పసుపు రైతుల దర్నా

Feb 27,2024 00:20

ప్రజాశక్తి – వేమూరు
గుంటూరు జిల్లా దుగ్గిరాలలో శుభం మహేశ్వరి కోల్డ్ స్టోరేజీలో జరిగిన అగ్ని ప్రమాదంలో కాలిపోయిన పసుపు బాదిత రైతులకు ప్రభుత్వం తక్షణం నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేస్తూ ఏపీ రైతు సంఘం ఆధ్వర్యంలో సోమవారం తెనాలి సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాకు గుంటూరు జిల్లాలోని రైతులతో పాటు బాపట్ల జిల్లా భట్టిప్రోలు, కొల్లూరు, వేమూరు మండలాల రైతులు పాల్గొన్నారు. రైతు పసుపు సంఘం రాష్ట్ర కన్వీనర్ జొన్న శివశంకర్ మాట్లాడుతూ కోల్డ్ స్టోరేజీలో ప్రమాదం జరిగి 37రోజులైనప్పటికీ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం దారుణమన్నారు. మార్చి 1నుండి పసుపు రైతులకు న్యాయం జరగాలని చేపట్టే నెరవేదిక నిరాహార దీక్షలకు రైతులు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు. రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు వి కృష్ణయ్య మాట్లాడుతూ ప్రమాదంలో రైతులకు రూ.100కోట్లకుపైగా నష్టవాటిల్లిందని అన్నారు. తక్షణం ప్రభుత్వ స్పందించి నష్టపోయిన రైతులకు పరిహారం ఇవ్వాలని కోరారు. జిడిసిసిబి మాజీ చైర్మన్, రేపల్లె మాజీ ఎంఎల్‌ఎ ముమ్మనేని వెంకటసుబ్బయ్య మాట్లాడుతూ పసుపు నష్టం జరిగిన రైతులకు క్వింటాకు రూ.12వేల చొప్పున నష్టపరిహారం ఇవ్వాలని కోరారు. ఏపీ రైతు సంఘం బాపట్ల జిల్లా అధ్యక్షులు వేములపల్లి వెంకటరామయ్య మాట్లాడుతూ రైతుల నుండి బీమా, అద్దె వంటి వాటిని ముక్కుపిండి వసూలు చేసుకున్నారు తప్ప రైతుల జాబితా కూడా యాజమాన్యం ఇవ్వడంలేదని అన్నారు. కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు మొలక సాంబిరెడ్డి, అధ్యక్షులు రాజశేఖరరెడ్డి, ఈదర పూర్ణచంద్రరావు, మద్దన సాంబశివరావు , హుస్సేన్ ఖాన్ పాల్గొన్నారు.

➡️