ఎన్నికల విధులు నిష్పక్షపాతంగా నిర్వహించాలి

Mar 2,2024 23:23

ప్రజాశక్తి – రేపల్లె
ఎన్నికల విధులు అధికారులు నిజాయితీగా, నిష్పక్షపాతంగా నిర్వహించాలని ఆర్‌డిఒ హేలా షారోన్ అన్నారు. తన కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటించినప్పటి నుంచి ఎన్నికల వ్యయ వివరాల నమోదు ఒక అంశమైతే, నోటిఫికేషన్‌ నుంచి కౌంటింగ్‌ ముగిసే వరకు ప్రవర్తనా నియమావళి పర్యవేక్షణ మరోఎత్తుగా ఉంటుందని అన్నారు. అధికారులు అప్రమత్తంగా ఉండాలని అన్నారు. ఎన్నికల నేపథ్యంలో జరిగే రాజకీయ సభలు, ర్యాలీలను క్షుణ్ణంగా పరిశీలించాలని అన్నారు. అభ్యర్ధులు వినియోగించిన వాహనాలు, కుర్చీలు, స్టేజి, సౌండ్‌ ఏర్పాట్లు, భోజనం తదితర అంశాలన్ని పరిశీలించి వివరాలు నమోదు చేయాలని అన్నారు. అక్రమ నగదు, మద్యం పంపిణీ జరగకుండా జాగ్రత్తలు వహించాలని చెప్పారు. ఎన్నికల కోడ్‌ ఉల్లం ఘనలపై అప్రమత్తంగా ఉంటూ ఆధారాలు సేకరించాలని సూచించారు. ఎన్నికల విధులు నిష్పక్ష పాతంగా నిర్వహించాలని అన్నారు. తక్కువ ఓట్లు పోలయ్యే ప్రాంతాల్లో ఓటు వినియోగంపై అవగాహన సదస్సులు ఏర్పాటు చేసి ప్రజలను చైతన్య పర్చాలని అన్నారు. 80ఏళ్లు దాటిన వృద్ధులు ఇంటి వద్ద నుంచే ఓటుహక్కు వినియోగించుకునే అవకాశం ఉందని వారికి చెప్పాలని అన్నారు. ఎన్నికల సమయంలో ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తున్నారని, యువత, ప్రజలు సివిజిల్ యాప్లో అప్లోడ్ చేస్తే బాధ్యులపై ఎన్నికల సంఘం కఠిన చర్యలు తీసుకుంటుందని తెలిపారు. సాంకేతిక పరిజ్ఞానంపై అధికారులు పట్టుకలిగి ఉండాలని అన్నారు. కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

➡️