భూమిహక్కు యాక్ట్ వెంటనే రద్దు చేయాలి

Dec 21,2023 02:26

ప్రజాశక్తి -రేపల్లె
స్థానిక తాలూకా సెంటర్లో ఏపి టైటిలింగ్ యాక్ట్ 27/2022ని వెంటనే రద్దు చేయాలని బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్‌ కేసన వెంకట గోపాలరావు ఆధ్వర్యంలో బుధవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చట్టమైన 27/22యాక్టు వల్ల ప్రజలు తమ ఆస్తులపై హక్కును కోల్పోతారని అన్నారు. న్యాయస్థానాల మనుగడ కోల్పోయే ప్రమాదం ఉందని అన్నారు. తద్వారా న్యాయవాదులకు తీవ్ర నష్టం కలుగుతుందని అన్నారు. రాజకీయంగా ప్రభావితం అయ్యే ప్రమాదం ఉన్న రెవెన్యూ ట్రిబ్యునల్‌ పరిధిలోకి భూమి హక్కు చట్టాన్ని తీసుకెళితే వాస్తవ హక్కుదారులకు అన్యాయం జరుగుతుందని అన్నారు. భూమి వివాదాలు రెవెన్యూలో జరిగే పొరపాట్ల వల్లనే ఎక్కువగా వస్తుంటాయని అన్నారు. అలాంటి రెవెన్యూ ట్రిబ్యునల్‌ పరిధిలోకి భూమి వివాదాలు పరిష్కరించే హక్కులు కల్పిస్తే పేదలకు తీవ్ర నష్టం జరుగుతుందని అన్నారు. ఇటువంటి ప్రజా, రైతు వ్యతిరేక నల్ల చట్టాలను ప్రభుత్వం వెంటనే పునసమీక్ష చేసి, తక్షణమే రద్దు చేయాలని అన్నారు. లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా సమైక్య ఉధ్యమం చేయాల్సి వస్తుందని హెచ్చరించారు. ఆందోళనలు ఉదృతం చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో న్యాయవాదులు దారం సాంబశివరావు, ఒడుగు రాంబాబు, మేకా పూర్ణచంద్రరావు, ఆళ్ళ సూరిబాబు, నాగంజనేయులు, బ్రహ్మం, పవన్ కుమార్, కొలుసు రామారావు, నాగరాజు, శ్రీవాణి పాల్గొన్నారు.

➡️