జగనన్న కాలనీ రహదారులు నీటమనక

Feb 2,2024 22:54

ప్రజాశక్తి – భట్టిప్రోలు
ప్రభుత్వం పేదలకు కేటాయించాలని స్థలాల్లో మౌలిక వసతులు లేక గృహ నిర్మాణాలు చేపట్టడమే కష్టంగా మారింది. ప్రస్తుత తరుణంలో రూ.లక్షలు వెచ్చించి ఏర్పాటు చేసిన పైప్ లైన్‌ లీకులు కావడంతో రహదారిలు నీట మునిగాయి. వర్షాకాలన్ని తలపిస్తున్నాయి. మండలంలో అతిపెద్ద లేఔట్‌ అయిన భట్టిప్రోలు జగనన్న కాలనీలోని పైపులైను అస్తవ్యస్తం అయ్యింది. దీంతో ఎక్కడికి అక్కడ పైపులు పగిలిపోయాయి. నీళ్లు వృధాగా పోతున్నాయి. ఆ నీటితో రహదారులు నిండి రాకపోకలకు ఇబ్బందిగా మారింది. దీంతో ఇప్పుడిప్పుడే గృహ నిర్మాణాలు చేపడుతున్న లబ్ధిదారులకు మెటీరియల్ తరలించుకునేందుకు రహదారిపైకి నీళ్లు రావడంతో దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. నిన్న మొన్నటి వరకు వర్షాకాలం కావడంతో రహదారులు అనుకూలంగా లేక పనులు చేసుకోలేదు. ప్రస్తుతం ఎండిపోయి వాహనాల రాకపోకలకు అనుకూలంగా ఉన్న తరుణంలో రోడ్డుపై నీళ్లు చేరి ఇబ్బందికరంగా మారింది. నాసిరకం పైపులైన్లు నిరంతరం లీక్ అవుతున్నాయని లబ్ధిదారులు వాపోతున్నారు. వెయ్యి మందికి పైగా లబ్ధిదారులున్న కాలనీలో మౌలిక వసతులు లేకపోవడం, దీనిలో కూడా ప్రధానమైన రహదారులు కూడా సిద్ధం చేయకపోవడంతో గత మూడేళ్లుగా నానా అవస్థలు పడుతున్నారు. గృహ నిర్మాణానికి అవసరమైన మెటీరియల్ తరలించుకున్నందుకు రహదారులు అనుకూలంగా లేకపోయినప్పటికీ అధికారులు మాత్రం పదేపదే నిర్మాణాలు చేపట్టాలని లబ్ధిదారులపై ఒత్తిడి చేస్తున్నట్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
కాలనీ చివరి వరకు అందని నీరు
ఇదిలా ఉండగా కాలనీలో పూర్తిస్థాయిలో పైపులై నిర్మాణం చేపట్టలేదు. అదీకాక లబ్ధిదారులందరికీ గృహ నిర్మాణాలకు అవసరమైన నీరు అందటం లేదని వాపోతున్నారు. ప్రధాన రహదారుల్లో ఏర్పాటు చేసిన పైపులైన్ కూడా పగిలిపోతుండటంతో చివరి వరకు నీరు చేరక గృహ నిర్మాణాలకు ఇబ్బందికరంగా మారిందని వాపోతున్నారు. ఈపాటికే మండల పరిషత్ నిధులు వినియోగించి ఏర్పాటు చేసిన పైపులైను లీక్ అవుతుంది. ఆర్డబ్ల్యూఎస్ అధికారులు కానీ, మండల పరిషత్తు, పంచాయతీ అధికారులు పట్టించుకోవటం లేదని లబ్దిదారులు ఆరోపిస్తున్నారు. కేటాయించిన నిధులతో జరిగిన పనుల్లో నాణ్యత లోపాన్ని పరిశీలించాల్సిన అధికారులు, ఎంపీడీఒ సైతం పట్టీ పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహ వ్యక్తం చేస్తున్నారు. కాలనీలో గృహ నిర్మాణాలు పూర్తిస్థాయిలో చేపట్టకపోవడంతో రైతులు పశువులను మేపుకోవటం వలన నాసిరకంగా ఉన్న పైపులు పగిలిపోతున్నాయని లబ్ధిదారులు వ్యాఖ్యానిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు చొరవ చూపి గృహ నిర్మాణాలు చేపట్టేందుకు అవసరమైన నీరు సక్రమంగా ఇచ్చే విధంగా చూడాలని, కాలనీలో ప్రధాన రహదారికి తగిన చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.

➡️