మరిన్ని జగ్గయ్యపేటలు…?

Jun 26,2024 00:50 #dayeria
  • రాష్ట్రానికి పొంచిఉన్న డయేరియా ముప్పు
  • మరో 49 పట్టణాల్లోనూ ఆందోళనకర పరిస్థితులు
  •  నిధుల కొరతతో అర్ధంతరంగా ఆగిన ఎఐఐబి పనులు
  • కేంద్రంపై ఒత్తిడి తెస్తేనే కొనసాగింపు

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో: రాష్ట్రానికి మరింతగా డయేరియా ముప్పు పొంచిఉందా? జగ్గయ్యపేట తరహాలో మరిన్ని పట్టణాల్లోనూ తాగునీరు విషతుల్యం కానుందా? ఈ ప్రశ్నలకు సమాధానం ‘అవును’ అనే! అధికారయంత్రాంగం చెబుతున్న మాటే ఇది! ఆసియాన్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ బ్యాంకు (ఎఐఐబి) నిధులతో తాగునీటి సరఫరా కోసం జగ్గయ్యపేటలో చేపట్టిన ప్రాజెక్టు అర్ధంతరంగా ఆగిపోవడంతో నీరు కలుషితమయ్యే పరిస్థితి ఏర్పడింది. రాష్ట్ర వ్యాప్తంగా మరో 49 పట్టణాల్లోనే ఇదే రకమైన పరిస్థితి ఉన్నట్లు సమాచారం. కేంద్ర ప్రభుత్వానికి ఇటీవల రాష్ట్ర అధికారులు రాసిన లేఖలో ‘ప్రజల భద్రతకు ముప్పు’ పొంచిఉందని పేర్కొన్నారు. ‘ఆసియన్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ బ్యాంకు (ఎఐఐబి) నిధులతో రాష్ట్రంలోని 50 మున్సిపాల్టీల్లో చేపట్టిన తాగునీటి ప్రాజెక్టు పనులు నిధులు కొరత కారణంగా అర్ధంతరంగా ఆగిపోయాయి. ప్రాజెక్టులో భాగంగా చేపట్టిన ఇన్‌టెక్‌ వెల్స్‌, ఎస్‌ఎస్‌ట్యాంకులు,డబ్ల్యుటిపిలు, ఇఎల్‌ఎస్‌ఆర్‌లతో పాటు పైపులైన్ల పనులు వివిధ దశలో నిలిచిపోయాయి. ఈ పనులను ఇలా అసంపూర్తిగా వదలివేస్తే ప్రజా భద్రతకు ముప్పు ఏర్పడుతుంది. పనులను పూర్తి చేసేంతవరకు ఈ ప్రమాదం పొంచి ఉంటుంది.’అని అధికారులు కొద్దిరోజుల క్రితం కేంద్రప్రభుత్వానికి లేఖ రాశారు. పరిస్థితి తీవ్రతను అర్దం చేసుకుని కేంద్ర ప్రభుత్వం, ఆర్థిక వ్యవహారాల శాఖ జోక్యం చేసుకుని ప్రాజెక్టును కొనసాగించేలా చూడాలని ఈ లేఖలో వారు కోరారు. అయితే, లేఖ రాసి ఊరుకుంటే చాలదని, ఆ మేరకు రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాల్సిఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

ఏం జరిగింది..?
రాష్ట్రంలో 50 పట్టణ ప్రాంతాల్లో మంచినీటి పైపులైన్లు, ర్యాపిడ్‌ వాటర్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్లు, సమ్మర్‌ స్టోరేజీ ట్యాంకులు వంటి పనులు చేపట్టడానికి 2018లో రాష్ట్ర ప్రభుత్వం ఎఐఐబిని రుణం కోరింది. దీనికోసం 2018లో ప్రతిపాదనలు సిద్ధం చేయగా, అదే ఏడాది డిసెంబర్లో అనుమతి వచ్చింది. దీనిలో ఎఐఐబి రూ.3480 కోట్లు ఇవ్వనుండగా రాష్ట్ర ప్రభుత్వం 30 శాతం వాటా రూ.1494 కోట్లు మొత్తం రూ.4982 కోట్లకు అనుమతి వచ్చింది. వీటికి స్థానిక సంస్థలు మెయింటినెన్స్‌ ఖర్చు కింద రూ.368 కోట్లతో మొత్తం ప్రాజెక్టు విలువ రూ.5350 కోట్లకు చేరింది. అనుమతి వచ్చిన వెంటనే అధికారులు పనులు మొదలుపెట్టారు. 2019లో జరిగిన ఎన్నికల్లో ప్రభుత్వం మారడంతో మారడం 25 శాతం కంటే ఎక్కువ పూర్తికాని పనులు నిలిపేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి. దీంతో తాగునీటి సరఫరాకు ఉద్ధేశించిన ఈ పనులు కూడా నిలిచిపోయాయి. చేపట్టిన పనులను ఎక్కడికక్కడ నిలిపేసి కాంట్రాక్టర్లు వెళ్లిపోయారు. వాటిల్లో కొన్ని పైపులైన్లు కనెక్షన్లు ఇచ్చారు. కొత్తపైపులు వేస్తున్నారనే పేరుతో పాతపైపులు తొలగించారు. పనులు ఆగిపోవడంతో ఎక్కడికక్కడ తాత్కాలిక కనెక్షన్లు ఇచ్చి అధికారులు చేతులు దులుపుకున్నారు. ఇటువంటి అన్ని ప్రాంతాల్లోనూ తాగునీరు కలుషితం కావడానికి అవకాశం ఉందని చెబుతున్నారు. ఉమ్మడి కృష్ణాజిల్లాలో జగ్గయ్యపేట, నందిగామ, తిరువూరు, పెడన, గుంటూరు జిల్లాల్లో గుంటూరు కార్పొరేషన్‌, తాడేపల్లి, వినుకొండ, మంగళగిరి, మాచర్లలో ఇలా చాలా పనులు మధ్యలో నిలిపేసినట్లు సమాచారం. రాష్ట్ర వ్యాప్తంగా అనేక జిల్లాల్లో ఈ పరిస్థితి ఉంది.

కరోనా… నిధుల కొరత
డిసెంబర్‌ 2019లో తాగునీటి పనులను మళ్లీ ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఆ తరువాత కొద్ది నెలలకే కరోనా విజృంభించడంతో ఆ నిర్ణయం అమలు అరకొరే! రెండు సంవత్సరాల పాటు ఇదే పరిస్థితి కొనసాగింది. మరోవైపు నిధుల కొరత కూడా వెంటాడింది. చేసిన అరకొర పనులకు కూడా నిధులు చెల్లించలేని పరిస్థితికి రాష్ట్ర ప్రభుత్వం చేరింది. ఒప్పందంలో భాగంగా ఎఐఐబి అడ్వాన్స్‌గా విడుదల చేసిన 193.31 కోట్ల రూపాయలను కూడా అప్పటి ప్రభుత్వం ఇతర అవసరాలకు మళ్లించిందని, ఫలితంగా పనులు ముందుకు సాగలేదని అధికారులు అంటున్నారు. ఇప్పటి వరకు ఈ ప్రాజెక్టుకోెసం 597.77 కోట్ల రూపాయలను ఖర్చు చేశారు. ప్రస్తుతం వివిధ దశల్లో పనులు ఉన్నాయి.

ప్రాజెక్టు ఆగిపోతే….!
ఒప్పందం ప్రకారం ఈ నెలాఖరుతో ఈ పథకం ముగియనుంది. అదే జరిగితే ప్రజారోగ్యం పెను ప్రమాదంలో పడనుందని సమాచారం. పథకం అమలులో ఉన్న అన్ని పట్టణాల్లోనూ పనులు అర్ధంతరంగా నిలిపోయిఉన్నాయి. అధికారులు తాత్కాలిక ఏర్పాట్లతో ఏరోజుకారోజు నీటిని సరఫరా చేస్తున్నారు. ఫలితంగా ఈ అన్ని పట్టణాల్లోనూ నీరు కాలుష్యమయ్యే ప్రమాదం పొంచి ఉంది. మరోవైపు తాత్కాలిక ఏర్పాట్లతో ఎక్కువ రోజులు నీటిని సరఫరా చేయలేమని అధికారులు అంటున్నారు. అంటే. ఈ పట్టణాలన్నింటికి నీటి కొరత పొంచి ఉంది. ఈ నేపథ్యంలో ఈ పథకం కొనసాగింపునకు అనుమతిచ్చేలా కేంద్రం పై ఒత్తిడి తీసుకురావడమే రాష్ట్ర ప్రభుత్వం ముందున్న మార్గం.

పట్టించుకోని కేంద్రం
ఒకవైపు ఎఐఐబి ఆమోదంతో జరుగుతున్న పనులు ఆగిపోయినా మానిటరింగ్‌ చేయాల్సిన కేంద్ర ఆర్థికశాఖ అధికారులు కూడా దీన్ని పట్టించుకోలేదు. కనీసం ప్రశ్నించనూ లేదు. ఎఐఐబి రుణాలు వినియోగించి వాటికి యుసి(యుటిలిటి సర్టిఫికెట్‌)లు సమర్పిస్తే మరలా నిధులు విడుదల చేస్తుంది. అయినా అటువంటిదేమీ చేయలేదు. 2019లో చేపట్టిన ప్రాజెక్టు అదే సంవత్సరం ఆగిపోయినా ఎందుకు ఆగిపోయింది. పురోగతి ఏమిటీ అనే అంశాలపై కేంద్రం పట్టించుకోలేదు.

➡️