ప్రజా వ్యతిరేక చట్టం రద్దు చేయాలి

Jan 17,2024 23:50

ప్రజాశక్తి – బాపట్ల రూరల్‌
ప్రజా వ్యతిరేక చట్టాన్ని రద్దు చేయాలని బార్ అసోసియేషన్ అధ్యక్షులు భీమా లీలా కృష్ణ అన్నారు. ఆంధ్రప్రదేశ్ భూమి హక్కుల యాజమాన్య చట్టం రద్దు చేయాలని బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న రిలే నిరాహార దీక్ష శిబిరంలో ఆయన బుధవారం మాట్లాడారు. ఈ చట్టంలో భూమి కలిగిన వ్యక్తి మరణిస్తే ఆ వ్యక్తి వారసుల పేర్లు, వారి స్థిరాస్తి హక్కు, సదరు టైటిలింగ్ అధికారి నిర్ణయించి, వారి పేర్లు రిజిస్టర్లో నమోదు చేస్తారని అన్నారు. హక్కు నిర్ధారణ విషయంలో వివాదంలు ఉన్నట్లయితే రిజిస్టరింగ్ అధికారి వివాదంను కోర్టుకు రిఫర్ చేస్తారని అన్నారు. భూ యజమాని, భూమి ఎవరైనా ఆక్రమించిన 12ఏళ్లలోపు అతని హక్కును నిర్ధారించి రికవరీ కోసం కోర్టులో దావా వేసే అవకాశం ఉండేదని అన్నారు. కానీ దీని కాలపు రిమితి ఈ చట్టంలో ఐదు సంవత్సరములకు తగ్గించి కాల పరిమితిని కుదించారని అన్నారు. ఈ చట్టం ప్రకారం ఎవరైనా మన భూమిలో అక్రమంగా ఐదు సంవత్సరాలు ఉన్నట్లయితే ఐదు సంవత్సరాల్లోపు యజమాని తన భూమి హక్కును కోల్పోతారని అన్నారు. నిజమైన భూ హక్కుదారులు కాకుండా ప్రభుత్వం నియమించిన అధికారి ఎవరి పేరు నమోదు చేస్తే వారికే యాజమాన్య హక్కు ఉంటుందని అన్నారు. నిజమైన భూ యజమాని తన భూమిపై హక్కు కోల్పోతారని అన్నారు. కబ్జాదారులు భూములను ఆక్రమించవచ్చని తెలిపారు. రాష్ట్రంలో 553కోర్టుల ద్వారా సత్వర పరిష్కారం కానీ సమస్యలు కేవలం 26ట్రిబ్యునల్స్‌ ఎలా పరిష్కరిస్తాయో అన్నారు. ప్రస్తుతం ఉన్న కోర్టులో వేలాది కేసులు సత్వర పరిష్కారం కానందున మండల, జిల్లా స్థాయి ట్రిబ్యునల్స్ ద్వారా త్వరగా పరిష్కరిస్తామని ప్రభుత్వం చెబుతున్న మాటలు పచ్చి అబద్ధమని పేర్కొన్నారు. రాష్ట్రంలో జిల్లా కోర్టులు సీనియర్ సివిల్ జడ్జి కోర్టులో జూనియర్ సివిల్ జడ్జి కోర్టులు మొత్తంగా కలిపి 553 కోర్టుల ద్వారా సత్వర పరిష్కారం కానివి రాష్ట్రంలో ఉన్న 26 ట్రిబ్యునల్స్ ద్వారా సత్వర పరిష్కారం ఏ విధంగా చేస్తారని ప్రశ్నించారు. భూ హక్కుదారుని భూమిపై సమస్య వస్తే వారి హక్కు నిర్ధారించుటకు సివిల్ కోర్టులో దావా దాఖలు చేసే హక్కును హరించిన, రాజకీయ జోక్యంతో టైటిలింగ్ ఆఫీసర్ నిర్ణయించే కబ్జాదారులకు అనుకూలంగా ఉన్న ఈ చట్టం రద్దు చేయమని న్యాయవాదుల తరపున పోరాటం చేస్తున్నామని వెల్లడించారు. ఈ దీక్షలో విన్నకోట సత్యప్రసాద్, కంచర్ల అవినాష్, కత్తి నాగలక్ష్మి, యాతం సతీష్ రాజా, బి నాగ ప్రసాద్ పాల్గొన్నారు.

➡️