రజకులను ఎస్సి జాబితాలో చేర్చాలి : బిసి సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగమల్లేశ్వరరావు

Feb 6,2024 23:20

ప్రజాశక్తి- మార్టూరు రూరల్
షెడ్యూల్ కులాల జాబితాలో ఉన్న రజకులను రాష్ట్ర విభజనలో ఏ ప్రతిపాధికన బీసీల్లో చేర్చారో చెప్పాలని నేషనల్ దోబీసంగ్ జాతీయ అధ్యక్షుడు, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అన్నవరపు నాగమల్లేశ్వరరావు డిమాండ్ చేశారు. రజకులను ఎస్సీల్లో చేర్చాలని కోరుతూ తిరుపతి నుండి విజయవాడకు రజకుల సమస్యలే ప్రధాన ఎజెండాగా చేపట్టిన మహా పాదయాత్ర మంగళవారం మార్టూరుకు చేరుకుంది. బొల్లాపల్లి టోల్ ప్లాజా వద్ద బీసీ సంక్షేమ సంఘం బాపట్ల జిల్లా ప్రధాన కార్యదర్శి బాపట్ల రవికుమార్, పర్చూరు నియోజకవర్గ అధ్యక్షుడు బంకా మాధవరావు పాదయాత్ర బృందానికి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్బంగా మార్టూరులో రవికుమార్ విలేకరులతో మాట్లాడారు. 1950లో కేంద్ర ప్రభుత్వం గెజిట్‌లో ఉమ్మడి మద్రాస్ రాష్ట్రంగా ఉన్నప్పుడు రజకులు ఎస్సి జాబితాలో ఉన్నరని అన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పడక మునుపు షెడ్యూల్ కులాల జాబితాలో ఉన్న రజకులను రాష్ట్ర విభజనలో ఏ ప్రతిపాదికన బీసీల్లో చేర్చారో ప్రభుత్వ పెద్దలు చెప్పాలని డిమాండ్ చేశారు. రజకులు సామాజిక, ఆర్థికంగా వెనుకబడి ఉన్నారని అన్నారు. ప్రభుత్వం తమను ఎస్సీ జాబితాలో చేర్చాలని కోరారు. రిజర్వేషన్ ఫలాలు విద్య, ఆర్థిక సామాజిక ఎదుగుదలకు దోహదపడితేనే రజకులు ఉనికి చాటుకోగలరని అన్నారు. రజకుల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక నిధులు కేటాయించడంతోపాటు ఎస్సీ రిజర్వేషన్ అమలు చేస్తేనే రాష్ట్రంలో సుమారు 30లక్షల మంది రజకులకు సముచిత స్థానం దక్కుతుందని అన్నారు. 50ఏళ్లు దాటిన రజక వృత్తిదారులకు పెన్షన్ ఇవ్వాలని, రజక మహిళలకు రక్షణ చట్టం ఏర్పాటు చేయాలని, చెరువులు, దోబీగాట్లపై సంపూర్ణ హక్కులు రజకులకే కల్పించాలని కోరారు. రజకులకున్న అన్ని జీఒలు 100శాతం అమలు చేయాలని కోరారు. 2024లో జరిగే ఎన్నికల్లో అన్ని రాజకీయ పార్టీలు ఎలక్షన్ మేనిఫెస్టోలో రజకులను ఎస్సి జాబితాలో చేర్చే అంశాన్ని పొందుపరచాలని డిమాండ్ చేశారు. పాదయాత్రలో జిల్లా ఉపాధ్యక్షులు ఫణిధం శ్రీనివాసరావు, అద్దంకి అధ్యక్షుడు చేబ్రోలు రవిచంద్ర, సిద్ది ఆత్మలింగాచారి, వీరమల్లు చంద్రమౌళి, ఉలిచి శ్రీనివాసరావు, రజక నేతలు పోలూరు సింగయ్య, అద్దేటి అనిల్ కుమార్, పాపారావు, ముక్తిపాటి సాయిబాబా, వాడాలా శ్రీనివాసరావు పాల్గొన్నారు.

➡️