ఉద్యోగ కల్పనే అతిపెద్ద సవాల్‌

Jun 21,2024 07:55 #jobs, #Reuters survey
  • రాయిటర్స్‌ సర్వేలో నిపుణులు

న్యూఢిల్లీ : దేశ వ్యాప్తంగా నిరుద్యోగ నిర్మూలన, యువతకు ఉద్యోగ కల్పనే ప్రభుత్వానికి అతి పెద్ద సవాల్‌గా మారనుంది. ప్రపంచ ప్రసిద్ధ వార్తాసంస్థ రారుటర్స్‌ నిర్వహించిన సర్వేలో రానున్న ఐదేళ్ల కాలంలో నిరుద్యోగ సమస్యను పరిష్కరించడమే అత్యంత కీలకమని తేలింది. మే 15 నుండి జూన్‌ 18 వరకు దేశవ్యాప్తంగా రాయిటర్స్‌ సంస్థ ఈ సర్వే నిర్వహించింది. సర్వేలో భాగంగా పలువురు ఆర్థికవేత్తలను, విద్యావేత్తలను రారుటర్స్‌ సంస్థ ప్రతినిధులు కలిశారు. వారి అభిప్రాయాలను సేకరించారు. తాము కలిసిన వారిలో 91శాతం మంది నిరుద్యోగ సమస్యను ప్రధానంగా ప్రస్తావించారని, దానిని పరిష్కరించడమే అత్యంత కీలకమని చెప్పారని ఆ సంస్థ గురువారం విడుదల చేసిన ఒక నివేదికలో పేర్కొంది. ఆ నివేదిక ప్రకారం
ఉద్యోగాలను కల్పించడంలో ప్రభుత్వ సామర్ధ్యాన్ని సర్వేలో పాల్గొన్న వారిలో పలువురు ప్రశ్నించారు. గడిచిన కాలంలో ఈ విషయంలో ప్రభుత్వం విఫలం చెందిందని వారు అభిప్రాయపడ్డారు. ‘గత ఆర్థిక సంవత్సరం భారత్‌ 8 శాతం పైగా వృద్థి నమోదు చేసింది. ప్రభుత్వ మూలధన వ్యయం ఇందుకు మద్దతునిచ్చింది. అయినా అసమానతలు కొనసాగాయి, ద్రవ్యోల్బణం కారణంగా ప్రజలు ఒత్తిడికి గురయ్యారు. ఉద్యోగ కల్పన దాదాపుగా జరగలేదు. అరకొరగా జరిగిన చోటు కూడా నామమాత్రపు జీతాలే వచ్చాయి’ అని ఈ నివేదికలో పేర్కొన్నారు ‘ఈ కారణాల వల్లే ప్రధానీ నరేంద్రమోడీ ఆధ్వర్యంలోని బిజెపి ఇటీవల ముగిసిన సార్వత్రిక ఎన్నికలలో భారీగా మెజారిటీని కోల్పోయింది.’ అని తెలిపింది. రానున్న ఐదేళ్ల కాలానికి సంబంధించి ఉద్యోగ కల్పన కోసం నిర్దిష్ట వ్యూహాన్ని కలిగి ఉండాలని, ప్రాథమిక సామాజిక సేవలు అయినా ఆరోగ్యం, విద్య, పోషకాహారం, పారిశుద్ద్య రంగాల్లో ప్రభుత్వ ఉపాధిని భారీగా పెంచాలని పలువురు నిపుణులు సూచించినట్లు పేర్కొంది.

వృద్ది రేటు ఉన్నా….
”భారత్‌లో మనకు చాలా విచిత్రమైన సమస్య ఉంది. వృద్థి రేటు ఎక్కువగా ఉన్నప్పటికీ.. ఉపాధిలో పెరుగుదల లేదు. యువతకు ఉద్యోగాలు, మెరుగైన జీవితాన్ని అందిస్తామని మోడీ అధికారంలోకి వచ్చారు. కానీ పరిస్థితులు చాలా దారుణంగా మారాయి” అని మసాచుసెట్స్‌ అమ్హెర్ట్స్‌ యూనివర్శిటీ ప్రొఫెసర్‌ జయతి ఘోష్‌ తెలిపారు. దేశంలోని 80 శాతం మంది అసంఘటిత రంగంలోనే ఉన్నారని ఇటీవల ఆర్‌బిఐ ఓ రిపోర్ట్‌లో వెల్లడించిన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ గ్రామీణ ప్రాంతాలలో ఉన్న వారిని నిరుద్యోగులుగా నమోదు చేయడం లేదని యూనివర్శిటీ ఆఫ్‌ మాంచెస్టర్‌లో డెవలప్‌మెంట్‌ ఎకనామిక్స్‌ అండ్‌ ఎన్విరాన్‌మెంట్‌ ప్రొఫెసర్‌ బీనా అగర్వాల్‌ చెప్పారు.

➡️