దేవాంగులకే సీటివ్వాలి : ఎపి దేవాంగ సంక్షేమ సంఘం డిమాండ్

Feb 8,2024 00:23

ప్రజాశక్తి – వేటపాలెం
చీరాల శాసన సభ సీటు దేవాంగులకే కేటాయించాలని ఎపి దేవాంగ సంక్షేమ సంఘం ప్రతినిధులు డిమాండ్ చేశారు. మండలంలోని దేశాయిపేట గ్రామంలో దేవాంగ సంఘం ఆధ్వర్యంలో బుధవారం సమావేశం నిర్వహించారు. సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పుచ్చల రామకృష్ణ మాట్లాడుతూ చీరాల అసెంబ్లీ సీటును దేవాంగులకు కేటాయించాలని ప్రధాన రాజకీయ పార్టీలను డిమాండ్ చేశారు. చీరాల నుండీ 1981, 85లో దేవాంగ కులానికి చెందిన డాక్టర్ చంద్రమౌళి అఖండ మెజారిటీతో గెలిచిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. చీరాల్లో ఉన్న 2 లక్షల ఓట్లలో లక్ష పదివేల మంది బిసిలు ఉన్నట్లు తెలిపారు. వీరిలో చేనేత వృత్తికి చెందిన దేవాంగులు 35వేల మంది ఉన్నట్లు తెలిపారు. చేనేతలు, దేవాంగులు అధికంగా ఉన్న ప్రాంతం కాబట్టే రాబోయే శాసనసభ ఎన్నికల్లో దేవాంగ కులానికి చెందిన వారికే టిక్కెట్ ఇస్తే కచ్చితంగా గెలిపిస్తామని తెలిపారు. రాజమండ్రి రూరల్, పుట్టపర్తి, చీరాల అసెంబ్లీ సీట్లు, హిందూపురం ఎంపీ సీటు దేవాంగులకు కేటాయించాలని డిమాండ్ చేశారు. రానున్న ఎన్నికల్లో ఏ పార్టీ దేవాంగులకు అభ్యర్థిత్వం కల్పిస్తాదో ఆ పార్టీ అభ్యర్థిని గెలిపించుకోవడమే కాకుండా రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో కూడా వారికి మద్దతుగా తాము ప్రచారం కొనసాగిస్తామని అన్నారు. కార్యక్రమంలో దేవాంగ సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు కుర్మా రాహుల్జి, యారాశు అరుణ్ బాబు, దేవల మనుబ్రహ్మ దేవాంగ సంఘం అధ్యక్షులు ఒలుకుల మోహనరావు, కార్యదర్శి చల్లా విజయ్, రాష్ట్ర మీడియా విభాగం ప్రధాన కార్యదర్శి గుత్తి త్యాగరాజు పాల్గొన్నారు.

➡️