సిఎం చిత్తశుద్ధి నిరూపించుకోవాలి

Dec 28,2023 00:32

– మోకాళ్ళ పై కూర్చొని కార్మికుల నిరసన
– 2వ రోజు మున్సిపల్ కార్మికుల సమ్మె
– మద్దతు తెలిపిన ప్రజా సంఘాలు
ప్రజాశక్తి – చీరాల
మున్సిపల్ కార్మికులకు ఎన్నికలకు ముందు సిఎం వైఎస్‌ జగన్ ప్రతిపక్ష నేతగా ఇచ్చిన హామీలు నెరవేర్చి తన చిత్తశుద్ధి నిరూపించుకోవాలని సిఐటియు పట్టణ అధ్యక్షులు ఎన్ బాబురావు అన్నారు. మున్సిపల్ కార్మికుల సమ్మె 2వ రోజు చేరుకుంది. రాష్ట్రవ్యాప్త సమ్మెలో భాగంగా స్థానిక మునిసిపల్ కార్యాలయం ఎదుట మున్సిపల్‌ కార్మికులు మోకాళ్లపై నిలబడి నిరసన తెలిపారు. మున్సిపల్ కార్మికుల న్యాయమైన డిమాండ్ల కోసం రాష్ట్ర ప్రభుత్వంతో అనేక దఫాలు చర్చలు జరిపినప్పటికీ సమస్యలు పరిష్కారం కాని కారణంగా అనివార్యమైన పరిస్థితిలో సమ్మెలోకి నెట్టబడ్డారని అన్నారు. కార్మికులకు ఇచ్చిన హామీ ప్రకారం సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని కోరారు. కార్మికులందరినీ పర్మినెంట్ చేయాలని, కార్మికులకు అవసరమైన రక్షణ పరికరాలైన పనిముట్లు ఇవ్వాలని కోరారు. కార్మికు రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించాలని డిమాండ్ చేశారు. కార్మికుల సమ్మెకు ప్రజావేదిక అధ్యక్షులు గుమ్మడి ఏసురత్నం, 93బీసీ కులాల ఐక్యవేదిక నాయకులు తాడిపోయిన లక్ష్మీ ప్రసాద్, ఎమ్మార్పీఎస్ రాష్ట్ర నాయకులు బుడంకుంట్ల లక్ష్మీ నరసయ్య, చేతివృత్తుల సమన్వయ కమిటీ జిల్లా కన్వీనర్ పి కొండయ్య, కెవిపిఎస్ నాయకులు లింగం జయరాజు, కాగ్రెస్ నాయకులు అంబటి పుష్పరాజు మద్దతు తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ వర్కర్స్ ఫెడరేషన్ పట్టిణ కమిటీ అధ్యక్షుడు నూతలపాటి రాజు, కార్యదర్శి ఎండ్లూరి సింగయ్య, కమిటీ సభ్యులు మానికల శంకర్, దుడ్డు సామెల్, మెతీష, బడుగు కుమారి, మరియమ్మ, శిరీష, తిరుపతమ్మ, తమ్మిశెట్టి యశోద, గూడూరు మేరిబాబు పాల్గొన్నారు.

➡️