బడ్జెట్ పట్ల జగన్‌రెడ్డి ప్రభుత్వం నిర్లక్ష్యం : ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ ఆరోపణ

Feb 8,2024 23:05

ప్రజాశక్తి – అద్దంకి
జగన్‌రెడ్డి సర్కార్ అసెంబ్లీ, కౌన్సిల్లో బడ్డెట్ ప్రవేశపెట్టిందని, బడ్జెట్ ప్రవేశపెట్టే ముందు సభలో చెప్పిన సూక్తుల్లో ఎన్నిపాటిస్తున్నాడో గుండెలపై చేయి వేసుకొని ముఖ్యమంత్రే ఆలోచించుకోవాలని ఎంఎల్‌ఎ గొట్టిపాటి రవికుమార్‌ అన్నారు. అన్నిరంగాల్లో రాష్ట్రం పురోగమిస్తోందని ప్రభుత్వం చెప్పుకోవడం సిగ్గుచేటని అన్నారు. వ్యవసాయ రంగం మేలుకోసం, రైతాంగం సంతోషం కోసం ఏం చేయబోతున్నారో బడ్జెట్లో ప్రభుత్వం పేర్కొనకపోవడం బాధాకరమని పేర్కొన్నారు. బుగ్గన బడ్జెట్ అంచనాలు కొండంత, ఖర్చులు పీసరంత ఉన్నట్లు తెలిపారు. రూ.13వేల కోట్ల రెవెన్యూ లోటును రూ.44వేల కోట్లకు, రూ.35వేల కోట్ల ద్రవ్యలోటును రూ.60వేల కోట్లకు పెంచిన ఘనత బుగ్గనదేనని అన్నారు. పన్నుల బాదుడు తప్ప బడ్జెట్లో కొత్త అంశాలు ఏమీ లేవని అన్నారు. ప్రస్తుతం ఏపీ అప్పులు రూ.11.58లక్షల కోట్లకు చేరిందని అన్నారు. మద్యం బాండ్లపై రూ.16వేల కోట్లు, కార్పొరేషన్ హామీలతో రూ.1,10,603కోట్లు తెచ్చారని అన్నారు. వైసిపి హయాంలో రెట్టింపైన ఎపీ అప్పులు 2019లో టీడీపీ తీసుకున్న దానికంటే 4రెట్ల అప్పు తెచ్చారని అన్నారు. వైసీపీ తీసుకొచ్చిన ప్రతీ స్కీము ఓ స్కామ్ గా మారిందని అన్నారు. వైసీపీ హయాంలో ధరలు, పన్నులు మోతమోగిస్తున్నాయని అన్నారు. రిజిస్ట్రేషన్ ఛార్జీలు భారీగా పెంచిందని అన్నారు. విద్యుత్ ఛార్జీలను 8 సార్లు వడ్డనలో ఎక్కడా రాజీపడని జగన్‌ పేదలపై బాదుడే బాదుడు దిగ్విజయంగా కొనసాగిస్తూ పిప్పి చేస్తున్నాడని అన్నారు. వ్యవసాయ రంగాన్ని ప్రభుత్వం నిజంగా బలోపేతం చేస్తే, ఆహార ధాన్యాలు, అపరాల సాగు విస్తీర్ణంలో దేశంలో రాష్ట్రం ఎందుకు వెనుకంజలో ఉందిని ప్రశ్నించారు. సాగు విస్తీర్ణం ఎందుకు తగ్గిపోయిందో చెప్పాలని అన్నారు. రైతు ఆత్మహత్యల్లో ముందు వరసలో ఎందుకు ఉందో జగన్‌రెడ్డి నోరు విప్పాలని అన్నారు. గతంలో విశాఖపట్నానికి ఒక విమానాశ్రయం ఉంటే, భోగాపురంలో మరో విమానాశ్రయం ఎందుకు అన్న వ్యక్తి ముఖ్యమంత్రి అయ్యాక భోగాపురం విమానాశ్రయ నిర్మాణ పనులు ప్రారంభించి గొప్పలు చెప్పుకున్నాడని అన్నారు. చంద్రబాబు హయాంలో ప్రారంభించిన అనేక ప్రాజెక్టుల్ని జగన్‌రెడ్డి మరలా ప్రారంభించాడే తప్ప కొత్తగా తాను తీసుకొచ్చింది ఏమీ లేవని ధ్వజమెత్తారు.

➡️