ఎన్నికల ప్రచార రధరం ప్రారంభం

Feb 24,2024 23:32

ప్రజాశక్తి – మార్టూరు రూరల్
టిడిపి ఎమ్మెల్లే అభ్యర్థిగా ఏలూరి సాంబశివరావును టిడిపి అధినేత చంద్రబాబు శనివారం ప్రకటించడం పట్ల టిడిపి శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వైసిపి సృష్టించిన ప్రభంజనంలో ఎంతోమంది టిడిపి హేమాహేమీలు పరాజయం పాలైనప్పటికీ పర్చూరులో రెండు సార్లు గెలుపొంది రికార్డ్ సాధించిన ఏలూరి మూడోసారి ఎమ్మెల్లే అభ్యర్థిగా పోటీ చేయనున్నారు. పర్చూరులో టిడిపికి అభ్యర్ధి లేని రోజుల్లో ఏలూరి సాంబశివరావు వచ్చి పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లి బలమైన అభ్యర్ధిగా నిలిచారని టిడిపి శ్రేణులు పేర్కొన్నారు. మార్టూరు మండలం కోనంకి గ్రామానికి చెందిన ఏలూరి నాగేశ్వరరావు, సుశీలమ్మ దంపతుల కుమారుడు సాంబశివరావు ప్రాధమిక విద్య గ్రామంలోని ఎయుసి స్కూల్, గగణపరవం ఎపి రెసిడెన్షియల్‌ స్కూల్‌, గుండ్లపల్లి నాగభైరవ జూనియర్ కాలేజిలో ఇంటర్‌ చదివారు. ఆచార్య ఎన్‌జి రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంలో బిఎస్సి, ఎమ్మెస్సీ (హార్టీ కల్చరల్) పూర్తిచేశారు. టిడిపి ఇచ్చిన పిలుపు మేరకు రాజకీయాల్లోకి వచ్చిన ఆయన సేవా కార్యక్రమాలే లక్ష్యంగా లక్ష మందికి కంటిచూపు అందించాలనే సంకల్పంతో కంటి వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నారు. పేదల జీవితాల్లో వెలుగు నింపుతూ మెరుగైన వైద్యం అందిస్తున్నారు. ఈసందర్భంగా ఎన్నికల ప్రచార రధాన్ని ఆయన ఇసుకదర్శిలోని తన క్యాంపు కార్యాలయంలో టిడిపి నాయకుల సమక్షంలో కొబ్బరి కాయ కొట్టి ప్రారంభించారు.

➡️