అడుగంటిన తాగునీటి చెరువులు : తాగునీటికి తప్పని ఇక్కట్లు

May 20,2024 23:02 ##parchuru #water

ప్రజాశక్తి – పర్చూరు
పర్చూరుకు మంచినీటి కష్టాలు ముంచుకొచ్చే పరిస్థితి ఏర్పడింది. వేసవిలో నీటి ఎద్దడిని అధికమించేందుకు ప్రభుత్వం విడుదల చేసిన సాగరు నీరు మూడు, నాలుగు ముచ్చటగా మిగిలిపోయాయి. నీటిని చెరువులకు నింపేందుకు అధికారులు ముందస్తు చర్యలు చేపట్టకపోవడంతో నీటి సరఫరా ప్రశ్నార్థకంగా మిగిలింది. చెరువులను ఆర్డబ్ల్యూఎస్, పంచాయతీ అధికారులు సమన్వయంతో సాగర్‌ జలాలతో చెరువులు నింపాల్సి ఉంది. సకాలంలో సంబంధిత అధికారులు స్పందించక పోవడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని ప్రజలు విమర్శిస్తున్నారు. దీనికి తోడు పర్చూరు ఆయకట్టు చివర ఉండటం సాగర కాలవల్లో చిల్ల చెట్లు, ముళ్ళ పొదలు పెరిగిపోయి నీటి సరఫరా జరగకపోవడం ప్రధాన కారణం. దీనివల్ల పర్చూరు చెరువుకు సాగర్‌ నీరు అరకొరగానే చేరింది. పర్చూరులో ఉన్న రెండు మంచినీటి చెరువుల్లో ఒక చెరువులో నీరు పూర్తిగా అడుగంటింది. ప్రస్తుతం వేసవి దృష్ట్యా ఎన్ని రోజులు నీరు అందుబాటులో ఉంటుందో అర్థం కాని పరిస్థితి ఏర్పడింది. పర్చూరులో 20వేలకు పైచిలుకు జనాభా ఉంది. ప్రస్తుతం రెండు రోజులకు ఒకసారి పంచాయతీ ద్వారా నీటి సరఫరా చేస్తున్నారు. పర్చూరు ఆర్‌ఒ ప్లాంట్ ద్వారా చుట్టుపక్కల గ్రామాల ప్రజలు మంచినీటిని వాడుకుంటున్నారు. దీంతో ప్రస్తుతం చెరువులో ఉన్న నీటి పరిమాణం తక్కువగా ఉండటంతో వేసవిలో నీటి పరిస్థితి ఎలా ఉంటుందో అని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. పర్చూరు, పెద్దివారిపాలెం, నాగులపాలెం చెరువులు తిమ్మరాజుపాలెం పరిస్థితి ఇదే విధంగా ఉంది. ఏది ఏమైనా ఆయా శాఖాధికారులు జాప్యం ప్రజలకు శాపంగా మారింది. దీంతో వేసవిలో నీటి ఎద్దడి తప్పదని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. రుతు పవనాలు వస్తాయని, వర్షాలతో కాస్త చెరువుకు నీరు చేరుతుందని ఆశగా ఎదురు చూస్తున్నారు.

➡️