పంగులూరు వాసికి భూమిపుత్ర పురస్కారం

Dec 24,2023 00:06

ప్రజాశక్తి – పంగులూరు
రైతులకు విలువైన సూచనలు, సలహాలు అందించి, వ్యవసాయ అభివృద్ధికి కృషి చేసిన పంగులూరు మండల వాసి, పృథ్వి ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీ చైర్మన్ గరికపాటి సుబ్బారావుకు భూమిపుత్ర పురస్కారం లభించింది. తెలంగాణ రాష్ట్రం మహబూబాద్‌లో శనివారం రైతు సహాయ వేదిక ఈ పురస్కారాన్ని అందజేసింది. మండలంలోని అలవలపాడుకు చెందిన గరికపాటి సుబ్బారావు, మరి కొంతమంది రైతులు కలిసి కేంద్ర ప్రభుత్వం ద్వారా ఎఫ్‌పిఓ అనే ఒక గ్రూపును ఏర్పాటు చేసి, దానికి పృద్వి అని పేరు పెట్టుకున్నారు. రైతులందరూ కలిసి అక్కడ ఒక ఎరువుల షాపును ఏర్పాటు చేశారు. ప్రజలకు పంపిణీ చేస్తున్న సబ్సిడీ శనగలను ఈ గ్రూపు ద్వారా ప్రజలకు అందిస్తున్నారు. రైతులు పండించిన పంటలను కొనుగోలు చేయటానికి మూడు కలెక్షన్ పాయింట్లు ఏర్పాటు చేశారు. త్వరలో ఈ గ్రూపు ద్వారా రైతులకు కావలసిన కోల్డ్ స్టోరేజిని, కేంద్ర ప్రభుత్వం అధిక సబ్సిడీతో ఏర్పాటు చేయడానికి, రైతుల ద్వారా విత్తనం పండించి ఆ విత్తనాన్ని మరలా రైతులే పొలంలో విత్తుకోవడానికి అనుకూలంగా వ్యవసాయం చేసే విధంగా పలు సూచనలు, సలహాలు ఇస్తున్నారు. అనేక పంటలను ఈ కలెక్షన్ పాయింట్లు ద్వారా ఎక్స్పోర్ట్ చేయడానికి ఒక పద్దతి ప్రకారం వెళుతున్నారు. ఈ విధంగా రైతులకు సహకరిస్తున్న గరికపాటి సుబ్బారావుని శనివారం రెండు తెలుగు రాష్ట్రాల రైతుల సమక్షంలో భూమిపుత్ర అవార్డుతో సన్మానించారు.

➡️