పెరల్స్‌ బాధితుల ఎదురు చూపులు

Apr 2,2024 01:12 ##perls #India #Victims

– 15ఏళ్ల క్రితం పెరల్స్‌ఓ పొదుపు చేసుకున్న బాధితులు
– కట్టిన డబ్బు కోసం ఎదురుచూపులు
– ఏజెంట్ల మాటలు విని మోసపోయిన ఖాతాదారులు
– పెరల్స్‌ బాధితులను పట్టించుకోని ప్రభుత్వాలు
ప్రజాశక్తి – ఇంకొల్లు
దాదాపు 15ఏళ్ల క్రితం పెరల్స్ ఆగ్రోటెక్ కంపెనీ నిర్వాహకులు, ఆ కంపెనీ ఉద్యోగులు, ఏజెంట్లు చెప్పిన మాయమాటలు నమ్మి చమటోడ్చి కష్టపడి సంపాదించుకున్న డబ్బు ఆ కంపెనీలో పొదుపు చేసుకున్నారు. రెట్టింపు వస్తాయని ఆశపడ్డారు. పొదుపు గడువు పూర్తయ్యి తిరిగి తీసుకునే సమయం వచ్చింది. ఆశపడ్డ ఖాతాదారులు ఒకేసారి రూ.వేల నుంచి రూ.లక్షలు చెల్లించారు. కానీ కట్టించుకున్న సంస్థ చేతులెత్తేయడంతో పూర్తిగా నష్టపోయారు. అది తెలుసుకొని చేరుకునే లోపే ఆ సంస్థపై సెబీ ఆధ్వర్యంలో కేసులు వేశారు. సెక్యూరిటీస్ అండ్ ఎక్సైజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో రూ.49వేల కోట్లకు సంబంధించి తిరిగి ఖాతాదారులకు చెల్లించే విధంగా 2016లో రిటైర్డ్ జడ్జి జస్టిస్ ఆరంలోద ఆధ్వర్యంలో ఓ కమిటీని ఏర్పాటు చేశారు. పిఎసిఎల్‌కు సంబంధించిన ఖాతాదారులకు డబ్బు చెల్లించే విధంగా నిర్ణయించారు. ఇందుకు సంబంధించి దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో 196జిల్లాల్లో పెరల్స్‌కు సంబంధించిన ఆస్తుల అమ్మకం ప్రక్రియ ఆ కమిటీ ఆధ్వర్యంలో వేలం నిర్వహించి డబ్బులు రాబట్టి ఖాతాదారులకు పూర్తిగా డబ్బులు చెల్లిస్తామని అప్పట్లో చెప్పారు. నిర్వహణ పూర్తయ్యే వరకు తాతాదారులు సంబంధిత డాక్యుమెంట్లు ఎవరికి ఇవ్వకుండా భద్రంగా ఉంచుకొని లోద్రా కమిటీ, సెబి అడిగినప్పుడు, బాండ్లు డిపాజిట్లు వివిధ రకాల పత్రాలు సమర్పించాలని తెలిపారు. ఎనిమిదేళ్లయినా ఇప్పటికీ ఏం జరుగుతుందో ఖాతాదారులకు తెలియని పరిస్థితి. ఈ వ్యవహారం అంతా జరిగి ఇప్పటికి దాదాపు 9ఏళ్లయ్యింది. ఖాతాదారులకు తమ డిపాజిట్ల సొమ్ముకు సంబంధించి ఎక్కడ, ఏమి జరుగుతుందో, ఎప్పుడు వస్తాయో తెలియక దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. ఎప్పుడు, ఎక్కడ, ఎవరిని కలవాలనేది కూడా తెలియక తికమక పడుతున్నారు. అప్పట్లో డబ్బులు కట్టించుకున్న ఏజెంట్లు ఇప్పుడు దీని వివరాలు చెప్పే పరిస్థితి కానీ, ఖాతాదారులతో మాట్లాడే పరిస్థితి కానీ లేదని అంటున్నారు.
ఏజెంట్లకు లబ్ధి, డబ్బు చెల్లించిన ఖాతాదారులు డబ్బులు వస్తాయో, రావో తెలియని అయోమయో పరిస్థితిలో ఉన్నారు. అప్పట్లో డిపాజిట్లు సేకరించిన ఏజెంట్లు మాత్రం కంపెనీ నుంచి భారీగానే కమిషన్లు పొందారు. అత్యధికంగా డిపాజిట్లు చేయించిన ఏజెంట్లు తులాభారం సైతం తూగారు. ఇప్పుడు మాత్రం ఈ ఖాతాదారులకు సంబంధించిన సమాచారం ఇచ్చే పరిస్థితి లేదు.
ఖాతాదారులు కొంత మంది మరణం
కూలీ, నాలి చేసుకొని, చమటోడ్చి పని చేసే సామాన్య సన్నా, చిన్న రైతు కుటుంబాలు ఎక్కువగా రెండు తెలుగు రాష్ట్రాల్లో పెరల్స్‌లో డిపాజిట్లు పొదుపు చేసుకున్నారు. డిపాజిట్ చేసిన వారిలో కొంతమంది వయోభారంతో, అనారోగ్యంతో మరణించారు. డిపాజిట్లు కట్టించుకున్న ఏజెంట్లు ప్రస్తుతం గతంలో వారు ఉన్న నివాస ప్రాంతాలను మార్చి వేరే ప్రాంతాల్లో నివసిస్తున్నారు.
పెరల్స్ ఖాతాదారుల బాధలు పట్టని ప్రభుత్వాలు
దేశంలోని వివిధ రాష్ట్రాల్లో రూ.50వేల కోట్లు చెల్లించిన ఖాతాదారుల బాధలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు పట్టినట్లు లేదు. ప్రభుత్వపరంగా వారి మీద చర్యలు తీసుకొని ఖాతాదారులకు న్యాయం చేసేవిధంగా ప్రయత్నాలు చేసిన దాఖలాలు లేవు. దశాబ్దాలు గడిచిన విషయం లోద్రా కమిటీ ఆధ్వర్యంలో ఉందన్న భావనలోనే ఉన్నారు. కనీసం ఆ కమిటీ లోనైనా ఏమి జరుగుతుందో, న్యాయం జరుగుతుందా లేదాని బాధ్యతగా తెలిపే ప్రయత్నాలు లేవు.
రూ.2.50లక్షలు చెల్లించాను
తూమాటి వెంకటేశ్వర్లు, ఇంకొల్లు.
నాకు ఒక ఎకరం సొంత పొలం ఉంది. కౌలు వ్యవసాయం కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లాను. అక్కడ వ్యవసాయం నష్టాలతో తిరిగి స్వగ్రామమైన ఇంకొల్లు చేరుకొని మళ్లీ కొద్దిపాటి వ్యవసాయం చేసుకుంటూ భార్య సైతం కూలి పనులకు వెళుతూ కాలం గడుపుతున్నామని తెలిపారు. మా బంధువైన నాయుడు వెంకటేశ్వర్లుకు 15ఏళ్ల క్రితం ఒకేసారి రూ.2.50లక్షలు పెరల్స్‌లో డిపాజిట్ చేశాను. ఏడేళ్లలో కట్టిన సొమ్ముకు రెట్టింపు వస్తుందని చెప్పిన మాటలు విని మోసపోయాను. ఇప్పటికీ 15ఏళ్ళు అయ్యింది. ఒక్క రూపాయి తిరిగి రాలేదు. ఆయనను అడిగితే తన ఆరోగ్యం బాగాలేదు, ఎప్పుడు వస్తాయో తనకు మాత్రం ఏం తెలుసని తప్పించుకున్నాడు. ఆయనకు వయసు మీరింది. గతంలో జగనన్న అగ్రిగోల్డ్ డబ్బులతో పాటు పెరల్స్ డబ్బులు కూడా ఇప్పిస్తాడని చెప్పాడు. అధికారంలోకి వచ్చినాక ఆ దిశగా ప్రయత్నం చర్య తీసుకోలేదు.


ఎం నాగలక్ష్మి, ఇంకొల్లు.
నేను వ్యవసాయ కూలి పనులు, పాడి గేదెలు మేపుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వచ్చే ఆదాయంలో ఏడాదికి రూ.17వేల చొప్పున పెరల్స్‌ సంస్థకు ఏజెంట్ మాటల విని పొదుపు చేశారు. చెల్లించటం పూర్తయ్యి తిరిగి తీసుకునే సమయంలో సంస్థ బోర్డు తిప్పిందని తెలిసింది. ఈ విషయం కోర్టు పరిధిలోకి ఉందని, పెరల్స్ ఆస్తులు అమ్మి మా డబ్బులు ఇస్తారని ఏజెంట్ చెప్పాడు. కానీ పదేళ్లు అయిన అతీగతీలేదు. ఇప్పుడైనా అధికారంలో ఉన్న ప్రభుత్వం గానీ, మళ్లీ అధికారంలోకి రాబోయే ప్రభుత్వం కానీ పెరల్స్ బాధితులను పట్టించుకోని సొమ్ములు చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలి. మా ఊళ్లో వెంకటేశ్వర్లుతోపాటు మరికొందరు ఏజెంట్లుగా పనిచేశారు. కొంతమంది ఇప్పుడు గ్రామంలో నివాసం కూడా ఉండటం లేదు. గ్రామంలో 50మందికిపైగా చెల్లించిన వారు తమ దృష్టిలో ఉన్నారు. సన్నా, చిన్నకారు రైతులు, కూలీలు పొదుపు చేసుకుని మోసపోయారు.

➡️