చెవిలో పూలతో అంగన్వాడీల నిరసన

Dec 21,2023 02:29

ప్రజాశక్తి – బాపట్ల
అంగన్వాడీల సమ్మె 9వ రోజుకు చేరింది. అంగన్వాడీ కార్యకర్తలు చెవుల్లో పూలు పెట్టుకుని బుధవారం తమ నిరసన తెలిపారు. సిఐటియు జిల్లా కార్యదర్శి మజుందార్ మాట్లాడుతూ అంగన్వాడీలు చేపట్టిన నిరవధిక సమ్మె విరమించాలంటే జగన్మోహన్‌రెడ్డి ఇచ్చిన హామీలను నెరవేర్చాలని అన్నారు. మాట తప్పను, మడమ తిప్పను అన్న సిఎం మాట మీద నిలబడని పక్షంలో రానున్న రోజుల్లో అంగన్వాడీలు తమ సత్తా నిరూపిస్తారని అన్నారు. ప్రభుత్వం మొండిపట్టు పడితే అంతకంటే జగమొండిగా అంగన్వాడీలు సమ్మె నుంచి విరమించేది లేదన్నారు. అంగన్వాడీలకు హామీ ఇవ్వమని ఎవరు అడిగారని ప్రశ్నించారు. హామీలు ఇచ్చి మాటలతో మోసం చేసే సిఎం జగన్‌ను ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు. సమ్మెలో అంగన్వాడీ యూనియన్ అధ్యక్షురాలు శైలశ్రీ, హేమలత, గీత, సిఐటియు జిల్లా కోశాధికారి భోగిరెడ్డి తిరుమలరెడ్డి, శరత్, శామ్యుల్ పాల్గొన్నారు.


కొల్లూరు : న్యాయమైన డిమాండ్ల సాధన కోసం అంగన్వాడీ వర్కర్స్, హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో చేపట్టిన నిర్వాదిక సమ్మె 9వ రోజు కూడా కొనసాగించారు. వేతనాలు పెంచడంతోపాటు ఇతర డిమాండ్లు పరిష్కరించాలని రోడ్లపై వంటా వార్పు చేసి నిరసన తెలిపారు. కార్యక్రమంలో సిఐటియు నాయకులు బోనగల సుబ్బారావు, అంగన్వాడి లీడర్స్ ఆదిలక్ష్మి, పద్మ, సౌభాగ్యలక్ష్మి పాల్గొన్నారు.


పంగులూరు : న్యాయమైన డిమాండ్ల సాధనకై 9రోజులుగా అంగన్‌వాడీలు ఆందోళన చేస్తున్నారు. స్థానిక తహశీల్దారు కార్యాలయం వద్ద బుధవారం వంటావార్పు చేశారు. మధ్యాహ్నం భోజనం అక్కడే చేశారు. కార్పొరేట్ సంస్థలకు రూ.లక్షలు ధారధత్తం చేసే ప్రభుత్వాలు కష్టం చేస్తున్న తమకు ఇచ్చే వేతనంకు ఎందుకు పట్టుదలకు పోతున్నారని ప్రశ్నించారు. అనంగ్‌వాడీ కేంద్రాలు నడపాలనే మొండి పట్టుదలతో సచివాలయ సిబ్బంది, మహిళా పోలీనులను బలవంతం చేస్తున్నారని అన్నారు. 9రోజులుగా పాఠశాలలు మూతపడి విద్యార్థులు, గర్భవతులు, బాలింతలకు పోషకాహారం ఇవ్వకపోయినా ప్రభుత్వానికి పట్టలేదని అన్నారు. ప్రజల ఆరోగ్యం పట్ల ప్రభుత్వానికి బాధ్యత లేదని అన్నారు. ప్రభుత్వం కదిలేవరకు ఆందోళన కొనసాగిస్తామని అన్నారు. తమ పట్ల నిర్లక్ష్యం వహిస్తే భవిష్యత్తులో పాలకులు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. కార్యక్రమంలో సిఐటియు కార్యదర్శి గుడిపాటి మల్లారెడ్డి పాల్గొన్నారు.


రేపల్లె : అంగన్వాడిలు 9వ రోజు సమ్మె సందర్భంగా శిబిరంలో చెవుల్లో పూలు పెట్టుకోని నిరసన తెలిపారు. అంగన్వాడీ వర్కర్స్,హెల్పర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు జె ఝాన్సీ మాట్లాడుతూ ప్రభుత్వం రోడ్డున పడేసిన నేపథ్యంలో డబ్బులు లేవని, జీతాలు పెంచలేమని చెవులో పూలు పెడుతున్నారని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని అన్నారు. పరిష్కరించకుండా నిర్భంధం ప్రయోగించడం మానుకోవాలని హెచ్చరించారు. సిఐటియు జిల్లా అధ్యక్షులు సిహెచ్ మణిలాల్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం స్పందించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని అన్నారు. రాబోయే కాలంలో కలెక్టరేట్లను ముట్టడిస్తామని, చలో విజయవాడ నిర్వహిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో యూనియన్ నాయకులు డి జ్యోతి, సునీత, నిర్మలజ్యోతి, వై మేరీమణి పాల్గొన్నారు.


కారంచేడు : అంగన్‌వాడి సమస్యల పరిష్కరించాలని కోరుతూ 9వ రోజు స్వర్ణ గ్రామంలో ఆందోళన నిర్వహించారు. అంగన్వాడీల న్యాయ సమ్మతమైన సమస్యలు పరిష్కారం చేయాలని కోరారు. గతంలో వైసిపి ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరారు. తెలంగాణతో సమానంగా వేతనాలు ఇవ్వాలని నినాదాలు చేశారు. అంగన్వాడీ కార్యకర్తల ఆందోళనకు స్వర్ణ టిడిపి మండల అధ్యక్షులు తిరుమలశెట్టి శ్రీహరి, తిరుమలశెట్టి ఆదినారాయణ, జనసేన నాయకులు చిరంజీవి, వెంకటేశ్వర్లు, గళ్ళ సురేష్, సాగిరి శ్రీనివాసరావు, సాంబయ్య మద్దతు తెలిపారు. కార్యక్రమంలో అంగన్వాడి ప్రాజెక్టు నాయకురాలు అనిత, శ్రీలక్ష్మీ, రాధా, మేరీ, సిఐటియు నాయకులు పి కొండయ్య పాల్గొన్నారు.


భట్టిప్రోలు : అంగన్వాడీల న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని చేపట్టిన నిరవధిక సమ్మెలో భాగంగా స్థానిక తహశీల్దారు కార్యాలయం వద్ద వంటవార్పు చేపట్టారు. 9రోజులుగా అంగన్వాడి వర్కర్స్ అండ్ హెల్పర్స్ వివిధ రూపాల్లో నిరసన వ్యక్తం చేస్తున్నారు. ప్రతిపక్ష నేతగా వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యుటీ, పెన్షన్ అమలు చేయాలని కోరారు. రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలని అన్నారు. ప్రభుత్వ వైఖరికి నిరసనగా నినాదాలు చేశారు. కార్యక్రమంలో సిఐటియు నాయకులు జి సుధాకర్, ఎం సత్యనారాయణ, జి నాగరాజు, అంగన్వాడి యూనియన్ అధ్యక్షులు రమాదేవి పాల్గొన్నారు.


అద్దంకి : అంగనవాడి కార్యకర్తల డిమాండ్ల సాధన కోసం గత 9రోజుల నుండి వివిధ రకాలుగా నిరసన తెలియజేస్తున్నారు. తహశీల్దారు కార్యాలయం వద్ద అంగన్వాడీ కార్యకర్తలు రోడ్డు వెంట నిలబడి బిక్షాటన బుధవారం చేశారు. సిఐటియు అధ్యక్షురాలు జి శారద మాట్లాడుతూ కార్యకర్తలకు కనీస వేతనం రూ.26వేలు ఇవ్వాలని అన్నారు. ఇంత జరుగుతున్న ప్రభుత్వానికి చీమకుట్టినట్టు కూడా లేదని అన్నారు. సిఎం జగన్‌ ఇచ్చిన హామీని అమలు చేయాలని కోరారు. కార్యక్రమంలో సిపిఎం కార్యదర్శి తంగిరాల వెంకటేశ్వర్లు, సిఐటియు నాయకులు పి తిరుపతిరెడ్డితోపాటు అంగన్వాడీ కార్యకర్తలు అనితాదేవి, ఆయాలు పాల్గొన్నారు.


నగరం : సమస్యలు పరిష్కరించకుండా మహిళలను రొడ్డున పడవేయటాన్ని నిరసిస్తూ అంగన్‌వాడీ కార్యకర్తలు బుధవారం భిక్షాటన చేసి నిరసన తెలిపారు. 9వ రోజు సమ్మెలో ప్రభుత్వ కార్యాలయాలు, దుకాణాల వద్దకు వెళ్లి భిక్షాటన చేశారు. అంగన్వాడీ యూనియన్‌ నాయకురాలు ఎన్ కృష్ణకుమారి మాట్లాడుతూ ప్రభుత్వం ఎంత నిర్భంధం ప్రయోగించినా డిమాండ్స్‌ అంగీకరించేవరకు సమ్మె కొనసాగిస్తామని హెచ్చరించారు. బెదిరింపు ధోరణి మానుకోవాలని అన్నారు. కార్యక్రమంలో అంగన్వాడీ యూనియన్ మండలం నాయకులు వెంకటలక్ష్మి, రాజ్యలక్ష్మి, రజిని, నళిని పాల్గొన్నారు.


ఇంకొల్లు రూరల్‌ : అంగన్వాడీ కార్యకర్తల సమ్మె 9వ రోజు కొనసాగించారు. తహశీల్దారు కార్యాలయం నుండి జోలిపట్టి ప్రధాన రహదారుల్లో భిక్షాటన చేశారు. తమకు జీతాలు ఇవ్వనందున తాము బిక్షాటన చేస్తున్నట్లు తెలిపారు. ఒక్క రూపాయి దానం చేసి తమ పోరాటానికి మద్దతు ఇవ్వాలని ప్రజలను కోరారు. డిమాండ్స్ పరిష్కారం అయ్యేవరకు సమ్మె విరమించేది లేదని హెచ్చరించారు. కార్యక్రమంలో సిఐటియు మండల కార్యదర్శి నాగండ్ల వెంకట్రావు, ప్రాజెక్టు లీడర్స్ బి సరళ, లక్ష్మీకుమారి, దేవమణి, లక్ష్మి, రేవతి, లావణ్య, దేవమ్మ, సంపూర్ణ, సిద్ధమ్మ, భూలక్ష్మి, సూర్యలక్ష్మి, శ్రీదేవి పాల్గొన్నారు.


పర్చూరు : అంగన్‌వాడీలు చేస్తున్న నిరవధిక సమ్మె స్థానిక తహశీల్ధారు వద్ద 9వ రోజుకు చేవారు. సమ్మెకు టిడిపి మండల అధ్యక్షులు షేక్‌ షంషుద్దీన్‌, కాంగ్రెస్‌ కార్యదర్శి తోట శివనాగేశ్వరరావు, హమాలీల సంఘం నాయకులు చింతగుంట శ్రీనివాసరావు, నల్లమడ సంఘం రైతు నాయకులు నరిశెట్టి ఆచార్యులు మద్దతు తెలిపారు. సిఎం జగన్‌మోహన్‌రెడ్డి పాదయాత్రలో ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. న్యాయంగా అంగన్‌వాడీలు చేస్తున్న సమ్మెకు తమ మద్దతు ఉంటుందన్నారు. పరిష్కారం కాకుంటే సమ్మె ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో సిఐటియు నాయకులు కె శ్రీనివాసరావు, ఎం డేవిడ్‌ పాల్గొన్నారు.


మేదరమెట్ల : తొమ్మిది రోజుల నుండి కొరిసపాడు మండల కార్యాలయం వద్ద అంగన్వాడి కార్యకర్తలు సమ్మె చేస్తున్నారు. స్థానిక శాసనసభ్యులు గొట్టిపాటి రవికుమార్ అంగన్‌వాడీ కార్యకర్తలకు మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా కార్యకర్తలు భిక్షాటన చేస్తూ వినూత్న రీతిలో కనిపించారు. అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆయాల డిమాండ్లు రాష్ట్ర ప్రభుత్వం నెరవేర్చేవరకు సమ్మె కొనసాగుతుందని ప్రకటించారు. కార్యక్రమంలో టిడిపి నాయకులు, కార్యకర్తలు, అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు పాల్గొన్నారు.


చెరుకుపల్లి : అంగన్‌వాడీ కార్యకర్తలు 9వ రోజు భిక్షాటన చేసి నిరసన తెలిపారు. స్థానిక తహశీల్దారు కార్యాలయం వద్ద సమ్మె శిబిరంలో తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ నినాదాలు చేశారు. షాపులు వెంబడి బిక్షాటన చేశారు. అంగన్వాడి వర్కర్స్ యూనియన్ నాయకురాలు మల్లేశ్వరి మాట్లాడుతూ తమ సమస్యలు పరిష్కరించే వరకు నిరసన కొనసాగిస్తామని పేర్కొన్నారు.
యద్దనపూడి : అంగన్వాడీ కార్యకరక్తలు నిరవధిక సమ్మెలో భాగంగా బుధవారం భిక్షాటన చేసి నిరసన తెలిపారు. అనంతరం ప్రధాన కూడలిలో మానవ హారం ఏర్పాటు చేశారు. సిఐటియు జిల్లా ఉపాధ్యక్షలు బత్తుల హనుమంతరావు మాట్లాడుతూ ప్రభుత్వం అంగన్వాడీల పట్ల నిర్లక్ష్యంగా వ్వవహరిస్తుందని అన్నారు. సమ్మె పరిష్కరించకుంటే తగిన మూల్యం చెల్లించాల్సి వస్తుందని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.


నిజాంపట్నం : అంగన్వాడిల 9వ రోజు సమ్మెలో బాగంగా సమ్మె శిబిరం వద్ద వంట, వార్పు వండి, శిబిరం వద్దనే భోజనం చేసి నిరసన తెలిపారు. సిఐటియు జిల్లా అధ్యక్షులు సిహెచ్ మణిలాల్ మాట్లాడుతూ అంగన్‌వాడీ కార్యకర్తలను ప్రభుత్వం రోడ్డున పడేసిందని అన్నారు. ఈ నేపథ్యంలో సమ్మె శిబిరాల వద్దనే వంటచేసి తమ నిరసన తెలుపుతున్నామని అన్నారు. ప్రభుత్వం స్పందించకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని అన్నారు. రాబోయే కాలంలో కలెక్టరేట్లు ముట్టడిస్తామని, చలో విజయవాడ నిర్వహిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో సిఐటియు, ప్రజాసంఘాల నాయకులు ఎన్ శివశంకర్, ఉష, రాజేశ్వరి, ధనలక్ష్మి, నాగదేవత పాల్గొన్నారు.
సంతమాగులూరు : అంగన్వాడీల సమ్మె బుధవారంకు 9వ రోజుకు చేరుకుంది. ఐసిడిఎస్ కార్యాలయం ఎదుట ఒంటికాలు మీద నిలబడి దండం పెడుతూ నిరసనను వ్యక్తం చేశారు. అనంతరం ఐసిడిఎస్ ప్రాజెక్టు కార్యాలయం నుండి బస్టాండ్ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు.


చీరాల : అంగన్వాడి కార్యకర్తల సమస్యల పరిష్కారం కోసం తహశీల్దారు కార్యాలయం వద్ద చేస్తున్న సమ్మె, దీక్షలు బుధవారంకు 9వ రోజుకు చేరాయి. వంట వార్పుతో నిరసన తెలిపారు. తాళాలు పగులగొట్టి అంగన్‌వాడీలను బెదిరంచాలనుకుంటే కుదరదని సిఐటియు నాయకులు ఎన్‌ బాబురావు, ఎం వసంతరావు అన్నారు. ఈ నెల 27నుంచి మున్సిపల్ కార్మికులు సమ్మె చేస్తున్నారని, అప్పుడు ఎవరు వీధులు ఊడుస్తారని ప్రశ్నించారు. సమ్మెకు ప్రజా వేదిక అధ్యక్షులు గుమ్మడి యేసు రత్నం, కెవిపిఎస్ కార్యదర్శి ఎల్ జయరాజు మద్దతు ప్రకటించారు. కార్యక్రమంలో అంగన్వాడీ యూనియన్ జిల్లా కార్యదర్శి పి రేఖఎలిజిబెత్‌, పి ప్రమీల, జి సుజీవన, ఎ బ్యూల, సులోచన, శిరీష, అనిత, జ్యోతి పాల్గొన్నారు.


మార్టూరు రూరల్ : న్యాయబద్ధమైన డిమాండ్ల సాధన కోసం అంగన్‌వాడీలు శాంతియుతంగా పోరాడుతుంటే ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తుందని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు బత్తుల హనుమంతరావు ధ్వజమెత్తారు. స్థానిక తహశీల్దార్ కార్యాలయం వద్ద అంగన్వాడీలు సమ్మె కొనసాగింది. 9రోజులుగా అంగన్వాడీలు సమ్మె చేస్తుంటే ప్రభుత్వం పరిష్కరించకుండా అణచివేత ధోరణి ప్రదర్శించడం సిఎం వైఎస్ జగన్‌కు తగదని అన్నారు. అంగన్వాడీ యూనియన్‌ సెక్టార్ అధ్యక్షురాలు తాళ్లూరి రాణి ఆధ్వర్యంలో తహాశీల్దారు కార్యాలయం నుండి స్టేట్ బ్యాంకు వరకు ర్యాలీ నిర్వహించి బిక్షాటన చేశారు.

➡️