జగన్‌రెడ్డి ఇసుక దందా కలెక్టర్ల కళ్లకు కనిపించ లేదా?

Feb 24,2024 23:35

– కేంద్ర పర్యావరణ శాఖ నివేదికపై ఏం సమాధానం చెబుతారు?
– ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్
ప్రజాశక్తి – అద్దంకి
జగన్‌రెడ్డి ఇసుక దందా కలెక్టర్ల కళ్లకు కనిపించడం లేదా? కేంద్ర పర్యావరణ శాఖ నివేదికపై సిఎం వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి ఏమి సమాధానం చెబుతారని ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ అధికారులను ప్రశ్నించారు. కేంద్ర పర్యావరణ శాఖ ఎన్టీటీకి కన్పించిన ఇసుక దోపిడీ రాష్ట్రంలోని కలెక్టర్లకు కన్పించకపోవడం బాధాకరమని అన్నారు. ఇసుక తవ్వకాల్లో పెద్ద ఎత్తున ఉల్లంఘనలు జరుగుతున్నాయని, రాష్ట్ర స్థాయి పర్యావరణ ప్రభావ మదింపు సంస్థ (సియా) గత ఏడాది ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు ఇసుక తవ్వకాలకు కొత్తగా పర్యావరణ అనుమతులు (ఈసీ) జారీ చేయలేదని స్పష్టం చేసినా వైసిపి ఇసుక బకాసురులు అడ్డగోలుగా అక్రమ రవాణా చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. భారీ యంత్రాలతో 24 గంటలూ తవ్వేస్తూ ఒక్కో రీచ్ నుంచి వెయ్యి నుంచి 2వేల టన్నుల ఇసుక తరలిస్తున్నారని అన్నారు. చేతిరాతతో వేబిల్లులు ఇస్తున్నారని తెలిపారు. కంప్యూటరైజ్డ్ బిల్లులు లేవని అన్నారు. సీసీ కెమెరాలు లేవని తెలిపారు. రాష్ట్రంలో రీచ్‌ల వివరాలు అడిగితే గనుల శాఖ, రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వలేదని మండిపడ్డారు. వాగులు, వంకలు, నదుల్లో ఇసుక అక్రమ రవాణా యథేచ్ఛగా సాగుతున్నా అధికారులు మాత్రం చూసీ చూడనట్లు వ్యవహరించడం దుర్మార్గమని పేర్కొన్నారు. సాంకేతిక సాయంతో ఎక్కడ ఎన్ని మీటర్లు మేర ఇసుక తవ్వకాలు చేపడుతున్నారనే విషయం తెలిసిపోతుందని అన్నారు. ఇసుక అక్రమాల్లో దోచుకున్న సొమ్ముతో వచ్చే ఎన్నికల్లో గెలవాలని జగన్మోహన్ రెడ్డి కుట్రలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. జగన్ అవినీతికి సహకరిస్తున్న వారిపై కూడా తాము తప్పకుండా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నూతన ఇసుక విధానం తీసుకొస్తామని చెప్పిన జగన్ ఆరు నెలల పాటు ఇసుక రవాణా నిలిపివేయడంతో దాదాపు 130మంది భవన నిర్మాణ కార్మికులు బలైపోయారని అన్నారు. వైసీపీ ఇసుక దోపిడీ కారణంగా అన్నమయ్య డ్యామ్ కొట్టుకుపోయి 45మంది జలసమాధి అయ్యారని తెలిపారు. ఇసుక అక్రమ రవాణాను ప్రశ్నించిన వరప్రసాద్‌కు శిరోముండనం చేశారని గుర్తు చేశారు. ఈనాడు విలేకరి పరమేశ్వరరావుపై వైసీపీ గుండాలు దాడి చేసి గాయపరిచారని అన్నారు. గుండ్లకమ్మ ప్రాజెక్టు పరివాహక గ్రామాలైన తమ్మవరం, మణికేశ్వరం, అనమనమూరు గ్రామాల్లో స్థానిక వైసిపి నేతలు ఇష్టారీతిన పగటిపూటే యధేచ్ఛగా ఇసుక తరలిస్తున్నా అధికారులకు కనిపించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తిమ్మాయపాలెం వంతెన పిల్లర్ల సమీపంలో ఇసుకను తోడేస్తుండటంతో దాదాపుగా నాలుగు దశాబ్దాల కాలం నాటి వంతెన కూలిపోయే ప్రమాదం ఉందన్నారు. అధికారులు వారి విధులు, బాధ్యతను విస్మరించడం తగదని హితవు పలికారు. గతంలో అధికార పార్టీ నేతల అవినీతికి బాసటగా నిలిచిన అనేక మంది అధికారులు నేడు జైలుకు వెళ్లారని అన్నారు. రాబోయే రోజుల్లో జగన్ అవినీతికి సహకరించిన ప్రతి అధికారి జైలుకు పోవడం ఖాయమని అన్నారు. వైసీపీ అవినీతి, అరాచక పాలనను సాగనంపేందుకు టీడీపీ కార్యకర్తలతో పాటు ప్రజలు ఎదురు చూస్తున్నారని అన్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేన ప్రభుత్వం అధికారంలోకి రావడం ఖాయమని తెలిపారు.

➡️