పారిశుద్ధ్య కార్మికులు తొలగింపు

Jan 30,2024 00:14

పోరాటానికి సిద్ధమవుతున్న కార్మికులు
ప్రజాశక్తి – వేటపాలెం
ప్రతిరోజు వీధులను శుభ్రం చేసే పంచాయితీ కార్మికులు టైమింగ్ గురించి ప్రశ్నించారన్న కారణంతో పంచాయితీ కార్యదర్శి ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్మికులకు నిర్ధేశించిన సమయానికన్నా ముందే పనిలోకి రాలేదన్న కారణంతో ఇంక మీరు పనికిరావక్కర్లేదంటూ హుకుం జారీ చేశారు. మండలంలోని రామన్నపేట పంచాయితీ పారిశుద్ధ్య కార్మికులను సమయపాలన లేకుండా ఎప్పుడు పడితే అప్పుడు పిలిపించి పనులు చేయిస్తున్నారని కార్మికులు వాపోతున్నారు. జీతాలు సైతం బ్యాంక్ అకౌంట్లో వేయకుండా ఇళ్లకు వచ్చి డబ్బులు ఇచ్చి వెళ్ళిపోతుంటారని చెబుతున్నారు. తమకు ఎలాంటి గుర్తింపు లేకుండా పోతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నోటి మాటలతో ఇంకా పనిలోకి రావద్దని అనటం ఏమిటని ప్రశ్నించారు. ఈ విషయంపై పంచాయతీ కార్యదర్శి బాలిక సురేంద్రను వివరణ కోరితే ప్రతినెలా కచ్చితంగా వేతనం ఇస్తున్నామని, పండగకు ఒక నెల అడ్వాన్స్ ఒక్కొక్కళ్ళకి రూ.3వేలు ఇచ్చామని తెలిపారు. అయినప్పటికీ పనికి రమ్మని కార్యదర్శి హోదాలో రెండు గంటలసేపు బతిమిలాడినా బెట్టు చేశారని తెలిపారు. ఇప్పుడు తాను తీసేశానని ప్రచారం చేస్తున్నారని అన్నారు. వాళ్ళని బతిమాడాల్సిన పని తనకేంటని అన్నారు. వాళ్లే పనిలోకి నిరాకరించడంతో కొత్త వాళ్ళతో పని చేయించుకుంటున్నామని అన్నారు. ఇప్పుడు మళ్ళీ వస్తానంటే తాను ఎలా తీసుకుంటామని ఎదురు ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో స్థానిక మండల పరిషత్ కార్యాలయ సూపర్నెంట్ ఎంవిఎస్ శర్మాను పంచాయతీ కార్మికులు కలిసి తమ ఆవేదనను చెప్పుకున్నారు. తమకు న్యాయం జరగని పక్షంలో సిఐటియు ఆధ్వర్యంలో పోరాటానికి సిద్ధమవుతామని హెచ్చరించారు. కార్యక్రమంలో పంచాయితీ వర్కర్స్ తోపాటు సిఐటియు మండల ప్రధాన కార్యదర్శి మచ్చ అయ్యప్పరెడ్డి పాల్గొన్నారు.

➡️