సచివాలయాలతో సత్వర సేవలు : ఎమ్మెల్యే కరణం బలరామకృష్ణమూర్తి

Jan 29,2024 00:01

ప్రజాశక్తి – వేటపాలెం
సచివాలయ వ్యవస్థ ద్వారా ప్రజలకు సత్వర సేవలు అందుతున్నాయని ఎమ్మెల్యే కరణం బలరామకృష్ణమూర్తి అన్నారు. మండలంలోని పాపాయిపాలెంలో నిర్మించిన నూతన సచివాలయం, ఆర్‌బికె, హెల్త్ క్లినిక్ భవన సముదాయాన్ని ఆదివారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ ఒకే ప్రాంతంలో అన్ని ప్రభుత్వ కార్యాలయాలు అందుబాటులో ఉండటం పాలనా సౌలభ్యమని అన్నారు. ఎక్కువగా బడుగు, బలహీన వర్గాలతోనే సాన్నిహిత్యం ఉందన్నారు. చీరాల ప్రాంత ప్రజలకు ప్రశాంత వాతావరణం నెలకొల్పేందుకు పాటుపడతామని గత ఎన్నికల్లో మాట ఇచ్చామని చెప్పారు. అందువలనే ప్రజలు తనకు బ్రహ్మరథం పట్టారని అన్నారు. ప్రజలకు ఇబ్బంది లేకుండా ఉండాలనే ఉద్దేశంతోనే అభివృద్ధి పనులపై దృష్టి పెట్టినట్లు చెప్పారు. తాను ఎంపీగా ఉన్న సమయంలో బాలినేని శ్రీనివాసరెడ్డితో మంచి పరిచయం ఉందని అన్నారు. కరణం వెంకటేష్ బాబు 80శాతం గడప గడపకు కార్యక్రమం నిర్వహించినట్లు చెప్పారు. కుర్రకారు సెల్ఫోన్లను సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఈ కాలంలో రూ.4కోట్లతో పాపాయిపాలెంలో చేసిన అభివృద్ధి గురించి వివరించారు. వెంకటేష్ బాబు మాట్లాడుతూ గ్రామస్తులు తమ ఇంటిలో ఒకడిగా ఆదరిస్తున్నారని కొనియాడారు. భవిష్యత్తులో సమస్యలు ఏమైనా ఉంటే పరిష్కరించుకొని కలిసి అభివృద్ధికి పాటు పడాల్సిన అవసరం ఉందని అన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ జంజనం శ్రీనివాసరావు, వైస్ చైర్మన్ బాబు, వెల్ఫేర్ స్కీమ్స్ స్పెషల్ ఆఫీసర్ రాజా దిబోరా, ఎంపీడీఒ నేతాజీ, పంచాయతీరాజ్ డిఇ శేషయ్య, ఆర్డబ్ల్యూఎస్ ఎఈ రాంకుమార్, డాక్టర్ బాలరాజు, పంచాయతీ కార్యదర్శి పూర్ణకుమారి, ఆర్‌బికె చైర్మన్ పల్లపోలు శ్రీనివాసరావు, వైసిపి మండల అధ్యక్షుడు బొడ్డు సుబ్బారావు, యూత్ ప్రెసిడెంట్ ఆవుల అశోక్ కుమార్ పాల్గొన్నారు.

➡️