ఎన్నికల్లో గెలిచేది మనమే : కార్యకర్తల ఆత్మీయ సమావేశంలో గొట్టిపాటి రవికుమార్‌

May 26,2024 22:31 ##Addanki #Gottipati

ప్రజాశక్తి – అద్దంకి
కేంద్రంలో, రాష్ట్రంలో ఎన్‌డిఎ కూటమి ప్రభుత్వమేనని అద్దంకి అసెంబ్లీ ఎన్‌డిఎ అభ్యర్థిగా తానే గెలవనున్నట్లు గొట్టిపాటి రవికుమార్ చెప్పారు. స్థానిక నాగులపాడు రోడ్డులోని కామేపల్లి కల్యాణ మండపంలో టిడిపి కార్యకర్తల ఆత్మీయ సమావేశంలో ఆయన ఆదివారం మాట్లాడారు. పట్టణంలో అత్యధిక మెజారిటీతో తాను గెలుస్తానని అన్నారు. తన గెలుపులో సహకరించి ఎన్నికల ప్రచార సమయంలో అన్ని తానై తనను వెంట ఉండి సహకరించిన ప్రతి కార్యకర్తకు పేరు పేరున ధన్యవాదంలు తెలిపారు. గత 5ఏళ్లలో జగన్ ప్రభుత్వంలో టిడిపి నాయకులు, కార్యకర్తలు, ప్రజలు ఆర్థికంగా, సామాజికంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారని అన్నారు. జనసేన అధిపతి పవన్ కల్యాణ్‌ను విశాఖపట్నంలో ప్రజలను కలిసేందుకు వెళ్తే జగన్ ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులు పెట్టిందో అందరికీ తెలిసిందేనని అన్నారు. రాష్ట్రంలో జగన్ చేసిన అరచాకాలు రాష్ట్ర చరిత్రలో మునుపెన్నడూ చూడలేదని అన్నారు. రాష్ట్రంలో ఎన్నికల సమయంలో పోలింగ్ కేంద్రాల్లో జగన్ ఓటమి భయంతో నియోజకవర్గాల్లో ఆయన అనుయాయులు, ఎంఎల్‌ఎ అభ్యర్థులు స్వయంగా మారణాయుధాలతో అరాచకాలు, గొడవులు సృష్టించి టిడిపి వాళ్ళపై చేసిన దాడులు కళ్ళ ముందే చూశామన్నారు. అద్దంకిలో మాత్రం ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగాయని అన్నారు. వచ్చే నెల 4న బాపట్ల ఇంజనీరింగ్ కాలేజీలో ఓట్ల లెక్కింపు జరుగుతుందని తెలిపారు. అదే రోజు ఫలితాలు తెలుస్తాయని అన్నారు. ఆ సమయంలో జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఆ రోజు జరిగే ఓట్ల లెక్కంపుకు వెళ్ళే ఏజెంట్లు పేర్లను సిద్దం చేసుకోవాలని సూచించారు. లెక్కింపు సమయంలో చాలా అప్రమత్తంగా ఉండాలని అన్నారు. దేనికైనా సిద్దంగా ఉండాలని సూచించారు. రాష్ట్రంలో వచ్చే ఎన్‌డిఎ ప్రభుత్వంలో చంద్రబాబు ముఖ్య మంత్రి కావడం ఖాయమని అన్నారు. ఆయన ప్రమాణ స్వీకారానికి మనం సిద్ధంగా ఉండాలని అన్నారు. అనంతరం గ్రామాల వారీగా నాయకులు, కార్యకర్తలు కలిసి మాట్లాడుతూ ఎన్నికల్లో తనకు సహకరించి నందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఆత్మీయ సమావేశంలో టిడిపి జిల్లా ఉపాధ్యక్షులు నాగినేని రామకృష్ణ, పట్టణ, మండల అద్యక్షులు చిన్ని లక్ష్మి శ్రీనివాసరావు, కె నాగేశ్వరరావు, పోతిరెడ్డి శ్రీనివాసరెడ్డి, పట్టణ తెలుగు యువత అద్యక్షులు వి పూర్ణచంద్రరావు, టిడిపి క్లస్టర్ కన్వీనర్ కరి పరమేష్, మానం మురళీ మోహనదాస్, కుందారపు రామారావు, కాకాని అశోక్, అద్దంకి పంచాయతీ టిడిపి కౌన్సిలర్లు, టిడిపి గ్రామాల అద్యక్షులు, సర్పంచ్లు, ఎంపిటిసిలు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

➡️