ఎన్ని పొత్తులు పెట్టుకున్న మళ్లీ సీఎం జగనే : వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడుదల రజని

Mar 9,2024 23:57

ప్రజాశక్తి – మెదరమెట్ల
నేడు జరుగనున్న సిద్ధం సభ ప్రాంగణాన్ని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడుదల రజిని పరిశీలించారు. ఈసందర్భంగా పత్రికా విలేకరులతో శనివారం మాట్లాడారు. సిద్ధం మహాసభకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకుని సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. రాష్ట్రంలో ఎన్ని పార్టీలు కలసిపొత్తులు పెట్టుకున్నా రాబోయే ఎన్నికల్లో మంచి మెజారిటీతో తిరిగి వైఎస్‌ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతారని అన్నారు. సిద్ధం సభల స్పందన చూస్తూ ఉంటే 175సీట్లు వైసీపీనే గెలుచుకునే అవకాశం కనిపిస్తుందని అన్నారు. ఈ సభకు 15లక్షల మంది హాజరవుతున్నట్లు తెలిపారు. సభలో సిఎం జగన్‌ పార్టీ శ్రేణులకు దిశ నిర్దేశం చేస్తారని తెలిపారు. 6జిల్లాల నుండి ప్రజలు పాల్గొన్నట్లు తెలిపారు. సిఎం చేసిన పరిపాలన, సంక్షేమం, నవరత్నాల అమలు చూస్తుంటే ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని అన్నారు. రాష్ట్రంలో ఒకవైపు అభివృద్ధి మరోవైపు సంక్షేమం చేసి వైసిపి ప్రభుత్వం ముందుకు అడుగులు వేస్తుందని అన్నారు. రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ మాట్లాడుతూ ఇప్పటివరకు ముఖ్యమంత్రులుగా చేసిన వారిలో జగన్‌కు ప్రత్యేకమైన స్థానం ఉందని అన్నారు. ఆయన ఆలోచన విధానం ప్రకారం గత ప్రభుత్వానికి, ఇప్పుటి ప్రభుత్వానికి పోల్చి చూసుకుంటే 100శాతం తేడా ఉందని అన్నారు. అభివృద్ధి, సంక్షేమం ఆగిపోకుండా ఉండాలంటే మరల సీఎంగా జగన్మోహన్‌రెడ్డిని ఎన్నుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. అందుకే ప్రతి కార్యకర్త, అభిమాని సిద్దం సభను జయప్రదం చేయాలని కోరారు.
5వేల మంది పోలీసు యంత్రాంగం
సిద్ధం మహాసభ వల్ల మేదరమెట్ల, పిచ్చుకల గుడిపాడు పరిసర ప్రాంతాలన్నీ పోలీస్ యంత్రాంగం చేతుల్లోకి వెళ్లిపోయాయి. ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ప్రశాంత వాతావరణంలో సిద్ధం సభ జరిగే విధంగా చర్యలు చేపడుతున్నారు. ప్రయాణికులు, వాహనాలు వచ్చిన ప్రజలు ఇబ్బంది పడకుండా ట్రాఫిక్ నిబంధనలను పాటిస్తూ, చర్యలు తీసుకోవడానికి 5వేల మంది పోలీసులతో బద్రత ఏర్పాటు చేశారు. 4వేల మంది పోలీసు సిబ్బంది శనివారానికి చేరుకున్నారు. ఆదివారానికి 5వేల మంది పోలీస్ యంత్రాంగం హాజరవునున్నట్లు పోలీస్ అధికారులు తెలిపారు. వాహనాలు నిలుపుకోవడానికి, వాహనాల దారి మళ్లించడానికి ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో వైసిపి ఇన్చార్జ్ పాలెం హనిమిరెడ్డి, నాయకులు, అభిమానులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

➡️