ప్రభుత్వ వ్యతిరేకతకు నిదర్శనం ప్రజాస్పందన : విలేకరుల సమావేశంలో ఎంఎల్‌ఎ అనగాని సత్యప్రసాద్

Mar 21,2024 00:04

ప్రజాశక్తి – రేపల్లె
జగన్ అవినీతి పాలనపై ప్రజల వ్యతిరేకతకు నిదర్శనమే ప్రజాగళం సభకు హాజరైన ప్రజా స్పందనని ఎంఎల్‌ఎ అనగాని సత్య ప్రసాద్ అన్నారు. స్థానిక టిడిపి కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇటీవల చిలకలూరిపేటలో జరిగిన ప్రజాగళం సభకు వచ్చిన జన సందోహన్ని చూస్తే ప్రభుత్వంపై ఎంత వ్యతిరేకత ఉందో అర్థమవుతుందని అన్నారు. ఐదేళ్ల జగన్‌ పాలనలో ప్రజలు ఎంత విసుగు చెందారో, ఎంత అణిచివేతకు గురయ్యారోనని అన్నారు. ప్రజల్లో తిరుగుబాటు వచ్చిందనడానికి ప్రజగళం సభ నిదర్శనం అన్నారు. పోలీసుల వైఫల్యంతో జాతీయ రహదారిపై ఇరువైపులా 15 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచి ఇబ్బందులు పడ్డారని అన్నారు. అనేక మంది కిలోమీటర్ల దూరం నడుచుకుంటూ సభా వేదికకు వచ్చారని అన్నారు. 15ఏళ్ల తర్వాత లారీలు, ట్రాక్టర్లపై ప్రజలు సభకు రావడం చూశానని అన్నారు. సిద్ధం సభల పేరుతో అధికార వైసిపి వాలంటీర్ల సహకారంతో సంక్షేమ పథకాలు ఆపేస్తామని, పింఛన్లు నిలిపేస్తామని, నివేసిన స్థలాలు పొందిన లబ్ధిదారుల పట్టాలను రద్దు చేస్తామని బెదిరించి జనాన్ని సమీకరించారని ఆరోపించారు. వాలంటరీలు ప్రజాహితం కోసం పని చేయాలి కానీ పార్టీల కోసం కాదని చెప్పారు. ఎన్నికల కమిషన్ సూచనల మేరకు ప్రభుత్వ అధికారులు పనిచేయాలని అన్నారు. కార్యక్రమంలో టిడిపి రాష్ట్ర కార్యదర్శి గూడపాటి శ్రీనివాసరావు, పంతాన్ని మురళీధరరావు, వెనిగల్ల సుబ్రమణ్యం, టిడిపి రైతు నాయకులు మేక శివరామకృష్ణ, ధర్మ తేజ పాల్గొన్నారు.

➡️