వాడివేడిగా మండల సర్వసభ్య సమావేశం

Mar 7,2024 00:32

ప్రజాశక్తి – భట్టిప్రోలు
మండల పరిషత్తు సర్వసభ్య సమావేశం ఎంపీపీ డివి లలిత కుమారి అధ్యక్షతన గురువారం వాడివేడిగా జరిగింది. ప్రతిపక్ష ఎంపీటీసీలు ఏ ఒక్కరు ఏ అంశాలపై ప్రస్తావించే దాఖలాలు లేవు. ఎప్పుడు సమావేశం జరిగిన అధికార పార్టీలో ఉన్న ఎంపీటీసీలే వివిధ రకాల సమస్యలను లేవనెత్తుతూ అధికారులను ఉక్కిరిబిక్కిరి చేస్తూ ఉంటారు. దీనిలో భాగంగా బుధవారం జరిగిన సమావేశంలో కో ఆప్షన్ సభ్యులు షేక్ సలీం వివిధ అంశాలు ప్రస్తావించారు. పాలకవర్గ సభ్యులకు ఎలాంటి సమాచారం లేకుండానే ఎంపీపీ, ఎంపీడీఒ అభివృద్ధి పనులకు నిధులు వెచ్చిస్తూ వాటిని స్వాహా చేస్తున్నారని ఆరోపించారు. ఇటీవల విడుదలైన 15వ ఆర్థిక సంఘం నిధులను ఎలాంటి బోర్డు తీర్మానం లేకుండా రూ.14 లక్షలతో రంగుల పేరుతో దోచకున్నారని ఆరోపించారు. సమావేశం ఏర్పాటు చేసే సమయంలో ముందుగా సభ్యులకు అందజేసే ఎజెండా కాఫీలో ఒకటి, రెండు అంశాలు మాత్రమే ఉంటున్నాయని, తదనంతరం సమావేశం పూర్తికాగానే దానిలో మరో 10నుండి 15అంశాలను తీర్మానం చేసినట్లుగా రాసుకుని సభ్యుల ఆమోదం లేకుండానే పనులు చేసుకుంటున్నారని ఆగ్రహ వ్యక్తం చేశారు. ఎలాంటి సమాచారం లేకుండా ఎంపీపీ స్వగ్రామమైన పెదపులివర్రు గ్రామానికి రూ.30లక్షలు వెచ్చించారని అన్నారు. వీటిపై సంబంధిత అధికారులు జవాబు చెప్పాలని పట్టుబట్టారు. దీంతో స్పందించిన ఎంపీపీ మాట్లాడుతూ మంత్రి నాగార్జున ఆదేశాల మేరకు కార్యాలయానికి రంగులు వేసి అభివృద్ధి చేపట్టామని తెలిపారు. పెదపులివర్రు గ్రామంలో కూడా ఆయన దేశాల మేరకే అభివృద్ధి పనులు చేపట్టినట్లు తెలిపారు. అయితే మంత్రి చెప్పినట్లుగానే చేసుకోండి. సభ్యులతో పనేముందని, మండల పరిషత్ బోర్డు రద్దు చేసుకుని ఆయన చెప్పినట్లే నడవండి అంటూ సలీంతో పాటు మరికొందరు సభ్యులు ఆగ్రహ వ్యక్తం చేశారు. మంత్రి చెప్పినప్పటికీ సభ్యులకు తెలియపరచాల్సిన బాధ్యత లేదాని ప్రశ్నించారు. పల్లికోన ఎంపీటీసీ దున్న తిరుపతి బాబు మాట్లాడుతూ తమ గ్రామంలో మండల పరిషత్తు ద్వారా రెండు పంపులు ఏర్పాటు చేయాలని గతంలో కోరగా నిధులు లేవని ఒక పంపు మాత్రమే ఏర్పాటు చేపిస్తామని చెప్పిన అధికారులు, ఎంపీపీ ఎవరికి తెలియకుండా రూ.14లక్షలు కార్యాలయానికి ఏ విధంగా ఖర్చు చేశారని ప్రశ్నించారు. దీంతో సభ్యులు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేక ఎంపీపీ, ఎంపీడీఒ సమావేశాన్ని అర్ధాంతరంగా ముగించి వెళ్ళిపోయారు. దీంతో సమావేశం రసా బసగా సాగింది. కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షులు కె పిచ్చయ్య శాస్త్రి, మల్లులు ఉషారాణి, ఏఒ జలజ, ఎంపీటీసీలు, సర్పంచులు, వివిధ శాఖల అధికారులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.

➡️