నల్లచీరలతో అంగన్‌వాడీల నిరసన : కొనసాగుతున్న సమ్మె

Dec 16,2023 01:06

ప్రజాశక్తి – పంగులూరు

న్యాయమైన డిమాండ్ల సాధనకై నిరవధిక అంగన్‌వాడీ కార్యకర్తలు చేపట్టిన నిరవధిక సమ్మె శుక్రవారంకు నాలుగవ రోజు చేరింది. స్థానిక తహశీల్దారు కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. అంగన్‌వాడీ కార్యకర్తలు మాట్లాడుతూ న్యాయమైన తమ డిమాండ్లు పరిష్కారం అయ్యేవరకు సమ్మె కొనసాగిస్తామని అన్నారు. ప్రభుత్వం ఎంత భయపెట్టినా ఆగేది లేదని చెప్పారు. కోటపాడు, ముప్పవరం, బైటమంజులూరు, రామకూ రు, మరికొన్ని గ్రామాల్లోని అంగన్‌వాడీ కేంద్రాల తాళాలు మహిళా పోలీసులు, వెల్ఫేర్ అసిస్టెంట్ ద్వారా పగలగొట్టిచ్చారని, తమ సమ్మెను భగ్నం చేయాలని ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. ఎవరెన్ని చేసినా, ఎంత భయపెట్టినా తమ పోరాటం ఆగదని, ఇంకా ముందుకు పోతుందని చెప్పారు. ప్రజలంతా ఆలోచించి తమ పోరాటానికి మద్దతు తెలపాలని కోరారు.


యద్దనపూడి : స్థానిక ఎంపిడిఒ కార్యాలయం వద్ద అంగన్‌వాడీ కార్యకర్తలు నిరవధిక సమ్మె సందర్భంగా ధర్నా నిర్వహించారు. అంగన్‌వాడీ సిబ్బంది నల్ల చీరలు ధరించి మోకాళ్ళ మీద నిలబడి నిరసన తెలిపారు. కార్యక్రమంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షడు బత్తుల హనుమంతరావు మాట్లాడారు. డిమాండ్ల సాధన కోసం సమిష్టిగా పోరాడాలని అన్నారు. ప్రభుత్వం సానుకూలంగా స్పందించి అంగన్వాడీల కోర్కెలు తీర్చాలని డిమాండ్ చేశాడు. బెదిరింపు ధోరణి మానుకోవాలని హెచ్చరించారు. కార్యక్రమంలో ప్రాజెక్టు ఉపాధ్యక్షురాలు జ్యోత్స్న, ఝాన్సీ, రామాదేవి, రేవతి, అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆయాలు పాల్గొన్నారు.


కొల్లూరు : అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ (సిఐటియు) ఆధ్వర్యంలో కనీస వేతనం రూ.26వేలు ఇవ్వాలని, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాడ్యుటి అమలు చేయాలని, ఇతర సమస్యలపై రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన నిరవధిక సమ్మె శుక్రవారం కొనసాగించారు. అంగన్‌వాడీల సమ్మెకు తెలుగు యువత అధికార ప్రతినిధి, మాజీ ఎంపీపీ డాక్టర్ కనగాల మధుసూదన ప్రసాద్ మద్దతు ప్రకటించి రూ.10వేల ఆర్థిక సహాయం అందించారు. కార్యక్రమంలో సిపిఎం నాయకులు బి సుబ్బారావు, టిడిపి నాయకులు పాల్గొన్నారు.


అద్దంకి : అంగన్‌వాడీల సమస్యలు పరిష్కరించాలని సిఐటియు నాయకురాలు జి శారద, సిపిఎం కార్యదర్శి తంగిరాల వెంకటేశ్వర్లు మాట్లాడుతూ అంగన్‌వాడీ కార్యకర్తల సమస్యలు పరిష్కరించకుండా బెదిరింపు ధోరణికి పాల్పడటం మానుకోవాలని హెచ్చరించారు. అంగన్‌వాడీ కార్యకర్తల సమ్మెకు ఎపీ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీస్ ఐక్యవేదిక, ఇతర ప్రజాసంఘాలు శుక్రవారం మద్దత్తు తెలిపారు. ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షులు జ్యోతి రమేష్ బాబు, ఉపాధ్యక్షులు అంకం నాగరాజు, చెన్నుపల్లి నాగేశ్వరావు, బిఎస్పి కన్వీనర్ మందా జోసెఫ్, షెడ్యూల్ కులాల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు నక్కా కాంతారావు, ఎంఆర్పిసి అధ్యక్షులు చక్రవర్తి, కొమ్మాలపాటి బుజ్జిబాబు, జనరాజుపల్లి ప్రభాకర్ పాల్గొన్నారు.


కారంచేడు : అంగన్వాడీల నిరవధిక సమ్మె 4వ రోజు నల్ల చీరలు, నల్ల కండవాలతో నిరసన తెలిపారు. సమ్మె పరిష్కరించకుండా రెవెన్యూ, పోలీస్ సహకారంతో బలవంతంగా తాళాలు పగలగొట్టి సెంటర్లు నడపాలుకోవడం సిగ్గుచేటని సిఐటియు నాయకులు పి కొండయ్య అన్నారు. ధర్నా శిభిరం వద్దనే మద్యాహ్న భోజనం చేశారు. పిడిఎఫ్ ఎంఎల్‌సి షేక్‌ షాబ్జి రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన విషయం తెలుసుకున్న అంగన్‌వాడీ కార్యకర్తలు ధర్నా శిభిరం వద్దనే సంతాపం ప్రకటించారు. యుటిఎఫ్‌ జిల్లా కార్యదర్శి రాయి పద్మ మద్దతు తెలిపారు.


చీరాల : అంగన్వాడీల సమస్యలు పరిష్కరించటంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని టిడిపి ఇన్చార్జి కొండయ్య అన్నారు. స్థానిక తహశీల్దారు కార్యాలయం వద్ద అంగన్‌వాడీల నిరసన దీక్షలకు ఆయన మద్దతు ప్రకటించారు. సిఐటియు అధ్యక్ష, కార్యదర్శులు ఎన్ బాబురావు, ఎం వసంతరావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తుందని అన్నారు. అంగన్వాడి కేంద్రాల వద్దకు సచివాలయ సిబ్బంది వెళ్లి సెంటర్లలో తాళాలు పగలగొట్టడం దుర్మార్గమైన చర్యని అన్నారు. సచివాలయం సిబ్బంది తీరుపై యూనియన్, సిఐటియు నాయకులు ఒకటవ పట్టణ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కార్యక్రమంలో వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి పి రేఖ ఎలిజిబెత్, సుజీవన, జ్యోతి, సులోచన, శిరీష, పద్మ పాల్గొన్నారు.


పర్చూరు : అంగన్వాడీల నిరవధిక సమ్మె 4వ రోజుకు చేరింది. స్థానిక తహశీల్దారు కార్యాలయం వద్ద ధర్నా చేశారు. కళ్లకు గంతలు కట్టుకొని నిరసన తెలిపారు. 4రోజులుగా సమ్మె చేస్తున్నా ప్రభుత్వానికి చీమకుట్టినట్టుగా లేదని సిఐటియు నాయకులు కె శ్రీనివాసరావు అన్నారు. కార్యక్రమంలో ఐ వెంకటలక్ష్మి, టి రాణి, టి జోస్నా, పి శ్యామల, పి విజయలక్ష్మి, సిఐటియు ఎండి చిన్నదాసు పాల్గొన్నారు.


బల్లికురవ రూరల్ : స్థానిక తహసిల్దార్ కార్యాలయం ఎదుట అంగన్వాడి కార్యకర్తలు పెద్ద ఎత్తున 4వ రోజు సమ్మె నిరాహార దీక్ష చేశారు. మండలంలోని నక్క బొక్కలపాడు పంచాయతీలోని అంగన్వాడి సెంటర్ ధర్నా నిర్వహించారు. అంగన్వాడి సెంటర్ తాళాలు పగలకొట్టే ప్రయత్నాన్ని అంగన్వాడి కార్యకర్తలు అడ్డుకోవడంతో సచివాలయం సిబ్బంది వెనుతిరిగారు. గుంటుపల్లి పంచాయతీలోని మూడు అంగన్వాడి సెంటర్లను సచివాలయం సిబ్బంది, మహిళా పోలీస్, విఆర్ఓ, పంచాయతీ సెక్రెటరీ తాళాలు పగలగొట్టి తమ ఆధీనంలో తీసుకున్నారు. అధికారం చేపట్టకముందు పాదయాత్రలో మహిళలకు ఏ కష్టం వచ్చినా తానున్నానని ప్రతిపక్ష నాయకుడిగా జగన్మోహన్‌రెడ్డి హామీ ఇచ్చారని అంగనవాడీ కార్యకర్తలు అన్నారు. కానీ నాలుగున్నరేళ్ళు గడుస్తుతున్న పట్టించుకోకపోవడంతో సమ్మెలోకి వెళ్లాల్సి వచ్చిందని అంగనవాడీ కార్యకర్తలు అన్నారు.


ఇంకొల్లు రూరల్‌ : అంగన్‌వాడి కార్యకర్తలు 4రోజు సమ్మె చేశారు. సమ్మె పరిష్కరించకుండా అంగన్‌వాడీ కేంద్రాల తాళాలు దౌర్జన్యంగా పగలకొట్టి నడుపుతామని అధికారులు ఏమిటని ప్రశ్నించారు. బెదిరింపులతో ఉధ్యమాన్ని అణచలేరని హెచ్చరించారు. కార్యక్రమంలో సిఐటియు నాయకులు నాగండ్ల వెంకట్రావు, అంగన్‌వాడీ యూనియన్‌ నాయకులు దేవమణి, అనురాధ, శ్రీదేవి, తులసి, లక్ష్మీ కుమారి, సంధ్య, ఎస్తేరు రాణి, దేవమ్మ, లత, పద్మావతి, కస్తూరి, సుధా పాల్గొన్నారు.


చెరుకుపల్లి : అంగన్వాడి కేంద్రాలను సచివాలయ సిబ్బందితో బలవంతంగా తెరిపించడం పట్ల కార్యకర్తలు, ఆయాలు నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వం కక్ష సాధింపు చర్యగా పేర్కొన్నారు. తమ సమస్యలు పరిష్కరించకుండా వాలంటీర్ల చేత తాళాలు పగలగొట్టించి, అణచివేత ధోరణి అవలంబిస్తుందని సిఐటియు జిల్లా అధ్యక్షులు సిహెచ్ మనిలాల్ అన్నారు. తహసిల్దార్ బి వెంకటేశ్వర్లుకు అంగన్వాడి కార్యకర్తలు వినతి పత్రాన్ని శుక్రవారం అందజేశారు. నల్ల రిబ్బన్లతో నిరసనను వ్యక్తం చేశారు.


మేదరమెట్ల : అంగన్వాడీల సమ్మె నాలుగో రోజుకి చేరుకుంది. సమ్మెకు టిడిపి నాయకులు మద్దతు ప్రకటించారు. టిడిపి మండల అధ్యక్షుడు జాగర్లమూడి జయకృష్ణ మాట్లాడుతూ వాగ్దానాలను నెరవేర్చలేని స్థితిలో వైసిపి ప్రభుత్వం ఉందని అన్నారు. వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు ఎం ఆంజనేయులు మాట్లాడుతూ ప్రభుత్వం ఎటువంటి చర్యలకు పాల్పడిన భయపడకుండా సమస్య పరిష్కారం అయ్యేవరకు ధైర్యంగా పోరాడాలని చెప్పారు. కార్యక్రమంలో కారుసాల గురు బాబు, నాగేశ్వరరావు, దశరధ వై రవీంద్రబాబు పాల్గొన్నారు.


నిజాంపట్నం : అంగన్వాడీ కేంద్రాల తాళాలు పగలు కొట్టడం ప్రభుత్వ ప్రతీకార చర్యేనని సీఐటీయు నాయకులు ఎన్ శివశంకర్ అన్నారు. స్థానిక తహశీల్దారు కార్యాలయం వద్ద అంగన్‌వాడి కార్యకర్తలు చేస్తున్న సమ్మెలో భాగంగా 4రోజు నల్ల రిబ్బన్లు, నల్ల చీరలు కట్టుకుని నిరసన తెలిపారు. అంగన్‌వాడీ కేంద్రాల తాళాలు పగులగొట్టే పద్దతి మానుకోవాలని తహశీల్దారుకు వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో యూనియన్ నాయకురాలు ఉషా రాణీ, గాయత్రి పాల్గొన్నారు.


అమృతలూరు : అంగన్‌వాడీ కార్యకర్తల సమ్మె సందర్భంగా వేమూరులో టిడిపి, జనసేన నాయకులు సమ్మేకు మద్దతు తెలిపారు. వేమూరు మార్కెట్ యార్డ్ మజీ చైర్మెన్ జొన్నలగడ్డ విజయబాబు, జనసేన ఇన్‌ఛార్జి ఉసా రాజేష్, చావలి సర్పంచ్ విష్ణుమొలకల శ్రీనివాసరావు, రైతు సంఘం నాయకులు కిషోర్ అంగన్వాడీ సమ్మెకు మద్దతు ప్రకటించారు.


నగరం : మండలంలోని అంగన్వాడి కేంద్రాల తాళాలు పగలగొట్టడాని నిరసిస్తూ నల్ల చీరలతో సమ్మె శిబిరంలో అంగన్‌వాడీ కార్యకర్తలు ఆందోళన చేశారు. టిడిపి, జనసేన నాయకుల మద్దతు ప్రకటించారు. తాళాలు పగలగొట్టే పక్రియ మానుకోవాలని తహశీల్దారు, ఎంపీడీఒకు వినతి పత్రం అందజేశారు. సమ్మె శిబిరంలో నల్ల రిబ్బన్లు, చీరలు కట్టుకుని నిరసన తెలిపారు. అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ (సిఐటియు) నాయకులు కె రత్నకుమారి, నలిని పాల్గొన్నారు.


చిన్నగంజాం : అంగన్‌వాడీలను భయభ్రాంతులకు గురి చేసే విధంగా సెంటర్ల తాళాలు పగలగొట్టడం హేయమైన చర్యని సిఐటియు జిల్లా కార్యదర్శి జి ప్రతాప్ కుమార్ అన్నారు. స్థానిక మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో అంగన్‌వాడీల ధర్నాను ఉద్దేశించి మాట్లాడారు. జెవివి రాష్ట్ర కార్యదర్శి కుర్ర రామారావు, యుటిఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు ఎస్ పాపారావు, యుటిఎఫ్ మండల అధ్యక్ష, కార్యదర్శులు వెంకట రసూల్, శ్రీనివాసరావు సంఘీభావం తెలిపారు. కార్యక్రమంలో అంగన్వాడి యూనియన్ నాయకులు ఏ హైమావతి, కె రంగనాయకమ్మ, యానాదమ్మ పాల్గొన్నారు.


రేపల్లె : అంగన్వాడి కార్యకర్తలు సమ్మెలో ఉంటే సమస్యలు పరిష్కరించకుండా అంగనవాడీ కేంద్రాల తాళాలు పగలగొట్టడాని నిరసిస్తూ స్థానిక అంబేద్కర్ విగ్రహం వద్ద మానవహారంగా నిరసన తెలిపారు. సిఐటియు జిల్లా అధ్యక్షులు సిహెచ్ మణిలాల్ ప్రభుత్వ తీరును ఖండించారు. గతంలో ఏ ప్రభుత్వం చేయని పద్ధతుల్లో సమస్యలు పరిష్కరించమని శాంతియుతంగా సమ్మె చేస్తుంటే బెదిరింపులకు పాల్పడుతుందని అన్నారు. పలుగులు, సుత్తులాతో తలుపులు పగలగొట్టడం సిగ్గుచేటని అన్నారు. అంగన్‌వాడీల శిబిరానికి పలువురు మద్దతు ప్రకటించారు, కార్యక్రమంలో వెంకట్రావు, అంగన్వాడీ వర్కర్స్, హెల్పర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు కె ఝాన్సీ, ప్రాజెక్ట్ కార్యదర్శి కె వాణి, నిర్మల, జ్యోతి, ఎన్ కృష్ణకుమారి, రజిని, శివలక్ష్మి, విజయలక్ష్మి, బేబీరాణి పాల్గొన్నారు.


మార్టూరు రూరల్ : శాంతియుతంగా నిరసన తెలుపుతున్న అంగన్‌వాడిలను అణచివేయాలని చుస్తే పోరాటం ఉదృతం చేస్తామని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు బత్తుల హనుమంతరావు హెచ్చరించారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను అమలు చేయాలని అన్నారు. కార్యక్రమంలో యూనియన్ నాయకులు తాళ్లూరి రాణి, శ్యామల, రాజేశ్వరి, శాంతి, జ్యోతి అంగన్‌వాడి పాల్గొన్నారు. టిడిపి మహిళా మండలి అధ్యక్షురాలు ఉప్పుటూరి రమాదేవి ఆగ్రహం వ్యక్తం చేసారు. టిడిపి నాయకులు తొండెపు ఆదినారాయణ, రజాక్‌లతో కలిసి అంగన్వాడీ కార్యకర్తల సమ్మె మద్దతు తెలిపారు.


భట్టిప్రోలు : అంగన్వాడీ కార్యకర్తల నిరవధిక సమ్మె 4వ రోజుకు చేరింది. స్థానిక తహశీల్దారు కార్యాలయం వద్ద జరిగే సమ్మెకు టిడిపి నాయకులు సాయిబాబా సంఘీభావం తెలిరు. అంగన్వాడీలు తాసిల్దార్ కార్యాలయం నుండి బస్టాండ్ సెంటర్ వరకు ర్యాలి నిర్వహించారు. కార్యక్రమంలో సిటియు కార్యదర్శి జి సుధాకర్, ఎం సత్యనారాయణ, టిడిపి నాయకులు కరుణ శ్రీనివాసరావు, కుక్కల వెంకటేశ్వరరావు, కంభం సుధీర్, ఎడ్ల జయశీలరావు, సిరాజుద్దీన్ పాల్గొన్నారు.

➡️