ఎఎంసి చైర్మన్ ఎంపికపై కసరత్తు

– రైతులకు మేలైన సేవలు అందించాలి
– వ్యవసాయ అధికారులతో ఎమ్మెల్యే నరేంద్ర వర్మ
ప్రజాశక్తి – బాపట్ల
వ్యవసాయ మార్కెట్ కమిటీ కొత్త చైర్మన్ ఎన్నికపై కసరత్తు ప్రారంభమైందని ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ అన్నారు. వ్యవసాయ మార్కెట్ కమిటీ ప్రాంగణంలో రైతు సమావేశ మందిరంలో వ్యవసాయ అధికారులతో సమీక్ష సమావేశం బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మరో నెల రోజుల్లో కమిటీ చైర్మన్‌ను నియమిస్తామని అన్నారు. రైతులకు పూర్తిస్థాయిలో సేవలు అందించేందుకు మార్కెట్ కమిటీకి కొత్త రూపం తెస్తామని చెప్పారు. అధికారులు రైతులకు నిత్యం అందుబాటులో ఉండి ప్రభుత్వం ద్వారా వచ్చే అన్ని సదుపాయాలను రైతులకు సమకూర్చి అన్నదాతలు అధిక ఆహార ఉత్పత్తులు సాధించే విధంగా కృషి చేయాలన్నారు. రైతున్నలు లేనిదే దేశం అభివృద్ధి లేదన్న విషయాన్ని అధికారులు గ్రహించి రైతులకు మేలు చేకూర్చాలని అన్నారు. ప్రస్తుతం వ్యవసాయ పనులు ప్రారంభమైందని, విత్తనాలు అందుబాటులో ఉంచి మద్దతు ధరకు రైతులకు విత్తనాలను అందజేయాలని అన్నారు. రైతులు పిర్యాదు చేయకూడదని అన్నారు. విత్తనాల కొరత ఇతర సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకువస్తే పరిష్కారం చేస్తామన్నారు. ఆర్‌బికెల ద్వారా రైతులకు అన్ని సేవలు అందించాలని ఆదేశించారు. కౌలు రైతులకు గుర్తింపు కార్డులు అందజేసే విధానంలో జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రస్తుతం కౌలు రైతులు లేనిదే వ్యవసాయం చేసే వారు లేరని అన్నారు. కౌలు రైతులు పంట నష్టం జరిగిన సమయంలో ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. వారికి అధికారులు అండగా నిలవాలన్నారు. గత ప్రభుత్వంలో ఆర్‌బికెల ద్వారా అవినీతి, అక్రమాలు జరిగాయని అన్నారు. ఈ ప్రభుత్వంలో అలా జరిగితే ఉపేక్షించేది లేదన్నారు. త్వరలోనే రైతుబజార్‌ ప్రారంభిస్తామని అన్నారు. టిడిపి ప్రభుత్వంలో వ్యవసాయ శాఖలో పని చేసిన తాత్కాలిక ఉద్యోగులను వైసిపి అధికారంలోకి వచ్చాక తొలగించారని అన్నారు. త్వరలోనే వారిని విధుల్లోకి తీసుకుంటామన్నారు.
సమస్యను పరిష్కరించాలి
అధికంగా వర్షాలు కురిసి పొలాల్లో నిలుస్తున్న నీరు బయటకు వెళ్లేందుకు వీలు లేక, డ్రైనేజీలు అధ్వానంగా ఉండి, తూటి కాడ అడ్డుపడడంతో మురుగునీరు బయటికి పోకుండా ఉంటుందని, సమస్య పరిష్కరించాలని వ్యవసాయ అధికారులు ఎమ్మెల్యే దృష్టికి తెచ్చారు. సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామని తెలిపారు. ప్రస్తుత వ్యవసాయ పరిస్థితులపై వ్యవసాయ అధికారులు ఎమ్మెల్యేకు వివరించారు. సమావేశంలో జిల్లా వ్యవసాయ అధికారి వై రామకృష్ణ, జిల్లా అసిస్టెంట్ మార్కెటింగ్ అధికారి రమేష్ బాబు, జనసేన నాయకులు నామన వెంకట శివన్నారాయణ, టిడిపి జిల్లా అధ్యక్షులు సలగల రాజశేఖర బాబు, వ్యవస్థాయ విలేజ్ ఎఒ చంద్రశేఖర్, పిట్టలవానిపాలెం, కర్లపాలెం మండలాలు వ్యవసాయ అసిస్టెంట్లు, రైతులు, వ్యవసాయ శాఖ సిబ్బంది పాల్గొన్నారు.

➡️