ఆడుదాం ఆంధ్ర యువతకు ప్రోత్సాహం

Dec 25,2023 23:56

ప్రజాశక్తి – అద్దంకి
‘ఆడుదాం ఆంధ్ర’ క్రీడా మహోత్సవాన్ని పండుగలా జరుపుకోవాలని వైసిపి ఇన్చార్జ్ పానెం హనిమిరెడ్డి అన్నారు. స్థానిక బంగ్లాలో ఆయన విలేకరులతో మాట్లాడారు. దేశంలో ఏ రాష్ట్రంలోనూ జరగని పెద్ద క్రీడా పండుగను సిఎం జగన్మోహన్‌రెడ్డి గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు క్రీడలను ప్రోత్సహించే బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టారని కొనియాడారు. నేటి నుండి ఫిబ్రవరి 10వరకు వివిధ దశల్లో క్రీడలు జరుగుతాయని అన్నారు. అనేక రుగ్మతలకు లోనై అనారోగ్యానికి గురవుతున్న యువత క్రీడల ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని అన్నారు. జాతీయస్థాయిలో ఆంధ్రప్రదేశ్ నుంచి క్రీడల్లో రాణించేలా క్రీడాకారులకు ప్రోత్సాహం తోడవుతుందని అన్నారు. ఈనెల 27నుండి జనవరి 2వరకు సచివాలయ స్థాయిలో, జనవరి 10నుండి 23వరకు మండల స్థాయిలో, జనవరి 24నుండి 31వరకు నియోజకవర్గ స్థాయిలో, జనవరి 31నుండి ఫిబ్రవరి 5వరకు జిల్లా స్థాయిలో, ఫిబ్రవరి 6నుండి 10వరకు రాష్ట్ర స్థాయిలో క్రీడలు జరుగుతాయని అన్నారు. యువతీ, యువకులతో పాటు తల్లి, దండ్రులు పిల్లలను క్రీడల్లో పాల్గొనేలా ప్రోత్సహించాలని కోరారు. 27న కబాడీ, 28న వాలీబాల్, 29న ఖోఖో, 30న బ్యాడ్మింటన్, జనవరి 2క్రికెట్ పోటీలు జరుగుతాయని అన్నారు. మండలంలో 6374మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో కోట శ్రీనివాసకుమార్, ప్రభాకరరెడ్డి, రాఘవరెడ్డి, చిన్ని శ్రీమన్నారాయణ, బివి కృష్ణారెడ్డి పాల్గొన్నారు.

➡️