పాఠశాల వినియోగదారుల క్లబ్‌లు : డిఇఓ రామారావు

Nov 26,2023 02:00

ప్రజాశక్తి – బాపట్ల
జిల్లాలో వినియోగదారుల ఉద్యమాన్ని మరింత చైతన్య వంతం చేయడంలో భాగంగా ప్రతి పాఠశాలలో వినియోగదారుల క్లబ్‌లు ఏర్పాటు చేస్తున్నట్లు డిఇఒ పివిజె రామారావు అన్నారు. వినియోగదారుల క్లబ్‌లు, వినియోగదారులను చైతన్యపరిచే 9రకాల పోస్టర్లను ఎంఈఓలు ఉపాధ్యాయులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు హక్కులు, పరిష్కార విధానాలపై అవగాహన కల్పించడం ద్వారా ఆరోగ్యకరమైన వినియోగదారులుగా వ్యవహరించేలా తీర్చిదిద్దుతామని అన్నారు. జిల్లాలోని 212 వినియోగదారుల క్లబ్‌ల ద్వారా ప్రతీ నెలా సెమినార్లు, వర్క్‌షాప్‌లు, వినియోగదారులతో చర్చలు నిర్వహించాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా సైన్స్ అధికారి మహమ్మద్ సాదిక్, శ్రీనివాసరావు, ఎంఈఓ-2 ప్రసాద్, ఫోరం ఫర్ బెటర్ కార్యదర్శి పిసి సాయిబాబు, మున్సిపల్ హై స్కూల్ పిడి కత్తి శ్రీనివాసరావు పాల్గొన్నారు.

బాపట్ల రూరల్‌ : ప్రతి విద్యార్థి వినియోగదారుని హక్కులు తెలుసుకోవాలని మేలుకొలుపు కన్స్యూమర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కార్యదర్శి డి ఇమ్మానియేలు అన్నారు. మండలంలోని వెదుళ్ళపల్లి జెడ్‌పి హైస్కూల్ నందు వినియోగదారుల హక్కుల అవగాహన సదస్సు శనివారం నిర్వహించారు. వినియోగదారుల దినోత్సవం 2023సందర్భంగా వినియోగదారుల వ్యవహారాల శాఖ కమిషనర్ ఆదేశాలు మేరకు ఉన్నత పాఠశాలల్లో విద్యార్థులకు వినియోగదారుల రక్షణ చట్టంపై అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. ప్రతి ఒక్కరూ వినియోగదారులేనని అన్నారు. కొనుగోలు చేసే వస్తువులు, సేవల్లో లోపాలకు తగిన నష్టపరిహారం పొందే అవకాశం ఈ చట్టం ప్రతి ఒక్కరికీ కల్పించిందని అన్నారు. రేపటి దేశభవిష్యత్తు అయిన విద్యార్ధులు ఆరోగ్యంగా ఉండాలని అన్నారు. జంక్ ఫుడ్‌కు, కల్తీ ఆహార పదార్ధాలకు దూరంగా ఉండాలని సూచించారు. ఎరువులు, విత్తనాలు, వస్తువులు కొనుగోలు చేసేటప్పుడు తప్పని సరిగా రశీదు తీసుకోవాలని సూచించారు. వస్తువుల తయారీ తేదీ, తుదిగడువు, తయారీ దారుని చిరునామా, నాణ్యత, బరువు తప్పనిసరిగా పరిశీలించాలని తెలిపారు. విద్యార్ధులు తల్లిదండ్రులకు, బందుమిత్రులకు, స్నేహితులకు చట్టం గురించి తెలియచేయాలని అన్నారు. వినియోగదారుల రక్షణ మండలి సభ్యులు ఎస్‌డి మతీన్ మాట్లాడుతూ సైబర్ నేరాల పట్ల జాగ్రత్తగా ఉండాలని చెప్పారు. నకిలీ, కల్తీ వస్తువులు అమ్మే వ్యాపారులను గుర్తించి అధికారులకు ఫిర్యాదు చేయాలని సూచించారు. కార్యక్రమంలో పాఠశాల హెచ్‌ఎం రామచంద్రరావు, రాధాకృష్ణ, పిఇటి, మాజీ విద్యార్థికమిటీ చైర్మన్ పి శ్రీనివాసరెడ్డి, కె శ్రీనివాస్ పాల్గొన్నారు.

➡️