కంద సాగుకు సిద్దమైన రైతులు

May 23,2024 22:56 ##Kolluru #Agriculture #Kanda

ప్రజాశక్తి – కొల్లూరు
మండలంలోని లంక గ్రామాల్లో చెదురు మదురు వర్షాలు కురవడంతో కంద సాగుకు రైతులు సిద్ధం అయ్యారు. గత ఏడాది కందకు మంచి రేటు పలకడంతో ఈ ఏడాది ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేయడానికి రైతులు ఆసక్తి చూపుతున్నారు. గత ఏడాది ఒక పుట్టు కంద రూ.12వేల నుంచి రూ.14వేలు పలికింది. పుట్టంటే 250కేజీలు. ఒక ఎకరానికి 80పుట్లు దిగుబడి వస్తుందని అంచనా. ఈ విధంగా చూస్తే ఒక ఎకరానికి రూ.9.60లక్షల ఆదాయం వస్తుంది. అందువలన ఈ ఏడాది రైతులు కంద సాగు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. ఒక ఎకరంలో కంద వేయాలంటే 20పుట్ల కంద అవసరమవుతుంది. ఈ విధంగా ఒక ఎకరానికి రూ.2.40లక్షలు ఖర్చు అవుతుంది. అందువలన రైతులు గత ఏడాది తక్కువ రకం కంద నిల్వ ఉంచుకొని ఆ కందను ఈ ఏడాది పొలాల్లో వేయడానికి ఉపయోగిస్తున్నారు. ఈ రేట్లును బట్టి ఒక ఎకరంలో కొత్తగా కంద కొని వేయాలంటే రైతుకు సాధ్యం కానీ పరిస్థితి ఉంది. ఒక ఎకరం సాగు చేయాలంటే కనీసం రూ.3లక్షల పైనే ఖర్చు అవుతుంది. ఆదాయం కూడా అదే విధంగా వస్తుంది. కంద ఎక్కువగా మే నెలలో వేస్తుంటారు. ఇది 7 నెలల పంట. ఇది నవంబర్, డిసెంబర్ నెలల్లో తవ్వకానికి వస్తుంది. ఎక్కువగా చెన్నై, కలకత్తా, బాంబే ఎగుమతి చేస్తుంటారు. కొనుగోలు దారులు ఆ రాష్ట్రాల నుంచే తొవ్వే కూలీలను కూడా తీసుకొచ్చి కొన్ని నెలలు వారిని ఇక్కడే ఉంచి తవ్విన కందను లారీల్లో లోడ్ చేసుకుని ఆ రాష్ట్రాలకు తరలిస్తూ ఉంటారు. దీనికి తోడు కంద సాగుకు వాతావరణం కూడా అనుకూలించాలి. కంద మంచి ఊట దశలో ఉన్నప్పుడు గాలి, తుఫానులు రాకూడదు. అలా వస్తే కంద ఫైరు విరిగిపోయి దిగుబడి తగ్గిపోతుంది. వాతావరణం అనుకూలిస్తే కంద సాగుతో రైతులు లాభాలు పొందగలుగుతారు.

➡️