నల్ల బెలూన్స్ తో అంగన్వాడీలు నిరసన

Jan 8,2024 00:00

ప్రజాశక్తి – రేపల్లె
ఎస్మా ప్రయోగించటాన్ని నిరసిస్తు స్థానిక అంబేద్కర్ విగ్రహం వద్ద నల్ల బెలూన్లతో అంగన్‌వాడీలు నిరసన తెలిపారు. అంగన్‌వాడీలపై ఎస్మా చట్టం వర్తించదని అన్నారు. ప్రభుత్వం బెదిరింపులు మానుకొని సమస్యలు పరిష్కరించాలని సిఐటీయు జిల్లా అధ్యక్షులు సిహెచ్ మణిలాల్ డిమాండ్ చేశారు. రాష్ట్రప్రభుత్వం బెదిరింపులకు పాల్పడుతుందని అన్నారు. బెదిరింపుల ద్వారా ఉద్యమాన్ని ఆపలేరని హెచ్చరించారు. సిఎం మాట నిలబెట్టుకోకుండా మహిళలని కూడా చూడకుండ, దుర్మార్గంగా ఎస్మా ప్రకటించడం అన్యాయం అన్నారు. ఎస్మా వెనక్కి తీసుకోవాలని, లేకుంటే కార్మిక సంఘాలుగా ప్రజాస్వామ్యవాదులు ప్రజలందరని కలుపుకొని పెద్ద ఎత్తున పోరాటం నిర్వహిస్తామని అన్నారు. క్రిస్మస్, జనవరి ఫస్ట్ పండుగలకు రోడ్డు మీద ఉంటే పట్టించుకోలేదని, పండగ పూట కూడా రోడ్డుమీద లక్ష మంది మహిళలు ఆందోళన చేశారని గుర్తు చేశారు. అంగన్‌వాడీలను అణచాలనుకుంటే అంతకు పదిరెట్లు ఉద్యమిస్తారని హెచ్చరించారు. 27వ రోజు సమ్మెలో బాగంగా అంబేద్కర్ విగ్రహం ముందు నల్ల బెలూన్లతో అంగన్‌వాడీలు నిరసన తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ వైఖరిపై ఆగ్రహం వ్యక్తంచేశారు. అంగన్‌వాడీ యూనియన్ కార్యదర్శి కె వాణి మాట్లాడుతూ ప్రభుత్వం అంగన్‌వాడీలు తమ న్యాయమైన సమస్యలు పరిష్కారం చేయాలని సమ్మె చేస్తుంటే సమస్యల పరిష్కారం చేయకుండా జిఓ నెం2 తీసుకొచ్చి అంగన్‌వాడీలపై ఎస్మా ప్రయోగించడం చట్టవ్యతిరేకమని అన్నారు. కార్యక్రమంలో అంగన్‌వాడీ యూనియన్, సిఐటియు నాయకులు కె రత్నకుమారి, నిర్మలజ్యోతి, రాజ్యలక్ష్మి, లావణ్య, రజిని పాల్గొన్నారు.
సంతమాగులూరు : అంగన్‌వాడిల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ చేపట్టిన నిరవధిక సమ్మె ఐసిడిఎస్ కార్యాలయం వద్ద 27వ రోజుకు చేరింది. స్థానిక సచివాలయం ముందు అంగన్‌వాడీలు నిరసనగా ఎస్మా జీఒ ప్రతులను దహనం చేశారు. న్యాయమైన సమస్యలు పరిష్కరించకుండా తమపై ఎస్మా ప్రకటించడం దుర్మార్గమైన చర్యని అన్నారు. కార్యక్రమంలో యూనియన్ నాయకులు మస్తాన్ బి, శ్రీదేవి, మల్లేశ్వరి, ఎస్తేరా రాణి, నిర్మల, ఆదెమ్మ, రమణ పాల్గొన్నారు.


మార్టూరు రూరల్ : అంగన్‌వాడీలపై వైసిపి ప్రభుత్వం ఎస్మా చట్టం ప్రయోగించడం సిగ్గుమాలిన చర్యని టిడిపి మహిళా మండలి అధ్యక్షురాలు ఉప్పుటూరి రమాదేవి అన్నారు. అంగన్‌వాడీ ఉద్యమం అణచివేత కోసమే తెచ్చిన జీఒ నంబర్2 రద్దు చేయాలని డిమాండ్ చేశారు. సిఐటియు జిల్లా నాయకులు బత్తుల హనుమంతరావు ఆధ్వర్యంలో తహశీల్దారు కార్యాలయం ఎదుట జనసేన నాయకులతో కలిసి జీఒ ప్రతులను దగ్ధం చేశారు. సంక్రాంతిలోగా ఎస్మా ప్రయోగం వెనక్కి తీసుకోకుంటే ఉద్యమం తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.


చిన్నగంజాం : ఇచ్చిన హామీలు అమలు చేయకుండా నిర్బంధం ప్రయోగించడం మూర్ఖత్వం అవుతుందని సిఐటియు జిల్లా కార్యదర్శి జి ప్రతాప్ కుమార్ అన్నారు. స్థానిక మండల పరిషత్ కార్యాలయ ప్రాంగణం నందు రాష్ట్ర ప్రభుత్వం జారీచేసిన ఎస్మా జీఒ కాపీలను దగ్ధం చేశారు. చట్టపరిధిలో న్యాయమైన అంగన్‌వాడీల డిమాండ్స్‌ నెరవేర్చకుండా నిరంకుశ ధోరణులకు దిగటం వలన ప్రభుత్వం చేతగానితనం అర్థమవుతుందని అన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం పునరాలోన చేయాలని అన్నారు.
అద్దంకి : అంగన్‌వాడీల సమ్మెపై ఎస్మా ప్రయోగిస్తూ ప్రభుత్వం ఇచ్చిన జిఒ నెం2 జారీ చేయడాన్ని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు నెరుసులు వెంకటేశ్వర్లు, కంకణాల ఆంజనేయులు ఖండించారు. తక్షణమే జిఒ నెంబర్2ను ఉపసంహరించుకోవాలని కోరారు. ఎస్మా ప్రకటించడాన్ని ఖండిస్తూ గుంటూరులో జరుగుతున్న వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర వర్క్ షాప్ సందర్భంగా నిరసన తెలిపారు.


కొల్లూరు : అంగన్‌వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో 27వ రోజు కూడా సమ్మె కొనసాగించారు. అంగన్‌వాడీల ఆందోళనలను అణచివేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఎస్మా చట్టం జీఒ కాపీలను దగ్ధం చేశారు. కార్యక్రమంలో సిఐటియు నాయకులు బొనిగల సుబ్బారావు, అంగన్‌వాడి లీడర్స్ సౌభాగ్య, లక్ష్మి, భాగ్యం, పద్మ, కాశి, ఆదిలక్ష్మి పాల్గొన్నారు.
ఇంకొల్లు రూరల్‌ : రాష్ట్ర ప్రభుత్వం అంగన్‌వాడీలపై తీసుకువచ్చిన ఎస్మ చట్టం రద్దు చేయాలని జిఒ ప్రతులను దగ్దం చేశారు. రవాణా, పాలు, కరెంటు, నీరు వంటి అత్యవసర జాబితాలో అంగన్‌వాడీ కార్యకర్తలను చూపి ఎస్మా చట్టం కిందకి వస్తాయని, చంటి పిల్లలు, గర్భవతులు, బాలింతలకు సేవ చేసే అంగన్‌వాడీ కార్యకర్తలపై ఇలాంటి దుర్మార్గపు చర్యలకు పూనుకోవటం సిగ్గుచేటని పేర్కొన్నారు. స్థానిక వై జంక్షన్ నుండి నినాదాలు చేస్తూ నిరసన ప్రదర్శన చేశారు. సమస్య పరిష్కారం అయ్యేవరకు సమ్మె కొనసాగుతుందని హెచ్చరించారు. 9న జైల్ బరోకు వెళతామన్నారు. తమ సమస్య పరిష్కరించండి లేక జైలులో కూర్చోబెట్టండని నినాదాలుచేశారు. కార్యక్రమంలో సిఐటియు కార్యదర్శి నాగండ్ల వెంకట్రావు, ప్రాజెక్టు లీడర్లు బిక్కి సరళ, శ్రీలత, భారతి, లక్ష్మీ, కుమారి, రమాదేవి, అంజమ్మ, రాజ్యలక్ష్మి, శ్రీదేవి, పద్మావతి పాల్గొన్నారు.


కారంచేడు : అంగన్‌వాడి ఉద్యమంపై ఎస్మా ప్రయోగించడం అసమర్ధ చర్యని సిఐటియు జిల్లా నాయకులు పి కొండయ్య పేర్కొన్నారు. స్థానిక కాల్వ సెంటర్లో ప్రభుత్వం అంగన్‌వాడీలకు వ్యతిరేకంగా విడుదల చేసిన జీఒను దగ్ధం చేశారు. స్థానిక తహశీల్దారు కార్యాలయం వద్ద ఆందోళన చేశారు. అంగన్‌వాడీల పట్ల ప్రభుత్వం నిరంకుశ వైఖరి మానుకోవాలని హెచ్చరించారు. ప్రభుత్వం ఎన్ని నిర్బంధ చర్యలు చేపట్టిన ఆందోళన విరమించేది లేదని చెప్పారు. అంగన్‌వాడీలపై ఎస్మా చట్టాన్ని ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో అంగన్‌వాడి నాయకులు శ్రీలక్ష్మి, క్రీస్తు రాజ్యం, కళ్యాణి, హఫీజ, శివ లీల, ఆదిలక్ష్మి, రాధా పాల్గొన్నారు.


చెరుకుపల్లి : అంగన్‌వాడీ కార్యకర్తల ఆందోళనపై ప్రభుత్వం ప్రయోగించిన ఎస్మా చట్టం జీఒ కాపీలను కార్యకర్తలు ఆదివారం దగ్ధం చేశారు. చిరు ఉద్యోగుఐలన తమపై ఎస్మా చట్టం ప్రయోగించటం అవివేక చర్యని అన్నారు. ప్రతి ఒక్కరు ఖండించాలని కోరారు. సమస్యలు పరిష్కరించే దిశగా ఆలోచించాలని కోరారు.


మెదరమెట్ల : అంగన్‌వాడీ కార్యకర్తల సమ్మె 27వ రోజుకు చేరింది. కోరిసిపాడు మండల పరిషత్ కార్యాలయం ఎదుట ఎస్మా జీఒ కాపీలను ఆదివారం తగలబెట్టారు. అంగన్‌వాడీల ఆందోళనకు టిడిపి కార్యకర్తలు, నాయకులు మద్దతు పలికారు. అంగన్‌వాడీలపై వైసీపీ ప్రభుత్వం చేస్తున్న దురాగతాలను ఖండించారు. వైఎస్ జగన్మోహన్‌రెడ్డి చేస్తున్న నిర్భంధాలు ప్రభుత్వ పతనానికి నాంది అన్నారు. కార్యక్రమంలో టిడిపి అధ్యక్షులు జాగర్లమూడి జయకృష్ణ, చెన్నుపాటి హరిబాబు, మేదరమెట్ల శ్రీనివాసరావు, నాదెండ్ల కోటేశ్వరరావు, గొల్లమూడి సురేందరరెడ్డి, కారుసాల గురుబాబు, సిఐటియు నాయకులు వై రవీంద్రబాబు, అంగన్‌వాడి కార్యకర్తలు, ఆయాలు పాల్గొన్నారు.


భట్టిప్రోలు : అంగనవాడీలు 27రోజులుగా సమస్యల పరిష్కారానికి చేపట్టిన నిరాహార దీక్షల్లో భాగంగా ప్రభుత్వం విడుదల చేసిన జీఒ నెంబర్2 ఎస్మా పత్రాలను దగ్ధం చేశారు. భట్టిప్రోలు, వెల్లటూరు రహదారిలో పత్రాలను దగ్ధం చేసి నిరసన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో సిఐటియు నాయకులు జి సుధాకర్, నాగరాజు, సత్యనారాయణ, అంగన్‌వాడి వర్కర్స్ యూనియన్ నాయకులు రమాదేవి, గృహలక్ష్మి, సూర్య లక్ష్మీ పాల్గొన్నారు.


చీరాల : అంగన్‌వాడీ కార్యకర్తల నిరవధిక సమ్మె నిర్వహిస్తుంటే కార్మికుల సమస్యలపై చర్చించి సమస్య పరిష్కారం చేయాల్సిన ప్రభుత్వం బాధ్యత మరిచి బెదిరింపులకు పాల్పడటం అవివేకమని సిఐటియు పట్టణ అధ్యక్షులు ఎన్‌ బాబురావు అన్నారు. ఎస్మా ప్రయోగించి ఉద్యమాన్ని అణచాలని అనుకోవటం అవివేకమే అవుతుందని అన్నారు. ఎస్మా ప్రయోగిస్తూ విడుదల చేసిన జీఒ కాపీని దగ్ధం చేశారు. కార్యక్రమంలో అంగన్‌వాడీ యూనియన్ నాయకులు సుజీవన, సులోచన, జ్యోతి, హనుమాయమ్మ పాల్గొన్నారు.

➡️