రైతులకు నష్టపరిహారం ఇవ్వాలి

Dec 21,2023 02:21

ప్రజాశక్తి – పంగులూరు
ఇటీవల తుఫాను వలన కురిసిన భారీ వర్షాలకు పంటలు నష్టపోయిన రైతులకు నష్టపరిహారం వెంటనే ఇవ్వాలని కౌలు రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు రాయిని వినోద్ బాబు డిమాండ్ చేశారు. పంగులూరు1, చందలూరు సచివాలయాల్లో అధికారులుకు మంగళవారం వినతిపత్రం అందజేశారు. తుఫాన్ కారణంగా రైతులు కోలుకోలేని విధంగా పంటలు నష్టపోయారని అన్నారు. రైతులు ఈ ఇబ్బంది నుంచి బయటపడి మరల వ్యవసాయం చేసుకునేందుకు ప్రభుత్వం వెంటనే పంట నష్టపరిహారాలు ఇవ్వాలని కోరారు. శనగ పంటకు ఎకరాకు రూ.20వేలు, మిర్చి పంటకు రూ.50వేలు, పొగాకు రూ.25వేలు, మినుముకు రూ.20వేలు, మాగానికి రూ.30వేలు, పత్తికి రూ.30వేల చొప్పున నష్టపరిహారం ఇవ్వాలని కోరారు. కౌలు రైతులకు కూడా ఈక్రాప్ చేసి నష్టపరిహారాన్ని అందించాలని కోరారు. సాగు చేసిన కౌలు రైతులకు ఈక్రాప్ చేయకుండా, భూ యజమానులకు అధికారులు ఈక్రాప్ చేస్తున్నారని అన్నారు. కౌలు రైతుల పేరుతో ఈ క్రాప్ చేయమని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ అధికారులు మాత్రం ఆ పని చేయటం లేదని అన్నారు. దీని వలన కౌలు రైతులు నష్టపరిహారం అందుకో లేక పోతున్నారని అన్నారు. తక్షణమే కౌలు సాగు చేసిన వారిని గుర్తించి వారి పేరుతో ఈక్రాప్ చేసి నష్టపరిహారం అదే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో రైతు నాయకులు పెంట్యాల హరిబాబు, పెంట్యాల రవీంద్రబాబు, చిలుకూరి సుబ్బారావు, నాయపాము రోశయ్య, రాజు, వడ్డవల్లి కోటయ్య పాల్గొన్నారు.

➡️