దీక్షా శిభిరాల్లోనే క్రిస్మస్‌ పండుగ : పండుగరోజూ కొనసాగిన అంగన్‌వాడీల సమ్మె

Dec 25,2023 23:46

ప్రజాశక్తి – పంగులూరు
అంగన్‌వాడి కార్యకర్తల నిరసవధిక సమ్మె సోమవారం 13వ రోజు కొనసాగించారు. అంగన్‌వాడీలు రిలే నిరాహార దీక్ష చేశారు. సమస్యలు పరిష్కారం అయ్యేవరకు పోరాటాన్ని కొనసాగిస్తామని, ప్రభుత్వం దిగివచ్చే వరకు సమ్మె విరమించేది లేదని సిఐటియు కార్యదర్శి గుడిపాటి మల్లారెడ్డి అన్నారు. అంగన్‌వాడీ కార్యకర్తల న్యాయమైన డిమాండ్లపై ప్రభుత్వం స్పందించాలని కోరారు. 13రోజుల నుండి నిరవధిక సమ్మె చేస్తున్నప్పటికీ ప్రభుత్వం పట్టించుకోవటం అన్యాయమని అన్నారు. ప్రభుత్వం సానుకూలంగా స్పందించి అంగన్‌వాడీల సమస్యలు పరిష్కరించాలని కోరారు. అంగన్‌వాడీ కేంద్రాలను సాఫీగా జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు. రిలే నిరాహార దీక్షలో స్వర్ణలత, సరోజినీ, రాణి, వెంకటరమణమ్మ, లక్ష్మీ, సుబ్బాయమ్మ పాల్గొన్నారు.


భట్టిప్రోలు : అంగన్‌వాడిల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ చేపట్టిన నిరవధిక సమ్మె, దీక్షలో భాగంగా సోమవారం తహశీల్దారు కార్యాలయం వద్ద చేపట్టిన శిబిరంలో క్రిస్మస్‌ పండుగ సందర్భంగా కేక్ కటింగ్ చేశారు. అంగన్‌వాడీల సమస్యలు పరిష్కారం అయ్యే వరకు సమ్మె కొనసాగిస్తామని అంగన్‌వాడీలు హెచ్చరించారు. క్రిస్మస్ సెలవైనమైనప్పటికీ పెద్ద సంఖ్యలో అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆయాలు దీక్షా శిబిరంకు చేరుకుని ఉదయం నుండి సాయంత్రం వరకు నినాదాలు చేస్తూ నిరసన కొనసాగించారు. కార్యక్రమంలో సిఐటియు కార్యదర్శి జి సుధాకర్, అంగన్వాడి వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ నాయకులు పాల్గొన్నారు.


కారంచేడు : న్యాయమైన సమస్యల పరిష్కారం కోసం గత 13 రోజులుగా నిర్వహిస్తున్న అంగన్‌వాడీల సమ్మె క్రిస్మస్ పండుగ రోజు కూడా కొనసాగించారు. స్థానిక తహశీల్దారు కార్యాలయం వద్ద క్రిస్మస్ పండుగ రోజు కూడా అంగన్‌వాడీ వర్కర్లు ఆందోళనలో కేక్‌ కట్‌ చేసి నిరసన వ్యక్తం చేశారు. సమస్యలు పరిష్కారానికి ప్రభుత్వం సానుకూలంగా ముందుకు రావాలని కోరారు. కార్యక్రమంలో అంగన్వాడి యూనియన్ నాయకులు అనిత, మేరీ, హఫీజ, వివిధ గ్రామాల నుండి వచ్చిన అంగనవాడి కార్యకర్తలు, ఆయాలు, సిఐటియు జిల్లా పి కొండయ్య పాల్గొన్నారు.


చీరాల : అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆయాల సమస్యల పరిష్కారం కోసం చేస్తున్న నిరసన దీక్షలు క్రిస్మస్ పండుగ రోజు కూడా కొనసాగాయి. స్థానిక తహశీల్దారు కార్యాలయం వద్ద అంగన్వాడీ కార్యకర్తలు నిరసన దీక్షలు చేశారు. 14రోజులుగా అంగన్‌వాడీలు సమ్మె చేస్తున్నప్పటికీ ప్రభుత్వం స్పందించకపోవడం దుర్మార్గమని సిఐటియు కార్యదర్శి ఎం వసంతరావు అన్నారు. చర్చల సమయంలో తమ వద్ద బడ్జెట్‌ లేదని మాట్లాడిన ప్రభుత్వం వాలంటీర్లకు ఎక్కడి నుండి తెచ్చి జీతాలు పెంచారని ప్రశ్నించారు. విద్యార్థులకు ట్యాబులు పంపిణీ పేరుతో బైజుస్‌కు రూ.5వేల కోట్లు ఎలా కట్టబెట్టారని ప్రశ్నించారు. రుషికొండలో రూ.450కోట్లతో గెస్ట్ హౌస్ ఎలా కడుతున్నారని అన్నారు. అంగన్‌వాడీల వేతనాలు పెంచడానికి డబ్బు లేదంటు ప్రభుత్వం రూ.కోట్ల నిధులు దుర్వినియోగం చేస్తుందని అన్నారు. జగనన్న ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదని అన్నారు. అంగన్‌వాడీల దీక్షలకు ఆర్టీసీ ఎస్‌డబ్ల్యూఎఫ్ నాయకులు బి శ్రీనివాసరావు మద్దతు తెలిపారు. కార్యక్రమంలో అంగన్‌వాడీ యూనియన్‌ నాయకులు ఎ జ్యోతి, దుర్గ, ప్రియాంక పాల్గొన్నారు.


పర్చూరు : అంగన్‌వాడీ కార్యకర్తలు పట్టు వీడకుండా పోరాటం చేస్తున్నారు. సోమవారం క్రిస్టమస్ పండుగ అయినప్పటికీ తదేక దీక్షతో స్థానిక తహశీల్దారు కార్యాలయం వద్ద మోకాళ్ళ మీద నుంచొని నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు. ప్రభుత్వం పట్టుదలకు పోకుండా తమ సమస్యలు వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు బండి శంకరయ్య, సిఐటియు నాయకులు కె శ్రీనివాసరావు, బి చిన్నదాసు, ఎం డేవిడ్, అంగన్‌వాడి కార్యకర్తలు, ఆయాలు పాల్గొన్నారు.

➡️