తాడు. అందుకే ఆ ఉపాధ్యాయుడు అంటే ఆ విద్యార్థులకు వల్లమాలిన అభిమానం. ఇటీవల ప్రభుత్వం 3, 4, 5తరగతులను ఉన్నత పాఠశాల్లో విలీనం చేసింది. ఆ సమయంలో రహమతుల్లా టీచర్‌ను ఆ ఊర్లోని మండల పరిషత్ ప్రాథమిక ఉన్నత పాఠశాలకు బదిలీ చేశారు. రహంతుల్లా మాస్టారు తమ బడి విడిచి వేరే బడికి వెళుతున్నాడని తెలిసిన విద్యార్థులు వారి తల్లిదండ్రులను తీసుకొచ్చి ఆయనను కదలనీయ కుండా చేశారు. విద్యార్దులు, తల్లిదండ్రులు బోరున విలపించారు. తల్లిదండ్రులు కూడా రహంతుల్లా టీచర్ వేరే స్కూలుకు వెళ్ళటానికి లేదని పట్టుబట్టారు. దీంతో అధికారులు రహంతుల్లా మాస్టారును బదిలీ చేయకుండా అదే పాఠశాలలో ఉంచారు. విద్యార్థులకు ఆయనకు మంచి సన్నిహిత సంబంధాలు ఏర్పడ్డాయి. పాఠశాలలో విద్యార్థులంతా తన సొంత బిడ్డలు గాని ఆయన చూసుకుంటాడు. అందుకనే ఆయనంటే విద్యార్థులకు అంత ఇష్టం. ఆయనకు విద్యార్థులు అంటే అంత మమకారం. ప్రస్తుత పరిస్థితుల్లో ఇంకా ప్రభుత్వ పాఠశాలలు మనుగడ సాగిస్తున్నాయంటే ఇలాంటి ఆదర్శ ఉపాధ్యాయులు ఉండబట్టేనని అర్థమవుతుంది.

➡️