అక్రమ పట్టాలు రద్దు చేయాలి

Feb 10,2024 23:47

ప్రజాశక్తి – వేటపాలెం
సిలోన్ కాలనీ స్థలాలకు పెద్ద మొత్తంలో డబ్బులు పుచ్చుకొని అక్రమంగా పట్టాలిచ్చిన రిటైర్డ్ తహశీల్దారు అశోక్ వర్ధన్‌పై చర్య తీసుకోవాలని, విషయం అంతా తెలిసి పలుమార్లు సిలోన్ కాలనీవాసులు ఎమ్మెల్యే బలరామకృష్ణమూర్తి, ఇన్చార్జి వెంకటేష్‌కు విన్నవించుకున్నప్పటికీ పరిష్కారం చేయలేదని సిలోన్‌ కాలనీ గౌరవాధ్యక్షులు పి కొండయ్య ఆరోపించారు. వేటపాలెంలో జరిగిన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. కాలనీలో 27మంది అక్రమంగా ఉంటున్నారని వారికే పట్టాలిచ్చారని అన్నారు. ఉంటే అవి రద్దవుతాయిలే ఇప్పుడేమైందని బుకాయించడం వీరి పని పద్ధతికి నిదర్శనంగా అన్నారు. కాలనీలో ఉన్న 27మందికి గతంలోనే పట్టాలిచ్చి ప్రభుత్వం ఇల్లు కట్టించారని, గత తహశీల్దారు లింగమహేశ్వరరావు కాలంలో పోలీసులతో కాలనీ నుండి తొలగించడానికి పూనుకున్నప్పుడు ఖాళీ చేయడానికి ఎవరి అడిగి కోర్టులో చేర్చారని, అప్పుడు నుండి వివాదం కోర్టులో ఉందని తెలిసి వారికి పేర్లు మార్చి పట్టాలివ్వడం నాటకీయమైన చర్యని అన్నారు. ప్రజాప్రతినిధులే మోసానికి పూనుకోవడం దురదృష్టకరమని అన్నారు. ఇప్పుడు ఇన్చార్జిగా ఉండి రేపు శాసనసభకు పోటీ చేయబోయే వెంకటేష్ ఇలా మోసం చేయడం తగునాని ప్రశ్నించారు. అక్రమ పట్టాలు రద్దుచేసి చట్టాన్ని, కోర్టుని గౌరవించాలని డిమాండ్ చేశారు. రిటైర్ అవడానికి కొద్ది రోజులు ముందు తర్వాత పెద్ద మొత్తంలో లంచాలు తీసుకుని ఇచ్చిన పట్టాలన్నింటిపై విచారణ చేయాలని కోరారు. న్యాయంగా ఇవ్వాల్సిన పట్టాలు ఇవ్వకుండా, చట్టవిరుద్ధంగా డబ్బులకు కక్కుర్తి పడి ఇచ్చిన పట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. లేకుంటే పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తామని హెచ్చరించారు. న్యాయం కోసం ఆందోళన చేస్తామంటే కేసులు పెడతానని, అరెస్టులు చేయిస్తామని కొందరు వైసీపీ నాయకులు బెదిరించడం విచారకరం అన్నారు. ఈ స్థలాల సమస్యపైనే వెంకటేష్‌తో చర్చిస్తూ కాలనీకి చెందిన నాయకురాలు సువర్ణమాల ఆయన ముందే కుప్పకూలి చనిపోయారని గుర్తు చేశారు. కనీసం ఆ విషయమైనా ఆయనకి గుర్తు రాలేదని ప్రశ్నించారు. సమావేశంలో సత్తి వేలు, వినోదు, శివనాడియన్, కర్ణ, ఫిలిప్పు పాల్గొన్నారు.

➡️