భార్య దగ్గరకు వెళుతూ భర్త మృతి

May 18,2024 10:49 #Bapatla District
  • రోడ్డు ప్రమాదం
  • మార్టూరు వద్ద జరిగిన ఘటన
  • బైటమంజులూరు వాసిగా గుర్తింపు

ప్రజాశక్తి – మార్టూరు రూరల్ : భార్య కుమారుడిని చూడటానికి బైక్ పై వెళుతుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొన్న ప్రమాదంలో యువకుడు దుర్మరణం చెందిన ఘటన మార్టూరు సమీపంలోని రాజుపాలెం పోలీస్ చెక్ పోస్ట్ వద్ద శుక్రవారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. అర్బన్ సీఐ ఎస్వీ రాజశేఖరరెడ్డి కధనం ప్రకారం… జె పంగులూరు మండలం బైటమంజులూరు ఎస్సి కాలనీకి చెందిన తాళ్లూరి వెంకయ్య ప్రైవేట్ కంపెనీ లో డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. ఇటీవల డెలివరీ అయిన తన భార్య,కుమారుడిని చూడటానికి బైక్ పై మార్టూరు మీదుగా అత్తగారి ఊరు రాజుపాలెం వెళుతున్నాడు. ఈ క్రమంలో హై వే నుండి సర్వీస్ రోడ్డులోకి తిరిగే క్రమంలో వెనుక నుండి అతివేగంగా వస్తున్న గుర్తు తెలియని వాహనం వెంకయ్య ను బలంగా డీ కొట్టింది. ప్రమాద తీవ్రతకు గాల్లోకి ఎగిరి హై వే నుండి సర్వీస్ రోడ్డులో క్రింద పడిన వెంకయ్య తలకి బలమైన గాయాలు తగలడంతో అక్కడే కుప్పకూలిపోయాడు. కొద్దీ సేపటికి అటుగా వెళుతున్న వాహనదారులు రోడ్డుపై రక్తపు మడుగులో పడి ఉన్న వెంకయ్యను గమనించి ముందుగా మార్టూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ప్రమాద దృశ్యాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. తీవ్రంగా గాయపడిన వెంకాయకు స్థానిక వైద్యులు ప్రధమ చికిత్స అందించి మెరుగైన వైద్యం కోసం గుంటూరు సర్వజన సమగ్ర వైద్యశాలకు రిఫర్ చేసి 108 వాహనంలో తరలించారు. క్షతగాత్రుడి పరిస్థితి విషమంగా ఉండటంతో బంధువులు చిలకలూరిపేట లోని ప్రైవేట్ వైద్యశాలకు తరలించారు. అక్కడి వైద్యులు పరిస్థితి గమనించి వెంటనే హాస్పిటల్ కి చెందిన ప్రైవేట్ అంబులెన్సు లో గుంటూరు తరలిస్తుండగా మార్గమధ్యలో పరిస్థితి విషమించి వెంకయ్య మృతి చెందాడు. గమనించిన అంబులెన్సు సిబ్బంది మృతుడిని తిరిగి మార్టూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు బైక్ ని ఢీకొట్టిన వాహనం కోసం గాలింపు చర్యలు చేపట్టారు. మృతదేహానికి పోస్ట్ మార్ట్ నిర్వహించి బంధువులకు అప్పగించినట్లు సిఐ తెలిపారు.

  • మిన్నంటిన రోదనలు

భార్య,కుమారుడిని చూడటానికి వెళుతూ రోడ్డు ప్రమాదంలో తాళ్లూరి వెంకయ్య మృతిచెందడంతో బైటమంజులూరు,రాజుపాలెం,మార్టూరు ఎస్సి కాలనీల నుండి బంధువులు పెద్ద సంఖ్యలో మార్టూరు ప్రభుత్వ వైద్యశాలకు చేరుకొని విలపించిన తీరు పలువురిని కలిచివేసింది. పుట్టిన కుమారుడిని చూడకుండానే రోడ్డు ప్రమాదంలో వెంకయ్య ఆకస్మికంగా మృతి చెందటంతో అయన భార్య విలపిస్తున్న తీరుతో బంధువుల రోదనలు మిన్నంటాయి.

➡️