రైతులకు అండగా ప్రభుత్వం : కలెక్టర్ రంజిత్ భాషా

Mar 7,2024 00:19

రైతులకు రూ.104.73కోట్ల పెట్టుబడి రాయితీ విడుదల
ప్రజాశక్తి – బాపట్ల జిల్లా
మిచాంగ్‌ తుపానుతో నష్టపోయిన రైతులను రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఆదుకుని కొండంత భరోసా ఇచ్చిందని కలెక్టర్ పి రంజిత్ బాషా అన్నారు. తుపానుతో పంటలు దెబ్బతిన్న రైతులకు నష్టపరిహారాన్ని తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం నుంచి సిఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వర్చువల్ విధానంలో బుధవారం బటన్ నొక్కి ప్రారంభించారు. జిల్లాలో నష్టపోయిన రైతులకు రూ.104.73కోట్ల పెట్టుబడి రాయితీ నగదును ప్రజా ప్రతినిధులతో కలిసి కలెక్టర్ చెక్కు రూపంలో పంపిణీ చేశారు. జిల్లాలోని 64,634.08 హెక్టార్లలో వ్యవసాయ, ఉద్యాన పంటలు తుపాను ప్రభావంతో దెబ్బతిన్నాయని అన్నారు. విపత్తుతో పంట దిగుబడులు తగ్గిపోయాయని అన్నారు. 93,471మంది రైతులకు నష్టం వాటిల్లినట్లు తెలిపారు. పరిహారాన్ని రైతుల ఖాతాలకు నేరుగా జమ చేసినట్లు తెలిపారు. ప్రభుత్వం నిర్ణయంతో కౌలు రైతులకు మేలు జరిగిందని రైతు మోషే తన అనుభూతిని పంచుకున్నారు. 1.20ఎకరాల్లో ధాన్యం సాగు చేయగా తుపానుతో తడిచిపోయిందని వివరించారు. తడిసిన ధాన్యం ప్రభుత్వం కొనుగోలు చేసినట్లు చెప్పారు. మిల్లులో ధాన్యం అమ్మిన 13రోజులకే డబ్బులు వచ్చాయని ఆనందం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఎంపి నందిగం సురేష్, ఎంఎల్‌ఎ కోన రఘుపతి, చీరాల తాజా మాజీ ఎంఎల్‌ఎ కరణం బలరామకృష్ణమూర్తి, వైసిపి వేమూరు ఇన్‌ఛార్జి వరికూటి అశోక్ బాబు, వ్యవసాయ శాఖ జిల్లా అధికారి రామకృష్ణ, డిడి విజయనిర్మల, ఉద్యానవన శాఖ ఎడి జెన్నమ్మ, ఎపీఎంఐపి పిడి వెంకటరమణ, నాయకులు ప్రసాదరావు పాల్గొన్నారు.

➡️